Sunday, December 30, 2012

2012 !

2012! ఈ ఏడాదిలో నేను చాలా ఏడ్చాను, నవ్వాను, పడిపోయాను, లేచి నిలదొక్కుకున్నాను. కొన్ని బంధాలను కోల్పోయాను.. మరి కొన్ని కొత్త బంధాలను ముడి వేసుకున్నాను... మీలాటి మంచి స్నేహితులనూ కలుసుకున్నాను. వీటన్నిటి నుండీ ఎంతో కొంత నేర్చుకుని ఇప్పుడు మధురానుభూతులన్నీ కొంగునకట్టి దాచేసుకొని  2012 గడప చివర నిలబడి చిగురించబోతున్న నూతన సంవత్సరాన్ని చూస్తూ కొత్త ఉత్సాహంతో చిరునవ్వుల స్వాగతం పలుకుతున్నాను.  

Facebook image

ఈ రోజు ఇంకా 30 తారీఖే కదా ఇప్పుడే న్యూ ఇయర్ గురించి రాసేస్తోందేంటీ పిల్లా అనుకుంటున్నారా? కొత్తగా పిన్ని పోస్ట్‌లో చేరాను కదండి మరీ.. క్షణం తీరికుండట్లేదు :) అందుకే నా ఫ్రెండ్స్ కూడా నాకోసమని న్యూ ఇయర్ పార్టీని నిన్నే సెలబ్రేట్ చేసారు. ఆ గ్రూప్ పిక్ ఇదిగో.. 

నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం!

 చిన్ని నాన్నలు వచ్చాక, లైఫ్ లో మొదటి సారి రోజుకి 48 గంటలుంటే గాని కొంతలో కొంత సరిపోదేమో అనిపిస్తోంది! అందుకే రేపు, ఎల్లుండ గురించి ఆలోచించకుండా ఈ వేళే రాసేస్తున్నాను. 

మీకు, మీ కుటుంబ సభ్యులకూ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు :)
2013 మీకు ఎంతో శుభకరంగా, సంతోషకరంగా ఉండాలని.. మీ ఆశలు, ఆశయాలు ఫలించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. 

ప్రియా 

Wednesday, December 19, 2012

ఓ వర్షం కురిసిన ఉదయం

నిద్రపోతున్న నా మొహాన్ని తెల్లగా తెల్లారకుండానే వచ్చి ముద్దాడుతున్న నీటి ముత్యాలను దుప్పటితో తుడిచేసుకొని కళ్ళు తెరవకుండానే "అమ్మా.. లాస్ట్ 10 మినిట్స్ ప్లీజ్.." అనేసి అటు వైపు తిరిగి  మత్తుగా ముడుచుకుని పడుకునేలోపు తట్టింది నా బుర్రకి. ఈ రోజు శనివారం కదా అమ్మ లేపదుగా?!! గాజుల శబ్దమూ రాలేదు.. "ప్రియమ్మా..." అన్న పిలుపూ వినబడలేదు! అంటే అమ్మ లేపలేదు. ఇంకెవ్వరు నన్ను లేపే ఛాన్స్ లేదు. ఆలోచిస్తుండగానే చిటపట చినుకుల రాగం చెవులను తాకింది. ఏంటి నిజంగా వర్షమా?! ఇది వర్షాకాలం కాదే.. హూం.. నేనున్నది  చెన్నైలో కదూ..! చప్పున ఇటు తిరిగి కిటికీ లోనుండి చూస్తే హోరున వర్షం.. అప్పటి వరకు అటు తిరిగి పడుకున్నందువల్ల నా తలా.. దుప్పటీ కాస్త తడిచాయి. నా మొహం మండిపోను.. స్పర్శ కూడా తెలిసిచావలేదే నాకు.. అనుకుంటూ లేచి కిందకు వెళ్లాను. 

అమ్మ కూడా ఇంకా లేవలేదు కాబోలు ఇంట్లో అలికిడే లేదు. హల్లో సోఫామీద మడత పెట్టి ఉంచిన దుప్పటి తీసి భుజాల మీదుగా కప్పుకొని టీవీ మీద ఉన్న కెమెరా పట్టుకొని వరండాలో కాళ్ళలో మొహం దాచుకొని కూర్చున్నాను. ఈ సమయంలో శ్రావ్యమైన సంగీతమూ వినగలిగితే.. ఎంత బావుణ్నో.. కాని లేచి వెళ్లి తెచ్చుకోవడానికి బద్ధకం. చిన్నగా నిట్టూరుస్తూ కళ్ళు  మూసుకున్నాను. నేను ఆశించినదానికన్నా మెల్లని  సంగీతం చెవిన పడుతోంది. అల్లంత దూరం నుండి ఎప్పుడెపుడు భూదేవిని ముద్దాడదామా అని దూసుకొస్తున్న చినుకుల శబ్దం నాలో ఉత్తేజాన్ని పెంచింది. ఆ అపురూప దృశ్యాన్ని చూడాలని కళ్ళు తెరిచాను. లేలేత ఆకులను.. విరిసీ విరియని పువ్వులను సుతిమెత్తంగా ముద్దాడుతున్న చినుకులని చూసి ముచ్చట పడి నాకు కనువిందుచేసిన కొన్ని దృశ్యాలను నా కెమెరాలో బంధించానిలా.. మీరు కూడా ఓ లూక్కేయండి మరి :)అప్పటికే వర్షం ఆగిపోయి కాస్త తుపర మాత్రం పడుతూవుంది అంతే. ఇక ఆగలేక.. మరిన్ని అందాలు చూడాలని సైకిల్ తీసుకొని బయటకు వెళ్లాను. ఎవ్వరు లేరు.. గాలికి ఊగి ఊగి అలసిపోయిన చెట్లు, నేల రాలిన పువ్వులనూ చూస్తూ కాస్త ముందుకెళితే.. బీచ్‌లోని అలలు ఉత్సాహంగా ఉరకలేస్తూ కనిపించాయి. వాటిని నేను నేను వర్ణించలేను. నా బుద్ధి చాలదు. కనురెప్ప వేయకుండా చూస్తూ కూర్చుండిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో మరి.. క్రికెట్ ఆడుకోవడానికి వచ్చిన పిల్లల అరుపులతో తేరుకొని ఇంటి దారి పట్టి వస్తుంటే ఇదిగో.. ఈ కాకి కనిపించింది. ఎంత ముద్దుగా ఉందోనని ఫోటో తీసుకుని మా ఇంటి సందులోకి నడిచాను.

 కాని మా వీధి నా మీద అలిగింది. అన్నిటిని చూసి మురుసుకుని ఫోటోలు తీసి దాచుకున్నావ్ గాని నన్ను పట్టించుకోలేదని! నిన్ను మరువగలనా అంటూ దాన్నీ క్లిక్‌మనిపించాను.. :) :)

Thursday, December 13, 2012

"చిన్ని నాన్నలు" అని పిలవబడుతున్న"నేను"

ఈ కొత్త ప్రపంచాన్ని.. మా వాళ్ళనూ, మరు ముఖ్యంగా ఎప్పుడూ కబుర్లు చెబుతూ అమ్మ బొజ్జ మీదుగానే నన్ను ముద్దులాడే మా పిచ్చి పిన్నినీ చూడాలనీ.. 12.12.12. న వస్తానని డాక్టర్ చెప్పిన మాటలను కాలరాస్తూ స్పెషల్ డేట్ కాకపోయినా పరవాలేదు త్వరగా మిమ్మల్నందరినీ కూడా పలకరించి ఆశిస్సులు తీసేసుకుందామని మొన్ననే అనగా డిసెంబర్ పదో తారీఖునే అమ్మను ఏడిపిస్తూ, ఆమెను ఏడిపించినందుకు నేనూ ఏడుస్తూ తెల్లవారుజామునే బొజ్జ నుండి బయటపడ్డాను. నేనూ అమ్మా ఇద్దరం క్షేమం. వారి మాట ప్రకారం కాకుండా నా ఇష్టానుసారంగా వచ్చేసినందుకో ఏమో గాని నా ఊపిరి తిత్తుల్లో గడ్డ ఉందని చెప్పి మా వాళ్ళందరిని బాగా ఏడిపించి నాకు నానా టెస్టులు చేసి బోలెడు డబ్బు గుంజి  "ఈ ఈ ఏమి లేదండీ. మా అనుమానం నిజం కాదు. మీ చిన్ని నాన్నలు బాగున్నారని చెప్పి" నన్ను వారికిచ్చేసి వాళ్ళను బ్రతికించారు. నన్ను ముద్దులాడే ఓపిక ప్రస్తుతానికి అమ్మకు లేదు.. ఆ ముచ్చటంతా మా పిన్నీ, అమ్మమ్మా, నానమ్మా తీరుస్తున్నారు. మీకు తెలుసా మా పిన్ని నాకు బోలెడు బట్టలు, బెడ్, కారియింగ్ బాగ్, చిన్ని చిన్ని చేడ్డీలు... ఇదిగో అలా నవ్వొద్దు నాకసలే సిగ్గు. నేను పుట్టాకా మొదట మా నాన్న చేతిలో పెట్టారు. నాకేమో అప్పటికే ఆకలి. మా నాన్న చొక్కా చప్పరిస్తే మా పిన్ని "అయ్యయో చిన్ని నాన్నలూ.. అలా చప్పరించకూడదు" అంటూ నన్ను లాగేసుకుంది. ఆ రోజంతా వాళ్ళను, వీళ్ళను.. నా చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ గడిపేశాను. అందరిని నవ్వుతూ వారి కళ్ళలోకి చూస్తూ పలకరిస్తున్నాను. ఈ మాత్రానికే నన్ను చూసుకొని వీళ్ళంతా తెగ మురిసిపోతున్నారు. నాకన్నీ మా పిన్ని పోలికలేనట చూసిన వాళ్ళందరు చెబుతుంటే మా నాన్న భలే ఉడుక్కుంటున్నాడు :P. నన్ను చూడ్డానికి రేపు మా బాబాయ్ వస్తున్నాడు. మా నాన్నేమో.. నల్ల బంగారమా మా అమ్మ చమనచాయా మా నానమ్మోళ్ళందరూ నల్ల బంగారాలేనా నేను కూడా అలాగే ఉంటానేమో అనుకున్నారంట అందరు. మరి నేనేమో మా అమ్మమ్మలా, పిన్నిలా మంచి రంగుతో పుట్టేసరికి మా నానమోళ్ళందరు తెగ మురిసిపోతున్నారు. మా నాన్న గురించి పిన్ని మా అమ్మ తో ఏమందో తెలుసా "అమ్మో కొడుకు పుట్టినప్పటి నుండి మీ ఆయన సల్మాన్ ఖాన్ పెద్దన్నయ్యలా నడుస్తున్నాడే" అని! అమ్మ కూడా నవ్వేసింది. నాన్నేమో వాళ్ళ స్నేహితులతో "అరేయ్! సింహం రా సింహం పుట్టింది" అని చెబుతూ మురిసిపోతున్నాడు. అసలు మా అమ్మోళ్ళింట్లో అందరూ ఆడపిల్లలే! అందుకే నేనూ ఆడపిల్లనవుతానని పిన్ని ఆశాశగా "చిట్టి చామంతి" అని పిలుచుకుంది. కాని నన్ను చేతుల్లోకి తీసుకోగానే కళ్ళ నిండా నీళ్ళతో నన్ను ముద్దు పెట్టుకుంటూ "చిన్ని నాన్నలు" అంది. ఇప్పుడు అందరు అలాగే పిలుస్తున్నారు నన్ను!  మరేమో మరీ.. నన్ను చూసి అందరు ఎన్నో నెలా ఎన్నో నెలా అనడుగుతుంటే అమ్మా, పిన్నీ భలే కంగారు పడిపోతున్నారు నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని :).  ముందు మా పిన్ని నేను పుట్టానని, అమ్మా నేనూ క్షేమం గా ఉన్నామని చెబుతూ 4 లైన్స్ లో ముగించేద్దామనుకుంది. కాని మా పిన్నిని ఒప్పించి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని చెప్పి ఇలా వచ్చాను. ఏంటీ.. మీకూ నన్ను చూడాలని ఉందా..? ఉష్.. ఇదిగో.. చూడండి. మా పిన్నికి చెప్పకండే నాకెక్కడ దిష్టి తగిలేస్తుందోనని కంగారు పడుతుందిగా మరి.
ముద్దొస్తున్నా కదూ.. హ హ.. :D
నేను ఇంత కష్టపడి మిమ్మల్ని పలరించి ఆశిర్వచనాలు పొందుకుందామని వచ్చి బోలెడు కబుర్లు చెప్పాక అన్ని వినేసి  మీరు మాట్లాడకుండా వెళ్ళిపోతే నాకు బాధేస్తుంది మరి :( 

Friday, December 7, 2012

ప్రేమతో..

ఈ రోజు నాకెంతో ప్రత్యేకం, సంతోషకరం. నా మనసుతో పాటు జీవితాన్నీ చిరునవ్వులమయం చేసిన నా ముద్దుల మూట పుట్టిన రోజు ఈ రోజు. ముందుగా తనకు నా ప్రేమపూర్వకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు :) 

Google image

ఈ శుభ సందర్భాన మీరు కూడా  మీ మంచి మనసుతో.. నా అనూ (తననే కాదూ.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారిని కూడా పనిలోపనిగా జ్ఞాపకం చేసుకోండీ.. నిండు నూరేళ్ళూ ఆయురారోగ్యానందాలతో భగవంతుని దయందు వర్ధిల్లాలని ఆశీర్వదించాల్సిందిగా  కోరుతున్నాను :)

మేమిద్దరం కలిసి సెలెబ్రేట్ చేసుకునే నాలుగో పుట్టిన రోజు ఇది. మొదటి ఏడాది ఒక గ్రీటింగ్ కార్డ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను (ఎందుకంటే అప్పటికి నాకు అంత స్పెషల్ ఏమీ కాదు). రెండో ఏడాది బహుమతిగా తనకోసం నాన్-వెజ్, అందునా చేపలు వండడం నేర్చుకొని నానా తిప్పలూ పడి బెరుకు బెరుకుగా ముట్టుకుంటూ కళ్ళలో నీళ్ళు తిరుగుతూ, ఆ వాసన పడక వాంతొచ్చినట్లు అనిపించినా తల తిప్పుకొని ఇదిగో.. ఇలా కడిగేసి..చక్కగా ఇగురు పెట్టాను. వేడి వేడి అన్నం, చేపల ఇగురు తన కోసం, మొక్క జొన్న గింజలు నాకోసం బాక్సుల్లో పెట్టుకొని బీచ్‌కెళ్ళి ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాక తీసుకెళ్ళినవి బయటకు తీసాను. ముందు ఆశ్చర్యపోయి "ఛీ ఛీ ఇంకెప్పుడు నాకోసమని గాని మరే కారణం చేత గాని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకోవడం లాటి పిచ్చి పనులు చేయకు" అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అయిష్టంగానే తిన్నాడు. నా మొహమయితే పూర్తిగా మాడిపోయింది. "వావ్.. చేపల కూర నా కోసం చేసావా?! హౌ స్వీట్" అంటూ ఆవురావురుమని తింటాడు.. ఆ తర్వాత నా సన్మాన కార్యక్రమం ఘనంగా చేస్తాడనుకుంటే, ఇలా క్లాస్ పీకి మొహం ముప్పై మూడొంకరలు తిప్పుతున్నాడేవిటో నని తెగ ఇదై పోయాను. పోనీ తిన్నాక పొగుడుతాడులేనని నన్ను నేను ఒదార్చుకున్నాను కాని అలా జరగలేదు సరికదా నాకంటే దారుణంగా మొహం మాడ్చుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో అర్ధమై చావక, "కూర బాగోలేదో ఏమో ఖర్మం" అనుకుని కదిపితే కొట్టేస్తాడేమోనని మౌనంగా కూర్చున్నాను. కాసేపటికి పాపమనిపించిందోమో "కూర చాలా బాగుంది. కాని ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టుకోకు. నాకు నచ్చదు సరేనా" అంటూ వార్నింగ్ ఇచ్చి వదిలేసాడు. ఆ క్షణాన నాకు అర్ధమవలేదు కాని అర్ధమయ్యాక తను మరింత నచ్చేసాడు. ఏదో తెలియని భావాలతో పెద్దగా మాట్లాడుకోలేకపోయినా మరచిపోలేని అనుభూతిని సొంతం చేసుకున్నాం ఆ వేళ.

మూడో ఏడాది, అర్ధ రాత్రి బీచ్ లో కేక్ కట్ చేయించాలని భారీగా ప్లాన్ చేసాను గాని చెప్తే ఇంట్లో తంతారు. ఇంట్లో వాళ్ళ సంగతేమో గాని ముందు అనూనే ఉతికి ఆరేస్తాడు. అందుకే ఆ ఆలోచనను విరమించుకొని బుద్ధిగా "రేపు ఉదయం ఐదు గంటలకు రా జాగింగ్‌కి వెళదాం" అని అసలు విషయాన్ని చెప్పకుండా "ఊ" అనే వరకు ఊరుకోకుండా విసిగించాను. "ఆ అది లేచినప్పుడులే" అనుకుని సరే అన్నాడట! నేనేమో నాలుగింటికే  ఫోన్లు చేసి ప్రాణాలు తోడేసాను. చివరకి, కాంపస్‌లో ఆ టైంకి బైక్ తీస్తే బయటకు రానివ్వరని పాపం ఆ చలిలో వణుక్కుంటూ సైకిల్ మీద గంటన్నర ప్రయాణం చేసి 5.30 కి చేరుకున్నాడు. ఇటు నేనేమో తనకు ఆకలేస్తుంది కదా బ్రేక్ ఫాస్ట్ కూడా తీసుకెళదామని ఆ పని కూడా ముగించుకునే సరికి 5.30 అయిపోయింది. కేకు, కాండల్, బ్రేక్ ఫాస్ట్, వాటర్ అన్నీ బాగ్ లో పెట్టుకొని గేటు దగ్గరకు వచ్చాక గుర్తొచ్చింది. అగ్గి పెట్టె మర్చిపోయానని! మళ్ళీ లోపలికి వెళ్లాను. అనూ ఏమో ఫోనులో తిట్లు "త్వరగా రా త్వరగా రా అని అర్ధరాత్రి నుండి గోల చేసి లేపేసి తీరా కష్టపడి ఇంత దూరం సైకిల్ తొక్కుకుంటూ వస్తే గంటయినా దేవీ గారు బయటకు రారు .. ... ... .." అని. అసలే ఎక్కడ తెల్లారిపోతుందోనని కంగారు పడుతూ పరుగులు పెడుతున్నానా.. అసలు ఎప్పుడైనా ఇంత పొద్దున్న లేచి ఉంటానా? ఎగ్జామ్స్ అప్పుడు అమ్మ, చెంబుడు నీళ్ళు మొహాన కొట్టి లేవవే లే అని అరిచి గీ పెట్టినా లేచానా??!! మొహం తుడుచుకొని అటు తిరిగి పడుకొనిపోలేదు.. హుం.. ఇప్పుడు ప్రేమ కొద్దీ సర్ప్రైస్ ఇద్దామని నాకు నేను గా లేచి ఇంత చేస్తే అర్ధం చేసుకోవట్లేదు చూడు అని బాగా బాధ పడ్డాను (ఈ విషయాలేవీ తనకు తెలియవుగా నన్న స్పృహ కూడా లేకుండా పోయింది నాకు :P ). ఎలాగో అవన్నీ మోసుకుంటూ ఆపసోపనాలు పడి ఐదూ నలభై ఐదుకి తనని చేరుకున్నాను. ముందు ఒక వింతగా ఎక్స్ప్రెషన్ ఇచ్చి తరువాత కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండిపోయాడు. "అమ్మో తెల్లారిపోతోంది త్వరగా కట్ చెయ్" అని తొందరపెడితే తేరుకుని కేక్ కట్ చేసి నాకు తినిపించి తనూ తిన్నాడు :). మరి ఈ ఏడాదేమో తను వాళ్ళింట్లో... నేను ఇక్కడ :(  

ఇన్నేళ్ళలో ఎన్నో ముచ్చట్లు, సరదా తగాదాలు, చిన్న చిన్న అపార్ధాలు, అంతులేని ఆనందాలు, ఏవేవో ఊసులు, అందమైన అనుభవాలు... అధ్బుతం గడిచాయి రోజులన్నీ. నేనెన్నడు అనుకోలేదు నా జీవితం ఇంత రంగులమయంగా మారుతుందని! దేవుడు నాకెన్నో బహుమానాలిచ్చాడు.. కాని అనూ తో నా బంధమనే బహుమానం మాత్రం చాలా అమూల్యం, అపురూపం, ప్రత్యేకం. నేను శాశ్వతంగా నిద్రించే వరకు ఈ "అను"బంధాన్ని ఇంతే అందంగా ఉంచమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. 

నేను అల్లరి చేస్తున్నపుడు చంటిపిల్లాడై నాతో ఆడతాడు.. అది శృతి మించినపుడు నాన్నలా మందలిస్తాడు. కలతచెంది కన్నీరు పెట్టినపుడు అమ్మలా ఆప్యాయంగా ఆదరించి,  తోబుట్టువులా ఓదారుస్తాడు. స్నేహితుడిలా మదిలోని సంగతులన్నీ పంచుకుంటాడు..తన చిలిపి చేష్టలతో మనసుకి చక్కిలిగింతలు పెడతాడు. ఇంతకంటే ఏం కావాలి? నేను కోరుకున్నంతకంటే గొప్ప మనస్తత్వమున్న, ప్రేమించగలిగిన తోడు దొరికింది నాకు!! ఈ విషయంలో మరోసారి దేవునికీ, మా అత్తమామ గార్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను (అంత చక్కగా అతన్ని తీర్చిదిద్దినందుకు). 

Tuesday, November 27, 2012

చీరలు

అబ్బబ్బా.. ఈ నెల మొదట్లో నేను ఏ తోక... అహ తోకలు తొక్కే అవకాశమే లేదండీ.. అయితే గియితే బట్టలుతికేప్పుడు ఏ చీర కొంగో తొక్కుంటాను. అది ఏ కొంగు ప్రభావమో మరేమో గాని ఈ నెలలో అచ్చంగా 5 చీరలు సొంతమయ్యాయండి!!! అచ్చంగా అని ఎందుకన్నానంటే, నా దగ్గర 17 చీరలున్నా..  మా అక్కావాళ్ళింటికెళ్ళేడపుడు కావాలనే ఒక జత తక్కువ పట్టుకెపట్టుకెళ్లి (వీలైతే అసలేమి తీసుకెళ్లకుండానే.. :P ), వచ్చేడపుడు "అయ్యయో ఇప్పుడు వేసుకెళ్ళడానికి ఏమి లేవే.. హూ.. పోనిలే ఇంకేం చేస్తాను టైం అయిపోతోంది" అంటూ గబగబా కబోర్డ్ దగ్గరకెళ్ళి నచ్చిన చీర కట్టేసుకొని మళ్ళీ 2 నెలల వరకు వాళ్ళింటి వైపు కూడా తొంగి చూడను. ఈ లోపో, తర్వాతో అక్క ఇంటికొచ్చి గోల చేసి తీసుకెళ్ళిపోవడమో, అమ్మ చేత తెప్పించుకోవడమో చేస్తుంది. అలా కాకుండా అచ్చంగా నాకే ఐదు చీరలొచ్చాయి ఈ నెల.
మొదటి చీర మొన్న మా అక్క శ్రీమంతానికి అమ్మ కొనిచ్చింది. రెండోది వచ్చిన బంధువుల్లో ఒకరు కానుకగా ఇచ్చారు. మూడోది అక్కా వాళ్ళ అత్తింటి వాళ్ళు పెట్టారు. నాలుగోది దీపావళి సందర్భంగా మా అత్తగారు పెట్టారు. ఐదోది కార్తీక దీపం రోజున ఇంటికి వచ్చావు మహా లక్ష్మిలా అంటూ మా మేనేజర్ వాళ్ళ అమ్మ గారు పెట్టినది.
భలే భలే.. నా సంబరానికి అసలు హద్దే లేదండీ బాబు. ఆఫీస్ వర్క్, అక్క బొజ్జలో ఉన్న చిట్టి చామంతితో కబుర్లు, తనకు సేవలు, మరో వైపు ఇంటి పని.. పెళ్లి పని.. హబ్బ! వీటి మూలంగా ఈ నెలంతా మీతో ఏమీ పంచుకోలేకపోయాను. కాని ఈ చీరల సంబరాన్ని మాత్రం అణుచుకోలేక ఇలా వచ్చేసా :)
ఏంటీ ఈ మాత్రానికే ఇంత సంబరమా అనుకుంటున్నారా? అయ్యో.. చీరల మీద నాకున్న ప్రేమ అట్లాంటిట్లాంటిది కాదండీ బాబు. స్కూల్ చదివే వయసులో అమ్మ నిద్రపోతూ ఉంటే.. నచ్చిన చీరలన్నీ బయటకు తీసేసి.. కట్టుకోవడం రాక చుట్టేసుకొని అమ్మ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిలబడి మహా మురిసిపోయేదాన్ని :D అమ్మ పైకి "చీరలన్నీ పాడు చేసేస్తున్నావ్ కదుటే" అంటూ కసిరి విసుక్కున్నా.. నా కంటే ఎక్కువ మురిసిపోయేది అలా నన్ను చూసి! ఏ విషయంలోనైనా అలిగి తల మీదుగా నీళ్ళు పోసేసుకుని మంచం కిందకో, డైనింగ్ టేబుల్ కిందకో దూరి ఊ రాగం పాడుతూ వెక్కిళ్ళు పెడితే కాసేపు ఊరుకొని తర్వాత నాకు నచ్చే చీర ఏదైనా తీసుకొని అమ్మ కూడా లోపలి దూరి వచ్చి "బంగారు కొడుకు కదూ.. ముద్దుల మూటమ్మా ఇదీ.. అంటూ బుగ్గలు పుణికి ముద్దు పెట్టుకుని, ప్రియమ్మకి ఇప్పుడు అమ్మ చీర కడుతుందిగా" అంటూ లాలించి బయటకు తీసుకొచ్చేది.
చెప్పాలంటే చాలా విషయాలున్నాయి కాని ఇప్పుడు రాయలేకపోతున్నా.. మరొక పోస్ట్‌లో రాస్తానే.. ఇప్పటికైతే నా ట్రీట్ ఖాతాలో ఈ చాక్లెట్లు తిని మీరూ ఆనందించండి :)
Google image
 
Wednesday, November 7, 2012

"చిన్ని" స్నేహం

"మీ రొమాంటిక్ లవ్ స్టోరీని మంచి సస్పెన్స్ తో కొనసాగిస్తున్నారు.  Nice.. :)" అని నా ప్రేమాయణం పార్ట్ 3 కి ఆమె పెట్టిన కామెంట్‌తో మొదలయింది మా పరిచయం. ఓ రోజు  తన బ్లాగ్‌లో "రెబల్" సినిమా రివ్యూ చదివి ఆ సినిమా చూడాలన్న ప్లాన్ ని పక్కన పెట్టి తనకు థాంక్స్ చెప్పి, తాండవం మూవీ చూడాలనుకుంటున్నాను.. అదెలా ఉందొ కనుక్కోవాలి అన్నాను. వారం రోజుల్లోపే తన నుండి నాకో మెయిల్ వచ్చింది. ఆ సినిమా చూసాను, బాగుంది అంటూ. నేను మాములుగా అన్న మాటను గుర్తుంచుకొని పర్సనల్ గా మెయిల్ పంపేసరికి  ఆనందపడిపోయాను. బదులుగా థాంక్స్ చెబుతూ వేడి వేడి కాఫీ పిక్ పంపి, ఇంకా అండీ లు.. గార్లు ఎందుకండీ సింపుల్‌గా ఏకవచనం అయితే బావుంటుందేమో అన్నాను. అలా మెయిల్స్ నుండి చాట్స్ కి షిఫ్ట్ అయ్యాం. రెండో రోజు నేను అడక్కుండానే తన ఫోన్ నెంబర్ ఇచ్చేసింది!! "నేనే అంటే నన్ను మించిన తింగరి దొరికిందే (పట్టించుకోకు చిన్నీ :P )" అనుకుంటూ చాట్ చేస్తూనే ఫోన్ చేసాను. ఎత్తలేదు! దెబ్బకి నాకు చెమటలు పట్టేసాయి
"వామ్మో ఈ అమ్మాయి తింగరి అనుకొని నేను నా తింగరితనాన్ని ప్రూవ్ చేసుకోలేదు కదా.. అయినా ఏ అమ్మాయైనా అలా నెంబర్ ఇచ్చేస్తుందా తెలియని వారికి? అసలు అమ్మాయో కాదో" అని వర్రీ అయిపోతుంటే తన నుండి ఫోన్. ఎత్తి "హలో, హలో" అంటే మాట్లాడదాయే?! కొన్ని సెకండ్స్ తరువాత "ఆ ప్రియా" అంది. అప్పుడు తనకు జలుబట. చాట్‌లో చెప్పింది కాని మర్చిపోయా. వాయిస్ కాస్త బండగా ఉండేసరికి నా గుండె కాస్త స్లిప్ అయింది. ఈ లోపు "ఎలా ఉన్నావ్? నీ నుండి కాల్ రావడం సంతోషంగా ఉంది" అంటూ మాటలు కలిపేసరికి ధైర్యం వచ్చేసింది. హమ్మయ అమ్మాయే.. చ ఛ నేనూ నా వెధవ అనుమానాలును అని తిట్టుకుంటూ చాట్‌లో ఎలా
అయితే మాట్లాడుకుంటామో అలానే హ్యాపీ హ్యాపీ గా మాట్లాడేసా. తెలియకుండానే 20 మినిట్స్ అయిపోయాయి! ఇలా ప్రతి రోజు మాట్లాడుకుంటూ ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నాం.  తన మనసు ఎంతో సున్నితమైనదని.. తన స్నేహంలో నిజాయితీ ఉందని అర్ధం చేసుకోవడానికి, అర్ధమయ్యాక  స్నేహం బలపడడానికీ
పెద్ద సమయం పట్టలేదు. పోయిన వారం భరత్ తో మాట్లాడుతున్నపుడు తనకు హైదరాబాద్ లో పని ఉందని, వచ్చే వారం వెళుతున్నానని చెప్పాడు. నాకు వెంటనే చిన్నీ గుర్తొచ్చింది. నేనూ వస్తాను హైదరాబాద్‌కి.. నా ఫ్రెండ్‌ని కలవాలి అని చెప్పాను. "ఎలా వస్తావు ఒక్కతివే? 14, 15 అవర్స్ జర్నీ చేయాలి, టికెట్స్ దొరుకుతాయో లేదో తెలియదు.. అయినా ఎవరా ఫ్రెండ్?" అన్నాడు. తనకు ముందే చెప్పాను చిన్నీతో నా స్నేహం గురించి. ఆమెను కలవడానికే అని చెబితే "నువ్వు నిర్ణయించుకోవడం కాదు. ముందు ఆ అమ్మాయితో మాట్లాడు అసలు తనకు ఇష్టమో కాదో? ఆ వీకెండ్ ఫ్రీ గా ఉంటుందో లేదో" నన్నాడు. సరే అని పొద్దుపోద్ధున్నే (7.15 కి) కాల్ చేసి నిద్ర లేపెసా. "చిన్నీ.. నేను నెక్స్ట్ వీకెండ్ హైదరాబాద్ వద్దామనుకుంటున్నాను నిన్ను కలవడానికి. ఇజ్ ఇట్ ఒకే? నువ్వు ఫ్రీగానే ఉంటావా?" అని అడిగితే "వావ్.. కాని అయ్యో నేను దీపావళి అని ఇంటికెల్దామనుకున్నాను ప్రియా. కాసేపాగు నేను అమ్మతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తా" నంది. 9, 9.30 కి కాల్ చేసి నేను సోమ, బుధ సెలవు పెట్టి ఇంటికెళతాను. అమ్మతో చెప్పేసా. నువ్వు వచ్చేయ్.. లీవ్ కూడా అప్లై చేసేసా" అంది. ఆ మాటే నేను భరత్ తో చెబుదామని ఫోన్ చేస్తే నేను నెక్స్ట్ వీకెండ్ కాదు ఈ వీకెండే వెళుతున్నా. అన్నాడు. నేను మళ్ళీ చిన్నీ కి కాల్ చేసి "నేను ఈ వీకెండే వస్తే నీకేమైనా అభ్యంతరమా?" అని అడిగాను. దానికి బదులుగా ఆమె "కేక. నేను టికెట్ బుక్ చేసేయనా" అంది. "వొద్దొద్దు నేను బుక్ చేసుకుంటాలే.. ముందు భరత్ కి కన్ఫార్మ్ చేయాలి" అని చెప్పి నేను అతనికి ఫోన్ చేసేలోపు నా మొబైల్ స్విచ్ ఆఫ్.
ఇంటికెళ్ళి ఛార్జ్ చేసే వరకు మాట్లాడలేను (ఎందుకంటే ఆ కొత్త నెంబర్ నాకు నోటెడ్ కాదుగా).
తీరా సాయంత్రం చేసేసరికి తను టికెట్ బుక్ చేయడం అయిపొయింది. ఇక నేను మొహం వేలాడేసుకొని
చిన్నీ కి ఫోన్ చేసి "నేను రాలేను చిన్నీ.. నెక్స్ట్ వీకెండ్ రావొచ్చు కాని అప్పుడు భరత్ ఉండడు అక్కడ. మ్మ్.. మరో సారి వస్తానులే" అన్నాను. తను చాలా డిస్సప్పాయింట్ అయి "బస్సులు కూడా ఉంటాయి.
అదైతే నీకు కంఫర్టబుల్ అయిన టైం కి దొరుకుతుంది" అని సలహా ఇచ్చింది కాని నాకేమో ఒంటరి ప్రయాణమే భయం.. అందులోను తెలియని ప్లేస్ కి అనేసరికి ఇంకా భయపడ్డాను. అయినా తను అప్సెట్ అవడం ఇష్టం లేక సరే అనేసి ప్రయాణానికి సిద్దమయ్యాను శుక్రవారం నాడు. బస్ టైం దగ్గరయ్యే కొద్దీ నాకు భయం ఎక్కువయింది. "తెలిసీ తెలియకుండా తొందరపడి నేను కొత్త, చెత్త ప్రోబ్లమ్స్‌లో ఇరుక్కోవట్లేదుగా గా" అని! "అసలే మొన్నెవడో సైకో వెధవ కత్తితో తన పక్కనున్నవారిని అటాక్ చేసాడట బస్‌లో. కత్తితో పొడిస్తే నొప్పొస్తుంది గా మరి.. అమ్మో.." ఇలాటి ఆలోచనలతో 5 అయిపొయింది. ఆఫీస్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళే బస్ వచ్చే చోటకు చేరుకొని ఎదురు చూసాను. 5.30 రావలసిన బస్సు 6.40 కి వచ్చింది. మధ్యాహ్నం తినక కడుపులో కాకులు, గ్రద్దలు ఏం ఖర్మా.. అన్ని రకాల పక్షులూ అరిచాయి. ఇది చాలాదన్నట్టు నా వెనుక సీట్ ఆయన ఏం తెచ్చుకున్నారో కాని ఘుమఘుమలాడే వాసనతో నా ఆకలి రెట్టింపయింది :( . నైట్ 9, 9.30 కి వాటర్ బాటిల్, రగ్గు ఇచ్చారు. చిప్స్ లాటివేవైనా దొరుకుతాయా అంటే లేవనేసాడు. మధ్య మధ్యలో చిన్నీ, భరత్ ల ఫోన్లు. మరో వైపు ఆకలి ఏడుపు.. అలా సా.....గి పోయింది ఆ రాత్రి. ఉదయం 7.30 కి హైదరాబాద్ చేరుకోవాల్సిన బస్ కాస్త 8.30 చేరుకుంది.

 నేనదె మొదటి సారి హైదరాబాద్ వెళ్ళడం. సో.. చిన్ని 7, 715 కి బస్ స్టాప్‌కి వస్తే సరిపోతుంది అని ముందే మేము ఫోన్లో అనుకున్నాం. అయినా తనెమో 6.30 కల్లా బస్‌స్టాండ్‌కి వచ్చేసి  నాకోసం ఎదురు చూసిందట! ఆ విషయం నేనక్కడికి చేరుకున్నాక గాని తెలియదు. నాకైతే ఏమనాలో అర్ధంకాలేదు.  నా డ్రెస్ కలర్ చెప్పగా తనే నన్ను గుర్తు పట్టేసి కావాలనే "ఎక్కడున్నావ్ ప్రియా.. ఆ ఎక్కడా" అంటూ ఏడిపించింది. నాకు తెలివెక్కువ కదా..  సిన్సియర్‌గా వెతికేసుకున్నాను గాని నువ్వే డ్రెస్ చేసుకున్నావ్ అని అడగలేదు. 2, 3 మినిట్స్ తరువాత ఆటలు చాలించి చక్కటి చిరు నవ్వుతో ఎదురొచ్చింది తను. కొన్ని క్షణాలు కొత్త అనిపించింది కాని నా సంగతి తెలియనిదేముంది... కాసేపటికే బేషుగ్గా మొదలుపెట్టేసా కబుర్లు. తనేమో సైలెంట్ గా ఉంది. నేను మాట్లాడుతుంటే అబ్బురంగా చూడడం, నవ్వడం, ఊ కొట్టడం తప్ప చాలా సేపటి వరకు ఏమి మాట్లాడలేదు. నేనదేమీ పట్టించుకోక అది ఇది అని లేకుండా అన్నీ వాగేస్తూ, నవ్వుతూ,  ఇదేంటి అదేంటి అని ప్రశ్నలు వేస్తూ బుర్ర తినేసాను. దెబ్బకి దార్లో కొచ్చేసింది చిన్నీ. ఇలా కబుర్లతోనే తన రూమ్ చేరుకున్నాం.

శని, ఆదివారాలు తనతోనే ఉన్నాను. ఆదివారం భరత్ కూడా జాయిన్ అయ్యాడు కాసేపు. రెండ్రోజులూ షాపింగ్, షాపింగ్, షాపింగ్! ఏం కోనేసామో ఎన్ని డబ్బులు వేస్ట్ చేసేసామో అనుకోకండీ. విండో షాపింగే :D !

తనతో ఉన్నపుడసలు టైమే తెలియలేదు. నవ్వులతో నిండిపోయాయి రెండ్రోజులూ! నేననుకోలేదసలు ఇంత క్లోజ్ అవుతామని. శని వారం సాయంత్రం రోడ్ సైడ్ బండి దగ్గర ఆగి పచ్చి మిరప బజ్జీలు, పునుకులూ తిన్నాం.. విండో షాపింగ్‌కని మేమెళితే.. అక్కడి సేల్స్ పర్సన్స్ సీరియస్ అట్టేంక్షణ్ ఇబ్బంది పెట్టింది. మొహమాటపడుతూ ఈ.. ఈ.. యని నవ్వుతూ ఎస్కేప్ అయ్యి మరో షాప్‌లో దూరుతూ.. భలే సరదాగా అనిపించింది. ఈ రెండ్రోజుల్లో చాలా ఎమోషన్స్ చూసాను. కోపం, అలక, సంతోషం, బాధ, సరదా.. మొత్తానికి  ఉగాది పచ్చడిలా అనిపించింది ఈ ట్రిప్. అంతే కాదు.. ఆఖరుగా ఆదివారం సాయంత్రం నేను బయలుదేరేముందు చూసిన తన కళ్ళలో నీళ్ళు ఇప్పటికీ జ్ఞాపకమే.. :)

ఆమె స్నేహాన్ని నాకు పరిచయం చేసిన దేవునికి, పరిచయ వేదికైన బ్లాగ్లోకానికీ, కల్మషం లేని ప్రేమతో ఎంతో ఆప్యాయతను పంచిన చిన్నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

Sunday, November 4, 2012

అక్క

"ఎలా ఉన్నావే? ఆఫీసుకి బయలుదేరుతున్నావా?" అంటున్న అక్క గొంతు వింటూ ఈ రోజు మొదలయింది. "హా బావున్నానక్కా. నువ్వెలా ఉన్నావ్? బొజ్జలో బుజ్జి పాప ఏమంటోంది? నేను ఇప్పుడే లేచా. నువ్వు తిన్నావా?" అన్నాను లేస్తూ. "ఆ బాగున్నానే. పాప కూడా బాగుంది. ఇప్పుడే లేచాం ఇద్దరం. స్నానం చేసి ఏమైనా తింటుండగా మొదలుపెడుతుంది తిరగడం" అంది నవ్వుతూ. నేనింకేదో మాట్లాడేలోపే "సరేలేవే నువ్వు జాగ్రత్త. ఏమైనా తిను. అత్తయ్య పిలుస్తున్నారు.. తరువాత చేస్తాలే" అని నేను సరే అనేలోపే కాల్ కట్ చేసేసింది. ఒకలాటి నిస్సత్తువ ఆవరించింది నన్ను. హూo.. ఎన్ని రోజులైంది తనను చూసి? పెళ్లి కాక ముందు తనను విడిచి ఒకటి రెండ్రోజులు మినహా ఎప్పుడూ ఉండలేదు. పెళ్ళైతే ఇన్ని మార్పులోస్తాయా? తనను ఇంటికి తీసుకురావాలంటే ముందు మా బావగారి అనుమతి, తరువాత అత్త గారు.. ఆ పైన మామగారు. ఎంతో బ్రతిమాలి ఒప్పించి తీసుకురావాలి!!!

హుమ్మ్.. ఏడాది అవుతోంది తను లేకుండా జీవించడం మొదలుపెట్టి. తను నాతో లేని ఈ రోజులు తీరని వెలితితో భారంగా వెళుతున్నాయి.. ఐ రియల్లీ మిస్ హర్. ఎంతో తక్కువగా నిదానంగా మాట్లాడుతుంది. ఎంత పెద్ద జోక్ అయినా తను నవ్వేపుడు చీమ చిటుక్కుమన్నంత శబ్దమూ రాదు! ఒద్దికగా ఒక చోట కూర్చొని పుస్తకాలు చదువుతునో, డ్రాయింగో, పెయింటింగో చేసుకుంటూ ఉంటుంది. కోపమొస్తే చూపుతో సరిపెట్టి అక్కడి నుండి నిష్క్రమిస్తుంది తప్ప వాదించదు! అదే నేనైతే.. మాట్లాడినా, నవ్వినా మినిమం ముప్పై మీటర్లు వినిపించాల్సిందే. క్షణం పాటు కుదురుగా ఒక చోట కూర్చోవడం అంటూ జరగదు. ఎప్పుడూ పరుగులే. అందుకే.. ముద్దుగా గడుసు గంగమ్మ, రాక్షసి లాటి బిరుదులు ప్రదానం చేసారు నాకు! కాని అంత సైలెంట్ గర్ల్ నన్ను చాలా వైలెంట్ సంఘటనలకు బలి చేసింది. వాటిలో రెండిటిని మీతో పంచుకుంటున్నా.. 

ఒక సారి అమ్మ మార్కెట్ కి వెళ్ళినపుడు అక్క సైలెంట్ గా టీవీ ఆన్ చేసింది. ఆ రోజు నాకేం బుద్ధి పుట్టిందో కాని పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నా."చెల్లీ రా.. అమ్మ రావడానికి అరగంటైనా పడుతుంది. చక్కా సినిమా చూద్దాం" అంది.  "నీకు కుళ్ళి. నేను బుద్దిగా చదువుకుంటున్నానని. నేను రాను పో" అనేసి పుస్తకంలో దూరిపోయా. తను చూస్తున్నది నిజమో కాదోనన్న అనుమానంతో కాసేపు నన్నలా చూసింది. తను చూస్తున్న విషయం గమనించిన నేను మరీ సీరియస్గ నొసలు ముడి వేసి మరీ చదువుతున్నట్టు పెదాలు కదిపేసా. తను మళ్ళీ సినిమాలో మునిగిపోయి, ఉన్నట్టుండి  కెవ్వ్మంది. ఏం చదువుతున్నానో ఎందుకు చదువుతున్నానో అర్ధం కాక బుర్ర గోక్కుంటూ ఉన్న నేను ఆ అరుపుకి అదిరిపడ్డాను. "టామ్ అండ్ జెర్రీ మేజిక్ రింగ్ సినిమా వేసాడే. రా రా" అంది. అయినా రానని బెట్టు చేసి, తను  నీళ్ళు తాగడానికని వెళ్ళిన గాప్‌లో పుస్తకాన్ని అక్కడే వదిలేసి పాక్కుంటూ వెళ్లి  టీవీ ముందు కూర్చున్నాను.  అలా కూర్చున్నానో లేదో.. మా అమ్మ తలుపు తెరుచుకొని లోపలికి వచ్చి టీవీ చూస్తున్న నన్ను చూసి కోపోద్రేకురాలై  బేండ్ భాజా మోగించేసింది. ఆ అపురూప దృశ్యాన్ని మా అక్క చూసేసి ఇందాక నేను వదిలేసి వచ్చిన పుస్తకాన్ని చేత్తో పట్టుకొనొచ్చి "మా.. కొట్టకు మా.. అమ్మా" అంటూ ఆపింది. అప్పటికి చేతలాపి మాటలందుకుంది మా అమ్మ. "నీ కంటే పెద్దేదేనా అది? అదేమో బుద్దిగా చదువుకుంటుంటే నీకు సినిమాలు కావాల్సి వచ్చాయా? టీవీ మీద ఉన్నంత శ్రద్ధ పుస్తకం మీదుంటేగా? అయినా, తాను చెడిన కోతి ఊరంతా చెరిచిందని నువ్వు సినిమా చూస్తూ చదువుకునే దాన్ని కూడా చెడగొడదామని బయలుదేరావా?" అంటూ మళ్ళీ ఇంకో వాయ వేసింది. వీపు మండుతుండగా "అమ్మోయ్ బాబోయ్.. మ్మ్.. మ్మ్.. ఉహు ఉహు " అని ఏడుస్తూ కేకలు పెడుతూ పైకి పారిపోయి ఎస్కేప్ అయ్యాను. తరువాత నీతో మాట్లాడను పొమ్మని అక్క మీద అలిగినా తనసలే బ్రతిమాలే టైప్ కాదు కాబట్టి పెద్దగా బెట్టు చేసేదాన్ని కాదు. ఒక్కసారి సారీ చెబితే చాలు కళ్ళు తుడుచుకొని తనిచ్చిన పప్పలు తింటూ మళ్ళీ కబుర్లు చెప్పేదాన్ని.

ఓ రోజు సాయంత్రం అద్దం ముందు నిలబడి నా జుట్టుని చూసుకుంటూ చివర్లు పొడిబారినట్లుంటే తడిమి చూసుకుని "అక్కా చూడు నా జుట్టేలా అయిపోతోందో..." అన్నాను బాధపడుతూ. ఏదో ఒక సలహా ఇచ్చి ఊరుకోవచ్చుగా.. అహ ఊరుకోలేదు. "అది కట్ చేసేయాలి లేకపోతే ఇకపై పెరిగేది కూడా అలాగే రఫ్‌గా ఉంటుంది. చిట్లిపోతుంది కూడాను" అని కంగారు పెట్టేసింది. "అక్కా మరిప్పుడెలాగే? అమ్మ జుట్టు కత్తిరిస్తే తంతుందిగా? పైగా ఇప్పుడు నూనె కూడా పెట్టుకొనున్నాను" అన్నాను. "పరవాలేదు. అస్సలు తెలియకుండా నేను కత్తిరిస్తానుగా.." అంది. "అక్కంటే హీరో. అన్ని తెలుసు తనకు.." అన్న ఫీలింగ్‌లో ఉన్న నాకు పెద్ద భయాలూ, అనుమానాలు కలుగలేదు. సరే అని చెప్పి అమ్మ చూడకుండా కత్తెర తీసుకొచ్చి తన చేతికిచ్చాను. బెత్తుడు కట్ చేయబోతే "అమ్మో నా జుట్టు! వొద్దొద్దు. ఇదిగో ఇంత కత్తిరించు చాలు" అని హాఫ్ ఇంచ్ చూయించాను. "నీ మొహం. నీ మాత్రం దానికి కత్తిరించకపోతేనే?" అంటూ నేను చెప్పిన చోటే కత్తిర పెట్టి కాస్త ఇలా అందో లేదో మా అమ్మ "ప్రియమ్మా.. ఎక్కడున్నారు?" అని పెద్ద కేక పెట్టింది. తుళ్ళిపడి అమ్మొస్తుందేమోనని తలుపు వైపు చూసి నేనిటు తిరిగేలోపల టక్ టక్ మని కత్తిరించేసి ఒక్క ఉదుటున బయటకు పరిగెత్తింది మా అక్క. అమ్మ పిలిచినందుకు కాబోలు అనుకుంటూ అద్దంలో చూసుకుని భోరుమన్నాను. ఏముంది.. ఒక వైపు మెడ వరకు, మరో వైపు బుజం వరకు కత్తిరించి ఉంది నా జుట్టు! నా రాగానికి అమ్మ లోపలి వచ్చింది ఏమైపోయిందో అనుకుంటూ. తీరా అక్కడ నేనున్న అవతారం  చూసి షాకయి "నీకిదేం మాయ రోగమే.. బంగారంలాటి జుట్టు కత్తిరించుకున్నావ్? నీ వెధవ్వేషాలకి ఒక అంతు పొంతూ లేకుండా పోతోంది" అని వొంగో బెట్టి వీపు మీద దబా దబా చరుస్తునే.. "కోతి, పిల్ల దెయ్యం, నా ప్రాణాలు తోడేస్తోంది" లాటి మాటలతో ఘనసత్కారం చేస్తుండగా అక్కొచ్చి ఆపింది ఆపత్భాంధురాల్లాగ! నా పరిస్థితిని ఏమని వివరించను? అసలే జుట్టంత కత్తిరించి పారేసింది రేపు స్కూల్‌కి ఎలా వెళ్ళాలిరా దేవుడా అని ఏడుస్తుంటే అమ్మొచ్చి ఉతికిపారేసింది పైగా  అసలు ఇదంతటికి కారణమైన దానిని రోల్ మోడల్‌గా తీసుకొమ్మని క్లాసు! ఈ కార్యక్రమం ముగిసాక మా అక్క మీద యుద్ధం ప్రకటిస్తే, పాపంగా పేస్ పెట్టి "కావాలని చేస్తానా చెప్పు కంగారులో చూసుకుండా..." అంది. హుం.. మరుసటి రోజు తిడుతూనే రెండు వైపులా సమంగా కత్తిరించి రెండు జడలు వేసి స్కూల్‌కి పంపింది అమ్మ. వెళ్ళాక చూడాలి నా తంటాలు.. అందరు నవ్వడమే. 8th క్లాస్ లో ఫలానా పిల్ల ఇలా వచ్చిందట అని నన్ను చూడ్డానికి ఎగబడి మరీ వచ్చారు :( . ఆ రోజు నుండి "Ms. ఇంటర్నెషనల్ పిలకలు" అన్న బిరుదు కూడా ప్రకటించేశారు స్కూల్లో.

అక్కతో ఎప్పుడూ సరదా గొడవలు, సంతోషాలే కాదండీ! తనే నా మొదటి గురువు. చదువే కాదు.. పెయింటింగ్ కూడా నేర్పింది! ఎలా ఉంటాయోనని ఊహల్లో పడనవసరం లేదండీ.. క్రింద ఫోటో  పెట్టానుగా :)

ఇది నా క్రియేటివిటి అంతా ఉపయోగించి  చేసుకున్న మొదటి పెయింటింగ్.

ఇప్పుడు  నా ఆలోచనంతా డిసెంబర్ నెలలో మా ఇంట పూయబోయే చిట్టిచామంతితో మా అక్క ఇంకెన్ని అద్బుతాలు చేయించేస్తుందో అని :) My god..  I just can't wait to hold her little hands.. :)     

Friday, October 26, 2012

ఏం మాయో..?!!

మనిషిని జయించగలిగేది ప్రేమతోనే కాని డబ్బుతో కాదని
వాదిస్తూనే, ప్రేమకు చలించక డబ్బుకి మాత్రం  లొంగుతారెందుకో??!!
కొన్నాళ్ళకు చిరిగిపోయే కాగితాలకు ఇచ్చినంత విలువ కూడా మనుషులకివ్వరు ఎందుకనో?!
"డబ్బు" ఎంత మాయో... ఛీ పొమ్మన్న నోటితోనే రా"మ్మా" రా అనిపిస్తుంది?!!!??
నిండు మనస్సుతో ప్రేమించే/పంచేవారు కొందరైతే,  ప్రేమను వలగా వేసి డబ్బుని జయించానుకునే/జయించేవారెందరో మరి ?!!!

ఈ వేళ నేను తెలుసుకున్నదేవిటంటే.. కొందరి  ఆప్యాయత పొందడానికి మనసు, ప్రేమ, మంచి, లాటివేవీ అవసరం లేదని.. "డబ్బు" ఉంటే చాలని, తీర్చలేని లోపాలను కూడా అది తీర్చగలదని??!!!!
హహ్హహ్హహహ్హా.. అంటే డబ్బుతో ప్రేమను కొనొచ్చునన్నమాట....?!  :( :( :'(  

ఇంత తేలికగా ప్రేమ దొరుకుతున్నందుకు ఆనందపడనా?? లేక దాని విలువ ఇలా దిగజారిపోయినందుకు బాధపడనా?? 

Thursday, October 18, 2012

తొలిసారి

ఇక్కడ నిన్నటినుండి తుపర పడుతూనే ఉంది. అది తోడుగా తెచ్చుకున్న చల్లటి గాలి మదిని తాకిన శుభ సమయ విశేషమో ఏవిటో..? ఉదయం నుండీ.. నా ప్రేమను తెలిపాక తొలిసారి భరత్ ని కలిసిన సన్నివేశం వద్దన్నా కళ్ళ ముందు కదులుతోంది :)

"సిగ్గా? అంటే ఏంటో..? ఎలా ఉంటుందో.. ఏమో బాబు మనకెందుకులే" అనుకునే జాతికి చెందిన నేను అతని కళ్ళలోకి చూడలేక తల దించుకున్న ఆ క్షణం తలుచుకుంటే మనసులో మల్లెల వాన కురుస్తోంది.
అందంగా కనబడుతున్నానో లేదోనని ఒకటికి పది సార్లు అద్దంలో చూసుకొని బయలుదేరాను. వెళ్ళేడపుడు నా గుండె చప్పుడు నాకే వినబడితే వింతగా నవ్వుకుని "హడావిడిపడుతూ పరుగు పెట్టాను కదా అందుకే గుండెలో ఈ అలజడి" అనుకున్నాను.  కాని అతన్ని చూడగానే చెప్పలేని భావాలతో.. మాట రాక సతమతమై..  ఇదిగో ఇలా కళ్ళు దించేసుకున్నాను (google pic అనుకునేరు! నా కళ్ళేనండోయ్).

 అతనేవేవో చెబుతుంటే మారు మాట్లాడకుండా అలా తల వంచుకునే వింటూ ఊ కొట్టడం తప్ప తలెత్తి సూటిగానైనా చూడలేని నన్ను చూసి "ఏంటీ ఎప్పుడూ ఏదో ఒకటి వాదిస్తూ..
నా నోరు మూయించే ప్రయత్నంలో  దిక్కులు చూడకుండా  సీరియస్‌గా కబుర్లు చెప్పేస్తూ ఉంటారుగా? ఏమైంది మేడంగారికి ఈ రోజు? మౌన వ్రతమో?" అని చిలిపిగ ప్రశ్నిస్తూ నా మొహం లోకి చూసి కన్ను గీటితే.. కనీసం కన్నెత్తైనా చూడకుండా గలగలా నవ్వుతూ మరింత ముడుచుకుపోయిన ఆ తీపి జ్ఞాపకం మరింత తీయదనాన్ని సంతరించుకొని  పలకరిస్తోంది :)

కుస్తీ పట్టే సాకుతో అతని చేయందుకొని పోట్లాడి, ఆ తరువాత  చినుకులలో నడుస్తూ మాట్లడకనే మౌన భాషలో చెప్పుకున్న ఊసులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ.. ఆ వేళ చేయందుకునే ముందు తీసుకున్న ఈ ఫోటో చూసి మురుసిపోతున్నా..

ఇప్పుడే ఇలా ఉంటే, పెళ్ళి సమయంలో ఇకనేనేమైపోతానో..!!!

Friday, October 12, 2012

గోరింట జ్ఞాపకం

రోజూ ఆఫీసు నుండి ఇంటికి వెళ్ళే దారిలో రోడ్ రిపేర్ చేస్తుండడంతో వేరే దారిలో వెళుతున్నాను ఒక వారం, పది రోజులగా. ఓ ఇంటి పెరట్లో పేద్ద గోరింటాకు చెట్టు చూసాను. ఎప్పుడో ఫిబ్రవరిలో మా అక్క పెళ్ళికి పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పటివరకు ఖాళీ చేతులే. కోన్ పెట్టుకోవడం కంటే వట్టి చేతులతో ఉండడం నయం అనుకొని విరక్తిగా జీవితం గడుపుతున్న సమయంలో ఎర్రటి రంగుతో  నా అరచేతులను, కాళ్ళను నింపి అల్లుకుపోవడానికి సిద్ధమన్నట్లున్న గోరింటాకు చెట్టుని చూడగానే మనసు పారేసుకున్నాను. ఎవరైనా ఉంటారేమో అడిగి కోసుకుందాం కదా అనుకుంటే.. ఎక్కడా ఎవరూ కనబడరే! కొన్ని రోజులు చూసి చూసి ఇక ఆగలేక శుభ ముహూర్తం
చూసుకొని పర్మిషన్ లేకుండానే కోసుకెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. ఎప్పుడూ రోడ్ మీద ఎవరో ఒకరు తచ్చాడుతునే ఉన్నారు. ఎప్పటిమాములుగా ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఆఫీసుకి వెళుతూ,
ఈ రోజైనా ఎవ్వరు లేకపోతే బాగుణ్ణు అనిపించినా మన అదృష్టం ఎంత స్ట్రాంగో తెలుసును కనుక "ఆ..ఇప్పుడు కూడా ఎవరోకరు తిరుగుతూనే ఉండుంటారులే" అనుకుంటూనే ఆశగా చూసాను. ఆశ్చర్యం! అక్కడ ఎవ్వరూ లేరు! రెగులర్ గా వాకింగ్ కి వెళ్ళేవాళ్ళు కూడా కనబడలేదు. కళ్ళు పెద్దవి చేసుకొని దిక్కులు చూస్తుంటే గోరింటాకు చెట్టు అక్కినేని నాగేశ్వరావు గారి స్టైల్లో "కమాన్.. డోంట్ వేస్ట్ ది టైం" అన్నట్లు వినిపించింది. రోడ్ కీ, ఆ ఇంటి పెరడుకి మధ్యలో ఒక ఖాళీ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఖర్మ కాలి ఆరోజు చీర కట్టుకొని ఉన్నాను. కష్టమేమో అనిపించింది కాని మనసుని కన్విన్స్ చేయలేక నా బండిని రోడ్ మీదే కాస్త పక్కగా ఆపి, చీర కుచ్చిళ్ళు చేత్తో పట్టుకుంటూ జడ వెనక్కు వేసుకొని అటు ఇటూ చూస్తూ లోపలికి నడిచాను.  రోడ్ మీద నుండి చూడడానికి ఆ పిచ్చి మొక్కలు చిన్నగానే కనిపించాయి కాని నడుస్తుంటే తెలిసింది బాగా గుబురుగా ఉన్నాయని. ఇలా సుతారంగా నడిస్తే నేను గోరింటాకు కోసుకొనే లోపు రోజు గడిచిపోతుందనిపించి లాభం లేదని కొంగు, కుచ్చిళ్ళూ కలిపి చీరలో దోపుకొని గబగబా కంచు మొక్కలను తప్పించుకుంటూ.. చీరకు పట్టిన ముళ్ళు తీసుకుంటూ ఎలాగో చెట్టుదగ్గరకు చేరుకున్నాను. "పాపం నేను! గోరింటాకు కోసం ఎన్ని తిప్పలు పడ్డానో" అని నా మీద నేనే జాలిపడి వెనుదిరిగి చూసాను. అక్కడున్న పిచ్చి మొక్కలు, చెత్తకుప్పా అవీ దాటుకుంటూ రాగలిగినందుకు పొంగిపోయి, గోరింటాకు చెట్టుని చూసి పరవశించిపోతూ ప్రేమగా తడిమి ఒక్క రెబ్బ కోసానంతే. "ఏయ్య్.. యారదు? అంగె  ఎన్న పన్రే  (ఏయ్ ఎవరది? అక్కడేం చేస్తున్నావ్?)" అని పేద్ద పొలికేక వినిపించింది. అదిరిపడి వెనక్కు తిరిగి చూస్తే ఒక ముసలాయన
కర్ర చేత్తో పట్టుకొని మరీ నిలబడి ఉన్నారు. ఆ ఉదయం ఎంతో చల్లగా ఉన్నా కూడా చెమటలు పోసేసాయి నాకు.
"ఒన్నూ ఇల్ల తాతా..  ఇరుంగ నా వరే (ఏమి లేదు తాతా.. ఉండండి నేను వస్తున్నా)" అంటూ ఎంత వేగంగా లోపలికి వెళ్ళానో అంతే వేగంతో రోడ్ మీదకు  వచ్చేసాను. ఆయన ఉన్న వైపు అడుగులు వేస్తూనే చెప్పాను. గోరింటాకు కోసమని వెళ్లానని, అడుగుదామని చూసినా ఎవ్వరూ కనబడకపోయే సరికి నేనే కోయబోయానని. ఆయన ఏమి మాట్లాడకుండా కర్రతో కొట్టడానికి వస్తున్న పోజ్ లో నా వైపు పరిగెట్టేసరికి ఏం జరుగుతుందో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకుండా "అయ్యో.. తాతా ఎదో తెరియామె పణ్ణిటేన్ మన్నిచుడుంగో (అయ్యో తాతా ఏదో తెలియక చేసాను క్షమించండి)" అంటూ నా బండి దగ్గరకు పరిగెట్టేసాను. ఆ కంగారులో ఆయన ఏం చేస్తున్నారో.. ఏమవుతోందో చూడకుండానే బండి స్టార్ట్ చేసి స్పీడ్ గా ముందుకి వెళ్ళిపోయాను. 

"ఛీ ఛీ! అంతా నీ వల్లే. ఏ ఇప్పుడు గోరింటాకు లేకపోతే ఏమైపోతుంది? ఇంకా నయం అక్కడ ఎవ్వరూ లేరు కనుక సరిపోయింది. ఉంటే ఎంత పరువు నష్టం? పైగా ఆగి ఆయనతో మాట్లాడి రాకుండా పరిగెట్టుకోచ్చేసావ్!" అని నానా విధాలుగా తిట్టుకుంటునే "నేనేం బంగారమా తీసుకెళ్ళబోయాను? అస్సలు ఏం చెప్తున్నానో కూడా వినకుండా మనవరాలి వయసున్న పిల్లను అలా కర్ర పట్టుకొని కొట్టడానికి వచ్చేస్తాడా? ఆ తాతయ్యకు అసలు మనసే లేదు. సో నేను చెప్పకుండా రావడంలో తప్పు లేదు" అని సమర్దించుకున్నాను. ఈ సంఘటన పుణ్యమా అని గోరింటాకుతో నా పరిచయం గురించి మీతో చెప్పుకోవాలని ఆశ కలిగింది.

నా చిన్నపుడొక సారి, ఆంధ్రలో ఉన్న మా మేనత్తా వాళ్ళింటికి నన్ను తీసుకొనివెళ్ళింది అమ్మ. దసరానో దీపావళో మరి గుర్తులేదు. ఇంకా రావలసిన వాళ్ళందరూ రాలేదు. కాని ఇల్లంతా సందడి సందడిగా ఉంది. నేనూ.. మా విజ్జత్త కూతురు రిషి, మౌని కలిసి ఆడుకుంటుంటే విజ్జత్త వచ్చి మౌని తో "అచ్యుతాంబ గారు గోరింటాకు నూరిస్తానన్నారు వెళ్లి ఈ గిన్నెలో పట్రామ్మ. ఇదిగో చేత్తో ముట్టుకోకు ఈ స్పూన్ తో తియ్యి రోట్లో నుండి. చెయ్యి పండిపోతే ఇంకేం పెట్టుకోలేవు" అంది. దానికి మౌని "ఏ.. ఎప్పుడూ నాకే చెప్తావ్. చెల్లిని వెళ్ళమనొచ్చుగా.. నేను వెళ్ళను" అని మారం చేసింది. తప్పక "రిషి తల్లులు.. నువ్వు బంగారం కదమ్మా మాట వింటావు. వెళ్లి పట్రామ్మ.. నీకే మంచి డిజైన్ పెడుతుంది కమలత్త" విజ్జత్త అన్న మాటలకు మా అమ్మ కూడా వంత పాడుతూ "అవును రిషి మంచి పిల్ల. దానికే మంచి డిజైన్ పెడతాను. ఎక్కువ పాయసం పెడతాను" అంది. అదేమో మిక్స్డ్ ఎక్స్ప్రెషన్ పెట్టింది. "ఇదిగో ప్రియాక్కని తోడు తీసుకెళ్ళు. త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయండి. వచ్చేదారిలో పప్పలు కొనుక్కోండి" అంటూ మౌని చూడకుండా ఇద్దరి చేతుల్లోను చెరొక రూపాయి పెట్టి గిన్నె, స్పూనూ ఇచ్చింది. మేము జోలీ జోలీ గా బుజాల మీద చేతులేసుకొని బయటకు వెళ్ళాం. పక్క వీధిలో ఉందట ఇల్లు. కాని నాలుగడుగులు వేయగానే "ఐస్ ఐస్.. సేమ్య ఐస్.. పాలయిస్.. ద్రాక్షా ఐస్" అని వినిపించింది. "ఐసూ.. ఆగండి వస్తున్నాం" అనరిచింది రిషి. "సరే అయితే.. నాకు ఇల్లు  తెలీదుగా నువ్వెళ్ళి గోరింటాకు పట్రా
నేను వెళ్లి మనిద్దరికీ ఐస్ కొనుక్కొస్తా" అన్నాను. "అస్కు బస్‌కు ఏమ్మా ఎప్పట్లగా నాది కూడా తినేద్దామనా? కుదరదు. అదిగో ఆ చివ్వరిల్లె. వెళ్లి నువ్వే గోరింటాకు పట్రా నేనే ఐస్ కొనుక్కొస్తా" అంది. అవును అప్పటికే చాలాసార్లు కబుర్లు చెప్పి దాని ఐస్ క్రీంలు తినేసాను. అవంటే నాకు అంత పిచ్చి మరి. నేను కుదరదు నువ్వే పట్రా.. నేనే కొంటానని గొడవచేస్తే "అసలేమి వద్దు. పద వెళ్లి పోదాం" అనేసింది. అది నా వల్ల  కాదుగా.. కాళ్ళీడ్చుకుంటూ గోరింటాకు కోసం వెళుతూవెనకెనక్కి చూసుకుంటూ
అచ్యుతాంబ గారింటి వైపు నడిచాను. కాస్త ముందుకి వెళ్ళగానే బోల్డంత గోరింటాకు రోడ్ మీద పడిపోయి కనబడింది! "అమ్మో.. ఎలగ పారేసుకున్నారో!" నని ఆశ్చర్యపడిపోతూ "పోగొట్టుకున్నవాళ్ళు మళ్ళీ వచ్చేలోపే గిన్నెలో
వేసేసుకొని తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే ఇప్పుడు అంత దూరం ఎవరు నడుస్తారు" అని కంగారు కంగారుగా
స్పూన్‌తో గిన్నెలో వేసుకుంటుంటే  కంపుకొట్టింది. "ఛీ ఛీ చెన్నైలోనే బాగుంటుంది గోరింటాకు. ఇక్కడేదో కంపొస్తోంది" అని ముఖం చిట్లించుకునే రిషిదెక్కడ నా ఐస్ తినేస్తుందో నని గబగబా గిన్నెలో వేసేసుకొని పరిగెట్టాను. బుద్దిగా బండ మీద కూర్చొని ఐస్ తింటోంది. మరొక చేతిలో నాది భద్రంగా పెట్టుకుంది తినకుండా! వెళ్లి నాది నేను తీసుకొని గిన్నె దాని చేతికిచ్చి "ఇంటికి వెళదాం నడు" అన్నాను. ఇంటికి వచ్చాక గోరింటాకు గిన్నెని టేబుల్ మీద పెట్టి విజ్జత్తకు చెప్పేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయాం. "ఏదో కంపుకొడుతోంది ఇల్లంతా" అని వెతుక్కుంటే నా చెప్పుల నుండి వస్తుందని గ్రహించి వాటిని కడిగే పనిలో పడింది అత్త. ఈ లోపు మిగతా వాళ్ళు రావడం కబుర్లు చెప్పుకొని గోరింటాకు పెట్టుకోవడానికి నేను ముందంటే నేను ముందని గొడవలు పడి మరీ  పెట్టుకోవడం.. జరుగుతోంది. పెట్టుకుంటున్నపుడు "ఏదో కంపు కొడుతోంది కదా పిన్ని" అన్నదానికి జవాబుగా "ప్రియా పేడ తొక్కొచ్చిందమ్మా. బయట అంట్లున్నాయని ఆ చెప్పులు బాత్రూంలోనే కడిగేసాను. ఆ స్మెల్లే ఇల్లంతా స్ప్రెడ్ అయినట్లుంది" అంది విజ్జత్త.

కాసేపటికి "అయ్యో.. ఇంకా ఇద్దరు ముగ్గురున్నారే పెట్టుకోవలసిన వాళ్ళూ.. గోరింటాకంతా అయిపొయింది. ఇప్పుడెలా" అనడం విని అక్కడే ఆడుకుంటున్న నేను "ఇంకక్కడ బోల్డంతుందిగా.. నేనెళ్లి పట్రానా..? రూపాయిస్తేనే మరి?" అన్నాను. "బోలెడంత ఎక్కడుందే..? ఎంత రుబ్బిందావిడ?" అంది. "ఆవిడ కాదు. రోడ్ మీద. పాపం ఎవరో పారేసుకున్నారు. ఇంకా అక్కడ బోల్డుంది" అన్నాను. వాళ్లకు అనుమానమొచ్చి చేతులు వాసన చూసుకుంటే "పేడ"!!!! ఎన్ని గొడవలేసుకొని పెట్టుకున్నారో అన్నే గొడవలతో పోటీ పడుతూ కడుక్కున్నారు.
పెట్టుకోని వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు (అందులో మేము కూడా ఉన్నాం. ఎక్కడ చేరిపేసుకుంటామోనని రాత్రికి పెట్టొచ్చులే అనుకున్నారట). అప్పుడింక అందరూ మా అమ్మ మీద పడ్డారు!
అమ్మ నన్ను తిట్టలేదు.. నవ్వుతూ "పాపం దానికి పేడంటే ఏం తెలుసే? కోన్ లో ఉన్నట్లుగా ఉండేసరికి గోరింటాకే అనుకొనుండుంటుంది. అయినా మీకు తెలుసుగా? పెట్టుకునేడపుడు మీకే తెలియలేదు!?  చిన్నది.. దానికేం తెలుసే? పోనీయండి. " అని వెనకేసుకొచ్చింది!

ఫస్ట్ చిరాగ్గా ఫీల్ అయి నసిగినా.. కాసేపటి తర్వాత అందరూ నవ్వేసారు. ఇప్పటికీ గోరింటాకు కోసి పంపమని అడిగితే
"మనుషులు పెట్టుకునేదా? నీ స్పెషల్ గోరింటాకా?" అని ఏడిపిస్తుంటారు :)

Thursday, October 4, 2012

విహారం

విహారం అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్లోచ్చేసినట్టుంది మన ప్రియా.. అనుకుంటున్నారా? అయితే రసంలో కాలేసినట్టే (పప్పంటే రొటీన్ గా ఉందని.. హి హి హి).  ఈ వేళ ఉదయం 8 గంటలకు సైన్ ఇన్ చేసాను. ఇప్పటి వరకు బ్లాగ్ లోకంలోనే విహరిస్తూ గడిపాను. ఇంట్లో ఉన్నాననుకునేరు..? కాదు కాదు ఆఫీసు లోనే ఉన్నాను. మా Mrs. of  Mr. Chennai ఈ రోజు ఆఫీసుకి రాలేదు.
ఉదయం ఉత్తినే ఎవరేం చేస్తున్నారో చూసిపోదాం కదా అని వచ్చి అతుక్కుపోయాను. ముందు లాస్యా రామకృష్ణ గారి "బ్లాగ్ లోకం" ఓపెన్ చేసి అందరూ రాసుకున్నవి చూస్తూ రాజ్ కుమార్ గారి బ్లాగింట్లోకెళ్ళి అన్ని టపాలూ చదివి, అక్కడి నుండి అన్నపూర్ణ, షడ్రుచులు అనే బ్లాగిళ్ళను చూసి, మళ్ళీ "బ్లాగ్ లోకం" కి వచ్చి చూస్తే  చిన్నిగారు  సినిమా గురించి ఏదో పోస్ట్ రాయడం కనబడి తన "అనుభవాలు" లోకి చొరబడ్డాను.
రెబల్ సినిమా ఏ రేంజ్లో కేక పెట్టిన్చిందో విపులంగా విడమర్చి చెప్పేసరికి రెబల్ చూడాలని నిన్న వేసుకున్న ప్లాన్ పక్కన పెట్టి, చిన్నిగారికి  థాంక్స్ చెప్పుకొని  అటు ఇటు తిరుగుతుంటే కావ్యాంజలి గారి "మీ కావ్యాంజలి" బ్లోగిల్లు, "aanamdam" బ్లాగు కనబడ్డాయి. అవన్నీ చదివి టైం చూసుకుంటే 4.20pm. వర్క్ అంతా అలానే ఉందని నాలోని ఉద్యోగి ఘోషిస్తోంది (ఇంటికి వెళ్లి కంప్లీట్ చేయక తప్పదనుకొండీ). కాని మనసు "నా మౌనరాగాల్లో ఇదీ ఒక రాగమే! మర్యాదగా దీన్ని వాటితో చేర్చు" అని ఆర్దరేసింది.
ఎవరితోనైనా పోట్లాట పెట్టుకోగలను కాని మనసుతో పోట్లాడి బ్రతికేయగాలనా? అందుకే ఇలా వచ్చాను. నిజానికి మొన్న అపుడెపుడో నిశ్చయిన్చేసుకున్నాను "ఎంత అభిమానం లేకపోతే ఇంత మంది  ఇంతగా అడుగుతారు "నా ప్రేమాయణం part 4" త్వరగా రాయండంటూ?  వారి అభిమానానికి కృతజ్ఞతగానైనా సరే నా బ్లాగ్‌లో నెక్స్ట్ పోస్ట్ అంటూ రాస్తే అది పార్ట్ ఫోరే" అని. కాని నా వీకెండ్ ట్రిప్ గురించి రాసేసాను. మీతో ట్రిప్ విశేషాలు పంచుకోవాలన్న ఆరాటం అటువంటిది మరీ. అప్పుడూ అనుకున్నాను.."లేదు లేదు ఏది ఏమైనా ఈ సారి పార్ట్ ఫోరే" అని. కాని మనసూరుకోవడంలేదు. అంచేత ఈ సారికి కూడా దయచేసి నన్ను మన్నిన్చేయమని మిమ్మల్ని (తిట్టుకుంటున్న వారిని) బ్లాగ్ ముఖంగా బ్రతిమాలేసుకుంటున్నాను.. :)  

Thursday, September 27, 2012

కొంచెం కష్టం.. కొంచెం ఇష్టం

అబ్బా.. ఈ విషయం మీతో పంచుకోవాలని మొన్నటి నుండి తెగ ఆరాటపడుతున్నాను కాని ఆఫీసులో వర్క్ కాస్త ఎక్కువగా ఉండడంతో కుదరలేదు. ఏవిటీ అలా ఆలోచిస్తూ చూస్తున్నారు? దేని గురించి చెప్తానో అనా? ఆగండాగండి నేనే చెప్తాను. మ్మ్.. విషయం ఏవిటంటే లాస్ట్ వీకెండ్ (22, 23 Sep) నేను అనూ కలిసి బయటకు వెళ్లాం. "అను" అంటే ఎవరో చెప్పకుండా స్టొరీ కంటిన్యూ చేస్తే మీరు నన్ను అడ్డమైన తిట్లూ తిడతారని నాకు తెలుసు :). అనూ అంటే మరెవరో కాదు.. భరతే! అతని పూర్తి పేరు భరత్ అనురూప్. నేను అనూ అని పిలుస్తానన్నమాట. మా ప్రేమ వయసు మూడేళ్ళు. ఈ మూడేళ్ళలో 10, 15 సినిమాలు చూసుంటాము. ఇంకా చాల సాయంత్రాలు బీచ్ లో వాళ్ళని వీళ్ళని చూస్తూ అనూ, సముద్రాన్ని చూస్తూ నేనూ గడిపాము.. గోల్డెన్ బీచ్, MGM, ఎగ్జిబిషన్, షాపింగ్, ఇలా ఎక్కడకు వెళ్ళినా మహా అయితే 5, 6 గంటల్లో తిరిగి వెళ్ళిపోయేవాళ్ళo. కాని ఫర్ ది ఫస్ట్ టైం.. ఇద్దరం కలిసి 2 డేస్ ట్రిప్ కి వెళ్ళోచ్చాం. అలా కొంటెగా చూడొద్దు. ఒంటరిగా వెళ్ళేంత సీన్ మాకు లేదులెండి. మాకు బాగా తెలిసిన ఆంటీ వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. వాళ్ళది కడప. అంకుల్ రైల్వేస్ లో వర్క్ చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రస్తుతానికి కదిరి అనే ఊరిలో ఉంటున్నారు.  వాళ్ళబ్బాయి కోసం ఆంటీ గారు ఇక్కడకు వస్తుంటారు. వచ్చిన ప్రతి సారి ఇంటికి రమ్మని చెబుతారు. ఎప్పటిలాగే నవ్వి ఊరుకుంటాను. ఈ సారి మాత్రం "లేదు ప్రియా నువ్వూ , భరత్ ఇద్దరు కచ్చితంగా రావాలి.  పక్కనే "Horesely Hills" అనే ఊరున్నాది.. భలేగుంటదిలే" అని పట్టుబట్టేసారు. ప్లాన్ చేద్దాంలే ఆంటీ అంటే ఊరుకోలేదు. "ఏందే నువ్వు? ఇప్పుడే వెళ్ళాలా.. నేన్ చెప్తున్నా చూడు పెళ్ళయ్యాక వెళ్ళినా ఈ ఫీల్ వేరు ప్రియా" అని అభిమానంలో ముంచెత్తి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. భరత్ సరేనన్నాడు.  తను ఎలాగో ఆంధ్రాలోనే ఉండడంతో " శుక్రవారం నేను కదిరి కి డైరెక్ట్ గా వచ్చేస్తాను. నువ్వు ఆంటీ గారితో వచ్చెయ్యి నాన్న" అన్నాడు. 

శుక్రవారం 5కి ఆఫీసు నుండి బయలుదేరగానే ఆంటీ కి కాల్ చేసి "ఆంటీ, నేను బయలుదేరిపోయాను, ఇంకో అరగంటలో ఇంటి దగ్గర ఉంటాను. 6కి ఇంటి దగ్గర బస్సు ఎక్కేస్తే చక్కగా 6.40 కల్లా  కోయంబేడు బస్టాండ్ చేరుకోవచ్చు.. మీరు మా ఇంటి వైపు వచ్చేసేయండి.. నేను రెడీ గా ఉంటాను" అని చెప్పేసి ఇంటికి వెళ్లి బాగ్ సర్దుకొని 540కి  ఆవిడకు కాల్ చేస్తే "10 నిముషాలు  ప్రియా" అన్నారు. సరే అని కాలు కాలిన పిల్లి లాగ అటు ఇటు నడుస్తూ 30 మినిట్స్ వెయిట్ చేసాను. ఇంకా ఫోన్ రాలేదు. నేనే చేసాను "ఆంటీ ఎక్కడున్నారు?" అంటూ. "అయిపొయింది ప్రియా 10 నిముషాలు" అన్నారు. 20 మినిట్స్ దాటాయి. నాకు చిరాకొచ్చి అనూ కి కాల్ చేసి "ఆవిడ ఏం చేస్తోందో ఏవిటో.. ట్రాఫిక్ ఎక్కువవుతోంది. నేను ఇందాకటి నుండి కాల్ చేస్తోంటే 10 నిముషాలు, 10 నిముషాలు అంటూ గంట సేపటి నుండి వెయిట్ చేయిస్తున్నారు. కాస్త నువ్వైనా కనుక్కో అనూ.. ఈ జన్మకు అవుతుందో లేదో" అన్నాను. తను 2 మినిట్స్ లో నాకు తిరిగి చేసి "10నిముషాలంట ప్రియా.. నేను ఇప్పుడే అంకుల్ ని కలిసాను. ఏమైనా ముఖ్యమైన విషయమైతే ఫోన్ చెయ్" అనేసి కాల్ కట్ చేసాడు. నాకు వొళ్ళు మండిపోయింది. తిట్టుకుంటూ "ఆవిడ చెప్పిన 10 నిముషాలు" అయ్యేవరకు చూసాను. 7.10కి ఫోన్ చేసి ఆవిడ ఎక్కిన బస్సు నెంబర్ చెప్పి అదే బస్సు ఎక్కమన్నారు. హమ్మయ అనుకుంటూ గబగబా నడుచుకుంటూ వెళ్లి ఆ బస్సు ఎక్కాను. లోపల ఎంత రష్ గా ఉందంటే అమ్మో.. మళ్ళీ తలుచుకోవడానికి కూడా భయంగా ఉంది. ఫ్రంట్ సీట్ పక్కన కాస్త చోటుంది. మహా అయితే ముగ్గురు నిలబడొచ్చేమో. నాతో పాటు ఎక్కిన ఆరెడుగురు అమ్మాయిలు నన్ను తోసుకుంటూ వెళ్లి అక్కడ నిలబడ్డారు. వేరే ఆప్షన్ లేక కష్టపడి అక్కడే ఇరుకున్నాను. అబ్బా అబ్బా అబ్బా.. ఆ చెమట కంపు.. ట్రాఫిక్ పుణ్యమాని కదలని బస్సు.. నిలబడ్డం వాళ్ళ వచ్చిన కాళ్ళ నొప్పులేం సరిపోతాయిలే అనుకుందేమో ఒక అక్క తన హై హీల్ చెప్పుతో నా కాళ్ళను పలకరిస్తునే ఉంది. "అమ్మా" అని అరిచినపుడల్లా చిన్నగా నవ్వుతూ "సారీ" అని తను స్వీట్ గా చెప్తుంటే ఇంకేమి అనలేక ఏడవలేక నవ్వినట్లు ఒక నవ్వు విసురుతూ ఉన్నాను. "అసలు ఆ నవ్వైనా నీ మొహం మీద ఎందుకుండాలి" అనుకున్నట్లు బాగా సన్నగా ఉన్న ఒక అమ్మాయి తన ఎముకల ధృడత్వాన్ని నా మీద ప్రదర్శిస్తూ వచ్చింది బస్సు దిగే వరకు. ఈ గొడవల మధ్యలో ఒకడు నాకు సైట్ కొడుతూ వాళ్ళ మీద, వీళ్ళ మీద అరిచి వాడి హీరోఇజాన్ని చూయించడం ఒక ఎత్తైతే.. వెంట్రుకలే లేని వాడి గుండు మీద చేత్తో రాసుకుంటూ పళ్ళికిలించడం కొసరు మెరుపు. ఎలాగో 8.40 కి బస్టాండ్‌కి చేరుకున్నాం. కాని మేము ఎక్కాల్సిన బస్సు మిస్సు. చేసేదేమీ లేక తిరపతి ఎక్కాం. లక్కీగా సీట్స్ ఉన్నాయి. అప్పటికే నేను బాగా అలసిపోవడంతో నిద్రకు ఉపక్రమించాను. ఈ లోపు ఆంటీ తన బాగ్ ఓపెన్ చేసి "ప్రియా ఇదిగో తిను" అంటూ కొంచం రైస్, ఒక చపాతీ, క్యాబేజ్ కూర.. చిన్న ప్లేట్ లో పెట్టి ఇచ్చారు. మొహమాటానికి కూడా నో అని చెప్పే ఉద్దేశం లేక థాంక్స్ చెప్పి తినేసి బస్సు ఎప్పుడు కదుల్తుందా అని ఎదురుచూస్తూ కూర్చున్నాను. ఆశ్చర్యంగా 5 నిముషాల్లోనే బండి కదిలింది. హమ్మయ అనుకుని కళ్ళు మూసుకున్నానో లేదో బస్  ఆగిపోయింది! ఓ రేంజ్ లో తన్నుకొచ్చింది ఏడుపు. ఏమైందో చూద్దామని కిటికీలోనుండి తొంగి చూస్తే షాక్. ఎలా పెట్టాడో.. అసలేమయిందో కాని చుట్టూ 6, 7 బస్సులు. మధ్యలో మా బస్సు! దరిద్రం గజ్జి కుక్కలా వెంటపడింది ఇంకేం చేయలేమని అర్ధమయినా బోలెడంత చిరాకు, ఏడుపు. ఈ అందం లో ఆ ఆంటీ "నేనప్పుడే చెప్పలా మనం ట్రైన్‌కి బోదామేని?" అన్నారు. నాకు భలే కాలిందిలే. "అసలు మీరు చెప్పిన టైం కి వచ్చుంటే సరిపోయుండేది" అనేసాను. నేను మాంచి మూడ్ లో ఉన్నానని అర్ధమయి ఇంకేం మాట్లాడలేదు ఆవిడ. అక్కడే 10 దాటిపోయింది. "ఎక్కడి వరకు వచ్చారు నాన్నా?" అంటూ అనూ నుండి ఫోన్. "ఆ ఇంకా ఇక్కడే చచ్చాం. అయినా ఇదంతా నీ వల్లే. ఆవిడ పిలవగానే సరే అనేయడమే? నీకేం అక్కడ హాయిగా ఇంట్లో కూర్చున్నావ్. ఎక్కడున్నావ్ అంట ఎక్కడున్నావ్" అని దులిపి పారేసాను. దెబ్బకి "అంకుల్, నేనూ కదిరి నుండి మదనపల్లికి వచేస్తున్నాం. సో మీరు వచ్చాక డైరెక్ట్ గా Horsely Hills కి వెళ్ళిపోవడమే. సరే.. తినడానికి పిలుస్తున్నారు నాన్నా.. నేను మళ్ళీ చేస్తాను" అని గడగడా చెప్పేసి, తెల్లవారుజామున నేను రీచ్ అయ్యాను అని కాల్ చేసేంత వరకు అడ్రెస్ లేడు. మా బస్ కోయంబేడు బస్టాండ్ లోనుండి బయటకు వచ్చేసరికి 10.40 అలా అయింది. నాకు నిద్ర ముంచుకొచ్చి పడుకొనిపోయాను. మధ్యలో బాగా గోల గోల గా అనిపించేసరికి మెలకువ వచ్చింది. ఎంటా అని చూస్తే ఆ రోడ్ లో ఆక్సిడెంట్ అయిందిట. 1km వరకు వెహికల్స్ అన్ని ఆగిపోయాయి. అప్పటికి తిరుపతికి మరొక 20 మినిట్స్ దూరంలో ఉన్నాం. నాకు ఒకే సారి భయం, బాధ, కోపం అన్నీ కలిపి వచ్చేసాయి. దాదాపు 40 మినిట్స్ అక్కడే ఉండాల్సొచ్చింది. తర్వాత అటుగా వెళుతూ ఆ ఆక్సిడెంట్ అయిన  బండ్లను చూడొద్దనుకుంటూనే చూసాను. 2 లారీలు గుద్దుకొని ఉన్నాయి. ఇద్దరు చనిపోయారట.. వాళ్ళను చూడలేదు. తాగి డ్రైవ్ చేయడం వలన ఇలా జరిగిందని అన్నారు. చాలా సేపటి వరకు నేను మామూలు కాలేకపోయాను. ఈ మధ్యలోనే మేము తిరుపతిలో దిగి, మదనపల్లి వెళ్ళే బస్ ఎక్కాం. "ఆ ఊరికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఆంటీ" అనడిగాను. "ఎంతనే గంటా గంటన్నర అంతే" అన్నారు. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నా. కాని గంటన్నర కాదు కదా 3 గంటలయినా రాదాయే! ఆవిడేమో హాయిగా బజ్జున్నారు. ఒక చోట బస్ ఆపి డ్రైవర్స్ మారారు. ఇప్పుడు వచ్చిన ఆయనకు డ్రైవింగ్ కొత్తట. అయితే సైకిల్ స్పీడ్ లేదా జెట్ స్పీడ్ లో డ్రైవ్ చేసారు. దీనికి తోడు ఆయనకు బ్రేక్స్ వేయడం కూడా రాలేదు. కాస్త స్లో చేయడానికి బ్రేక్స్ వేసినా చాలు ఏదో టైర్ కాలిపోతున్న వాసన వేసింది. అప్పుడప్పుడు కూర్చున్న వాళ్ళు అరుస్తూనే ఉన్నారు "ఏమయ్యో చూసి పో.  ఎందా బ్రేకులేయటం" అని. గుండెను చేత్తో పట్టుకొని ఎప్పుడు దిగుతామురా భగవంతుడా అనుకుంటూ నేను కూర్చుంటే.. నా మీద పూర్తిగా వాలిపోయి (పడుకొని అంటే బాగుంటుందేమో!) సరిగ్గా చెవిలో గురక పెట్టేస్తోందావిడ :(. అలా అష్ట కష్టాలు పడి  ఉదయం అయిదున్నర ప్రాంతంలో మదనపల్లిలో దిగి గెస్ట్ హౌస్ కి వెళ్లాం. అక్కడే బ్రేక్‌ఫాస్ట్ అదీ చేసి అంకుల్ వాళ్ళ కార్ లో "Horsely Hills" కి బయలుదేరాం.

"ప్రియా.. నువ్వేదో మాంచి విషయం చెబుతావని పోస్ట్ చదువుతుంటే, దీనిలో దరిద్రం తప్ప మరేమీ కనబడడం లేదు" అనేగా అనుకుంటున్నారు..? మీరేమాత్రం అలా నిరుత్సాహపడొద్దు. కొన్ని మంచి విషయాలూ ఉన్నాయి. వెళ్ళే దారిలో ఎన్ని టొమాటో తోటలోచ్చాయో! మట్టితో చేసిన బొమ్మలు, గుర్రాలు, తాబేళ్లు, దీపాల గిన్నెలు, రకరకాల కుండలు 2kms వరకు దారి పొడుగునా ఇలాటి షాప్‌సే. నేనూ ఓ కుండ కొన్నానోచ్ :).

రెండు గంటల ప్రయాణం తర్వాత "Horesely Hills" చేరుకున్నాం. అక్కడికి వెళ్ళాక నేనూ, అనూ ఇదిగో ఇలా నడుస్తూ ప్రకృతిని ఆస్వాదించాం.అనుకోకుండా తీసిన ఫొటోనే.. అయినా బాగుంది కదూ :)

 అక్కడ వాతావరణం ఎంత బాగుందో.. చల్లగా నిశబ్దంగా ఎటు చూసినా పచ్చదనం.. నా మనసయితే దూది పింజలా తేలికగా అయిపొయింది అక్కడకు వెళ్ళగానే. మేమున్నది రైల్వే గెస్ట్ హౌసులో. అంచేత వంట కూడా చేసుకోగాలిగాం. ఆంటీ, భరత్, అంకుల్ వీళ్ళు తమ ఫేవరెట్ నాటు కోడి కూర తిన్నారు. నేను నాన్  వెజ్ తినను కనుక బంగాళ దుంప వేపుడు.. చారు తిన్నాను. తర్వాత అందరికి నిద్రోచ్చింది. నాకు తప్ప. "బయటకు వెళ్లి కూర్చుందాం.. హాయిగా ఉందిగా. లోపలేం ఉంటాం చిరాగ్గా" అని అందరి దగ్గరకు వెళ్లి పర్సనల్‌గా రిక్వెస్ట్ చేసినా, "అనూ.. నీ చెయ్యి పట్టుకొని నడుస్తుంటే ఎంత బాగుంటుందో.. నీలాగే ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉంది ప్రకృతి. రా అలా సరదాగా తిరిగొద్దాం" అని సోప్ పూసినా ప్రయోజనం లేకపోయింది. "నేనే ఉండగా నాలాగ ప్రశాంతతనిచ్చే ప్రకృతి ఎందుకు చెప్పు? దా.. కాసేపు నన్ను చూస్తూ రిలాక్స్ అవ్వు. కాసేపాగి తీసుకెళత" అని తేల్చేసాడు సింపుల్‌గా. మూతి ముడుచుకొని మూలన కూర్చుంటే కనీసం పట్టించుకోకుండా గురక వేరే పెట్టాడు. నేనూరుకుంటానా? తన తల దగ్గర కూర్చొని నా "ఊ.. ఊ.." రాగం మొదలుపెట్టాను. అయినా కదిల్తేనా? అందుకే "నీకోసం ఎన్ని కష్టాలు పడొచ్చానో.. ఊ..ఊ.. రాత్రంతా నిద్రే పోలేదు తెలుసా.. ఊ..ఊ.. నేనేం ఈ తొక్కలో కొండలు చుడ్డానికా వెళదామన్నాను? ఊ..ఊ.. వీళ్ళ మధ్య బాలేదు, కాసేపు నీతో ప్రేమగా, ప్రశాంతంగా ఉండాలనేగా.. ఊ..ఊ.. అర్ధం చేసుకోవు.. ఊ..ఊ..  ఊ..ఊ..  (గట్టిగా) ఊ..ఊ.. ఊ..ఊ.. ఊ..ఊ.. " ఇదిలా కంటిన్యూ అవుతుండగానే,  "ఊరుకోవుగా? సర్లే, ముందా రాగం ఆపు. చుక్క నీరు రాదు గాని అంబులెన్సు సైరెన్ లా వస్తుంది శబ్దం మాత్రం. పద" అన్నాడు లేస్తూ. ఈ సారి నేను పడుకొనిపోయాను సోఫాలో. "నాకేం వద్దులే. తిట్టుకుంటూ నీ నిద్రను నాకోసమేం త్యాగం చేయనవసరం లేదు. నువ్వు రమ్మనా నేనేం రాను" అనేసరికి తను కూడా మెల్లగా పక్క సర్దుకోబోయాడు. అమ్మో.. నేనెల కుదరనిస్తాను? ఇంకాస్త గట్టిగా "నువ్వు బలవంత పెట్టినా, నేను రానంతే." .. .. "ఇదిగో వినబడుతోందా? నువ్వు రమ్మన్నా, వచ్చి నన్ను లేపినా రాను.. రాను రాను" అన్నాను. నా భాష తనకు తెలుసును కదా.. సో లేచి వచ్చి నన్ను బుజ్జగించి తీసుకెళ్ళాడు. 100 మీటర్స్ దూరంలోనే ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. కాసేపు అక్కడ ఆడుకొని.. అటు ఇటు తిరిగి వచ్చేసరికి ఆంటీ, ఇంకా అక్కడ ఉన్న వాచ్ మాన్ ఫ్యామిలీ అందరు కలిసి జామకాయలు కోసుకుంటూ కనబడ్డారు. నేను కూడా వాళ్ళతో చేరి దాదాపు 15 కాయల వరకు కోసుకున్నా (తప్పు! అలా దిష్టి పెట్టకూడదు. అయినా అవేమి పెద్దవి కావు.. నిమ్మకాయ సైజులో ఉన్నాయి అంతే). తర్వాత అక్కడ ఉయ్యాల ఉంటే చాలా సేపు ఊగుతూ గడిపేశాను. మిగతా వాళ్ళంతా అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే వాళ్ళ దగ్గర కూర్చొని  బోలెడన్ని కథలు విన్నాను.. ఆఖరికి తొమ్మిది, ఆ ప్రాంతంలో రూమ్‌కెళ్ళి హాయిగా బజ్జున్నా.

ఉదయం ఆరుగంటలకే లేపెసారు. "పద పద రెడీ అవ్వు ఇంక మనం బయలుదేరాలి" అంటూ. భాదేసింది. "ఏంటి అప్పుడేనా" అని. కాని వేరే దారి లేక కాళ్ళీడ్చుకుంటూ బయలుదేరాను. అక్కడి నుండి కదిరికి 3 గంటలట (నాకు తెలీదులే.. హాయిగా బజ్జున్నాగా కార్లో). మధ్యాహ్నం వరకు కబుర్లు, అక్కడున్న షైనీ (బొద్దు కుక్క) తో చిన్న చిన్న యుద్ధాలు.. ఇలా సరదాగ రోజు గడిచిపోయింది. నా బస్ కి టైం అవడంతో మళ్ళీ ఉరుకులు, పరుగులు, జర్నీలో తిప్పలు. చెప్పలేదు కదూ.. ఆంటీ తిరిగి నాతో రాలేదు.

నేనోక్కతినే అక్కడినుండి చెన్నైకి వచ్చాను. ప్రయాణంలో అస్సలు నిద్రలేదు. నెక్స్ట్ డే ఆఫీసులో చుక్కలు కనబడ్డాయి.
నా బాస్ వర్క్ వర్క్ వర్క్ అంటుంటే నేను  పైకి సిన్సియర్‌గా ఫైల్స్ చూస్తూ.. లోపల  మాత్రం నిద్రా నిద్రా నిద్రా అనుకుంటూ..  కునికి పాట్లు పడుతూ.. ఎప్పుడెపుడు ఆఫీసు అవుతుందా, ఇంటికెళ్ళి మంచం మీద వాలిపోదామా అని ఎదురుచూస్తూ రోజు వెళ్ళిపోయింది.

ఇవండీ.. నా ట్రిప్ విశేషాలు. నాకు కొంచెం కష్టం, కొంచెం ఇష్టంగా అనిపించింది. మరి మీకు?

Friday, September 14, 2012

క్షమించు మనసా..నేను నేనే ఎందుకయ్యానో? అసలు ఎందుకు పుట్టానో? ఇంకా ఎందుకు బ్రతుకుతున్నానో?

ఛీ ఛీ.. ఏవిటి ఇలా ఆలోచిస్తున్నాను? "విషం చిమ్మే విషాదంలోనూ నవ్వగలిగే వాడే నిజమైన మనిషి" అని నమ్మే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?! "ఎవరెమంటే ఏం.. దేవునికి, అంతరాత్మకు తప్ప మరొకరికి బదులు చెప్పాల్సిన పని లేదు.. అయినా లోకులు కాకులు వారిని పట్టించుకుంటే జీవితంలో ముందడుగు వేయడం కష్టం" అనుకునే నేనేనా ఇలా ఆలోచిస్తున్నాను?? "నాకే ఎందుకు ఇలా జరుగుతోంది?" అని అనిపించిన ప్రతి సారి "నాకే ఎందుకు జరగకూడదు? మరెవరికో ఎందుకు జరగాలి? నేను దీన్ని ఎదుర్కోగలను కనుకనే నాకే జరుగుతోంది" అని సమర్ధించుకునే నేనేనా ఇలా నిస్సహాయంగా నిరీక్షణను కోల్పోయి మాట్లాడుతున్నాను?! ఆశ్చర్యంగానే ఉంది. కాని నిజమే.. నేనే ఇలా ఆలోచిస్తున్నాను!

నేను ఎంతో అభిమానించే ఆవిడ "ప్రేమగా" అన్న మాటలకు ఒక్కసారిగా నా మనస్సు ఉలిక్కిపడి చుట్టూ చూసింది. ఎప్పటిలాగానే గుండెనిండా గాయాలు, అగాధంలాటి ఒంటరితనం. బేలగా  నా వైపు చూస్తే, పెదవులు
నవ్వుతున్నా కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి. దాంతో అది వణికిపోతోంది. ఇప్పుడు నేనెలా దాన్ని సముదాయించనూ? ఎంతో కష్టపడి చందమామ కథలు చెప్పి, లేని పోని ఊహలు పుట్టించి, జరగని వాటిని జరుగుతాయి చూడు అని నమ్మబలికి, తనకోసం కృత్రిమ ప్రశాంతతను సృష్టించి జోల పాడితే.. అవన్నీ నిజమని నమ్మి అమాయకంగా ఆనందపడే నా మనసుని చూసి మురుసుకున్నాను. కాని ఇప్పుడు మళ్ళీ తను వాస్తవాన్ని గ్రహించి వణికిపోతుంటే నేనేమని ధైర్యం చెప్పను? "నువ్వు ఉత్తినే బాధపడకు. ఇప్పుడేమైందని? ఛీ ఛీ ఇలాటి చిన్న విషయాల కోసం ఏడుస్తావా నువ్వూ..? హవ్వ!"  అంటూ దగ్గరికెళితే "మళ్ళీ మాయమాటలు చెప్పకు"  పొమ్మంటూ దూరంగా తోసేసింది.   

నా బుగ్గల మీద కారుతున్న కన్నీటి చారలను చెరపడానికి చిరుగాలి చేసే చిరు ప్రయత్నాలు  విఫలమవుతున్నాయి. ఎప్పుడూ దగ్గరకు తీసుకునే మనసు కూడా పొమ్మంది. ఏం చేయను? ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే నా జీవితంలో అన్నీ ముళ్ళ చెట్లే.. ఒక్క పూలమొక్క అయినా లేదు. అయినప్పటికీ ఆ ముళ్ళ చెట్ల మధ్య ఉండే గడ్డిపూలను తలుచుకొని సంబరపడబోయాను కాని ఆ జ్జ్ఞాపకాల దారిలో ఉండే రాకాసి ముళ్ళు గుచ్చుకోవడంతో ఇదిగో ఇలా నిస్సహాయంగా కూర్చున్నాను. 

"రక్తసంబంధం ఉంటేనే ప్రేమా? లేకపోతే? మరి నా రక్తసంబంధికులు మాత్రం నన్నెందుకిలా ఒంటరితనానికి బందీని చేసారు? అవును. నేను అనాధనే.. అందరు ఉన్న అనాధను. ఇంతకూ అనాధ అంటే ఏవిటి? ఆ మాటకు అర్ధం తెలియకపోయినా ఎందుకు నాకీ క్షోభ? ఎన్నాళ్ళని వినాలి ఆ మాట?" అని మనసు మూగగా రోదిస్తుంటే నేనెలా ఆపనూ? నా రక్తసంబంధికులు అదే అంటారు.. బయటి వాళ్ళూ అదే అంటారు! ఎలా అయ్యాను నేను అనాధను? ఎందుకయ్యాను? గుడ్డిగా అభిమానించి నా వాళ్ళూ, నా వాళ్ళూ అని వెంపర్లాడుతూ ప్రేమ చూయించినందుకూ, అదే సన్నిహిత్యంతో వారిముందు నేను నేనుగా ఉన్నందుకు వారు నాకిచ్చిన బిరుదు "తింగరి, అనాధ, పిచ్చిమాలోకం". "నువ్వు దిక్కులేని దానివి.. ..... ... .. ... " అంటున్నపుడు  కనురెప్పల చాటున చివ్వున ఉబికిన కన్నీటినీ, ఉక్కిరిబిక్కిరయి మనసు పడ్డ వేదననూ పంటి బిగువున దాచిపెట్టి చిరునవ్వు నవ్వితే దాని అర్ధం నేను తింగరిననా? ఏమన్నా పట్టించుకోను.. తేలిగ్గా తీసుకోగలననా?!!! 
 
అయ్యో.. నాకు ఇంకాస్త శక్తి ఉంటే బాగుణ్ణు. నా మనసులోని మౌన రాగాన్ని విని మాట్లాడలేక మూగాబోవడం కాకుండా తనను ఊరడించగలిగితే బాగుణ్ణు.  అయినా మనసా..! నీ మౌనరాగాన్ని నే వింటున్నాలే..  నా నిస్సహాయతను మన్నించి మదనపడక ముందుకి సాగిపో.. !
      
Tuesday, August 14, 2012

నిన్న!

ముందు నాకు అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ చెప్పండి. చెప్తేనే పోస్ట్ రాస్తాను లేకపోతే రాయను గాక రాయను అంతే!
హమ్మయ్య చెప్పేశారా.. గుడ్ థాంక్ యు.. థాంక్ యు :)

ఇంతకూ విషయం ఏవిటంటే వచ్చే సోమవారం (అనగా ఆగష్టు 20న) నా పుట్టినరోజు! చక్కగా కొత్తబట్టలేసుకోవచ్చు, ఆ రోజు ఎన్ని వెధవ పనులు చేసినా ఎవరూ తిట్టరు. సాధారణం గా  చిన్నప్పటి నుండీ ఎవరి పుట్టినరోజైనా  నాకు ఆనందమే.. ఎందుకంటే ఎంచక్కా చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెడతారుగా (స్కూల్ లో అయితే వాళ్ళు పంచి పెట్టె గ్యాప్ + అవి తినడానికి ఇచ్చే టైం రెండు కలిపితే పాఠం  వినకుండానే క్లాస్ అయిపోయేది). ఇప్పుడైతే ఇంకొక్క అడుగు ముందుకేసి ఇంట్లో పార్టీస్ పేరుతో తిన్నంత కేకు, ఐస్‌క్రీం, హల్వా.. అబ్బాబ్బబా వాట్ నాట్?! ఇదేవత్తిరా బాబు "నిన్న" అని టైటిల్ పెట్టి, పోస్ట్ మొదలుపెట్టినప్పటి నుండి తిండి గురించి చెప్పి చంపేస్తోంది అనుకుంటున్నారా? అదేమరి.. అలా అపార్ధం చేసుకోకూడదు. పోనిలే చిన్నపిల్ల, అందులోనూ మన ప్రియా కదా, ముందు తన సోది తను చెప్పుకొని తర్వాతైనా విషయం చెప్తుందిలే అని ఓపికగా ఉండాలి మరి.
ఇంతకూ ఏమైందంటే నిన్న మా ఆఫీసు లో ఎలెక్ట్రిసిటీ  ప్రాబ్లం. దాంతో వర్క్ ఫ్రం హోం అని చెప్పేసుకొని ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరాం. నా కొలీగ్స్ షాపింగ్ కి వెళుతుంటే నేను కూడా వెళ్లాను. వెళ్లేముందు అనుకున్నాను "ఏది ఏమైనా అసలేమి కొనకూడదు. అసలే కాబోయే పెళ్లి కూతురిని, ప్రతి దానికి ఆయన్ని అడక్కుండా ఉండాలంటే బోలెడు డబ్బులు దాచేయాలి" అని (ఇది విని "మన ప్రియకి ఆత్మ గౌరవం కూడా చాల ఎక్కువ కాబోలు" అనేసుకోనేరు? మీరేమాత్రం అలా  పొరబడొద్దు. మన దగ్గర ఉన్నా లేకపోయినా భర్తే కర్చు పెట్టాలి. ఎందుకంటే భర్త అనగా భరించువాడు కదా.. :P. అసలు అలా ఎందుకు అనుకున్నానంటే అప్పుడు నా దగ్గర 1000 మాత్ర మే ఉన్నాయి.). ముందు పాండి బజార్ లో ఉన్న "Instore" కి వెళ్ళాం.  ఫస్ట్ 10 మినిట్స్ స్ట్రైట్ గా స్ట్రిక్ట్ గా ఉన్నాను. కాని ఎప్పుడైతే అక్కడ కొన్ని స్టోల్స్ చూసానో అప్పుడే మనసు మార్చేసుకున్నా. అయినా ఏ విశేషం లేకుండా వీళ్ళు కొనగాలేనిది, నేను కొంటె వచ్చిందా? అసలే నాకు పుట్టినరోజు వస్తోందాయే! అందుకే గబా గబా 2  స్టోల్స్ (ఒకటి నాకు, మరొకటి మా అత్తగారికి) తీసుకొని కౌంటర్ దగ్గర నిలబడ్డా. "ఇలా డబ్బులు కర్చుపెట్టేస్తే అమ్మో ఎలా? అసలే జీవితాంతం అతన్ని అడక్కుండా ఉండేంత డబ్బులు కావాలి. ఇప్పుడు చేతిలో ఉన్న 1000 లో 410 రుపీస్ హుష్‌కాకి" అని నా మనసు  ఘోషించింది. "ఛా! అయినా భార్యాభర్తల మధ్య ఇగో లేంటి? ఛత్! నోరుముయ్యి" అంటూ మనసుని బజ్జోపెట్టేసింది బుద్ధి. ఏది ఏమైతేనేమి ఆ షాప్ లో పని అయిపొయింది. అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్లి సాధించేది ఏమి లేదు. అసలు షాప్స్, వాటి పని తీరూ  పరిశీలించడమే మన తక్షణ కర్తవ్యం అని భావించి,  ఒక షాప్ లోనికి వెళ్లాను. అక్కడ అన్నీ భలే బావున్నాయి. వెంటనే మా ఆయనకు  ఫోన్  చేసి "నేనంటే నీకెంత ప్రేమే..?! నీ మనసు వెన్న అనూ.. నాకు తెలుసు. నేనే రాక్షసిని. నీ మంచితనాన్ని అర్ధం చేసుకోని  గండు పిల్లిని" అంటూ  4 పొగడ్తలు ఆయన నెత్తి మీద, 36 తిట్లు నా నెత్తినా చల్లుకోనేసరికి, నవ్వుతూ "విషయం చెప్పు హనీ" అన్నారు. అంతే! నా పని అయిపొయింది (ఉత్తినే ఏమి తీసుకోలేదులెండి, ఇంతకు ముందు నేను ఆయనగారికి 30రూపాయలుఅప్పిచ్చాను. దాని వడ్డీ పెరిగి పెద్దయి 1000 అయింది).  అలా 4, 5 షాప్స్ తిరిగి 2 కుర్తాలు, 1 లెగ్గిన్, 2 జతల గాజులు, ఒక చైన్, 3 జతల ear రింగ్స్ కొని వారి వ్యాపారాలకు మొత్తం కలిపి 1,968 రూపాయల లబ్ది చేకూర్చి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నా. గంట సేపు వాటిని చూసి మురుసుకోవడమే సరిపోయింది. తర్వాత కడుపులో కాకులు కావ్  కావ్ అనేసరికి గుర్తొచ్చింది మధ్యాహ్నం భోజనం చేయలేదని. సర్లే వంట చేసుకుందాం కదా అని ములక్కాడలు కోయడానికి కూర్చుంటే భళ్ళున వర్షం! అసలు మనకు కాస్త బద్ధకం పాళ్ళు ఎక్కువ.. దానికి ఆ వర్షం కూడా తోడవడంతో వంటలేదు గంటాలేదు అని ఉదయం వండిన రైస్ లో పప్పుపొడి, నెయ్యి, అంత ఆవకాయ వేసుకొని వర్షాన్ని చూస్తూ ఆరగించేసాను...

Tuesday, July 24, 2012

గుండె సవ్వడిGoogle image

కన్న తల్లిలా లాలిస్తాను, కడవరకు తోడుంటాను అంటూ కళ్ళతోనే అతడిచ్చే భరోసాను గుండె నిండా నింపుకొని మంచుకురిసే వేళ వరి చేను గట్టున కూర్చొని "ముద్ద బంతి పూయునే.. కోయిలమ్మ కూయునే.. ఆనందం వెల్లివిరుయునే.. ఈ బంధం నిత్యం నిలుచునే.." అంటూ చేప పిల్లలా తుళ్ళిపడుతూ కూని రాగాలు తీస్తోంది మనసు.

ప్రేమను పరికిణిగా కట్టుకొని, ఆశలన్నీ సన్నజాజులుగా మాల కట్టి తలలో తురుముకొని, ఆనంద భాష్పాలను కాటుకగా అద్దుకొని, బుగ్గల్లోని ఎరుపుని గోరింటాకుగా పెట్టుకొని, గాజుల సవ్వడితో పోటీ పడే నా గుండె చప్పుడుని అదుపులో పెట్టుకుంటూ.. అతడిని అనుసరించే రోజు దగ్గరకొచ్చినందుకే ఈ ఆనందం. 

Wednesday, April 25, 2012

ప్రేమా.. నువ్వెక్కడ?

ఎన్నిరోజులయిపోతోందో ఇలా వచ్చి!  బాగున్నావా..? నేను బాగున్నాను. కాని బాగాలేను. మనసంతా భారంగా ఉంది. ఏం చేస్తున్నానో తెలియడం లేదు. ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు అన్ని విధాలుగా ప్రశాంతమైన వాతావరణం ఉంది ఇంట్లో.  కాని ఎందుకో మనసులో చెప్పలేని బాధ. మనసంతా అల్లకల్లోలమైన స్థితి. చేయి చాచి హత్తుకునే హృదయం కోసం ఎదురుచూస్తున్నాను. "అమ్మ" లాటి ప్రేమను కురిపించే మనసును వెతుకున్నాను. స్వార్ధం, మోసం, కల్మషం, నటన, అధికారం చలాయించాలనుకునే తత్వం, పెడితే పెళ్ళి లేకపోతే చావు అనే తీరు, మనిషి మనసు కంటే డబ్బే ముఖ్యం అనుకునే నాకు తెలిసిన నా ప్రపంచం లోని మనుషులను చూసి విసిగిపోయాను. ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఎడారిలో నీళ్ళకోసం  వెదికినట్లు, నా చుట్టూ ఉన్న వారిలో కాస్త నిజమైన ప్రేమను, ఆదరణను వెదికి అలసిపోయాను. చుట్టూ ఉన్న వారు కాకపోయినా నా అనుకున్న నా వాళ్లైనా కాసింత ప్రేమ పంచగలరేమో అని కునుకైనా తీయకుండా వెదికాను. దొరకలేదు. ప్రేమ కురిపించి అక్కున చేర్చుకునే చల్లని వొడిలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవాలని ఉంది.

Google image

ప్రేమా, ప్రేమా నిన్ను వెదికి వెదికి సోలిపోయాను, నాకు ఇంకెప్పటికి దొరకవన్న ఆలోచనతో క్రుంగిపోయాను, నీకు  ఎంత దగ్గరవ్వాలని కోరుకుంటున్నానో అంతగా ఒంటరితనం నన్ను తన కౌగిలిలో గట్టిగా పొదివి పట్టుకుంటోoది.. ఇంకిపోయాయి ఇక రావు అనుకున్న కన్నీళ్లు నా చెంపలను ముద్దాడుతున్నట్లు, రావు అనుకున్న నువ్వు ఏదో ఒక రోజు నా జీవితం లోనికి అడుగిడతావని ఆశపడుతూ....

నీకు ఏమాత్రం ప్రియం లేకపోయినా.. నిరంతరం నీకై నిరీక్షించే,   
ప్రియ