Thursday, December 12, 2013

పెళ్ళి ఫోటోలు
అసలేం గుర్తుకురాదూ నా కన్నుల ముందు నువ్వు ఉండగా...!

ఇప్పుడు ఇలా డ్యూయెట్లు పాడేసుకుంటున్నాం కానీ, అందుకు లైసెన్స్ ఎలా తీసుకున్నామో మీరు చూడరా?? "ఎందుకు చూడం? ఆత్రుతగా ఎదురుచూస్తుంటేనూ.." అంటారా? హహ్హహ! అయితే ఇంకెందుకండీ ఆలశ్యం? కిందకు స్క్రోల్ చేసేయండి మరి.  ఐదు రోజులు పసుపు వేయడంతో మొదలయింది నా పెళ్లి తంతు (మా అత్తగారింట్లో ఇలాటి పద్ధతులు ఆచరించరట కానీ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు). ప్రధానానికి ముందు రోజు "రోజంతటిలో ఏదో ఒక టైంలో అభీ గాడు పడుకుంటాడుగా అప్పుడు అక్క చేత గోరింటాకు పెట్టించుకోవాలి" అనుకున్నాను. కానీ మా వాడు కరుణించలేదు. అదేంటో.. రోజులో కనీసం నాలుగు గంటలైనా పడుకునే పిల్లాడు నిముషమైనా నిద్రపోలేదు! ఇంకెవ్వరూ పెట్టొద్దు. పెడితే అక్కే పెట్టాలని నేను మొండి పట్టు పట్టి కూర్చున్నాను. ఆఖరికి ఆ రాత్రి 11.30 వాడు పడుకున్నాక తను నిద్ర మానుకుని మరీ గోరింటాకు పెట్టింది అక్క. రైట్ హాండ్ కంప్లీట్ అయ్యేలోపే నేను నిద్రలోకి జారుకున్నాననుకోండీ.. అది వేరే విషయం. ఎంతో ఓపికతో ఆల్మోస్ట్ పెట్టేసి నిద్ర కళ్ళతో సరిగా చూసుకోక లెఫ్ట్ హాండ్ చిటికెన వేలు, బొటన వేలు పక్కన కాస్త ప్లేస్ వదిలేసిందట ఉదయం లేచాక చూసుకుని ఎంత బాధపడిందో..!

మరుసటి  రోజు పెళ్లి వారొచ్చేసరికి ఇదిగో.. ఇలా తయారయి కూర్చున్నాను. వాళ్ళేమో నాకోసం ఈ కింది వస్తువులతో పాటు ఒక మేకప్ కిట్ కూడా తీసుకొచ్చారు. ఇంకా చాలా తీసుకురావాలిట కానీ.. "అవన్నీ అవసరంలేదండీ. నామకార్దానికి ముఖ్యమైనవి మాత్రం తెచ్చి, పిల్ల మెడలో బొందు వేయండి చాలు. అసలే తుఫాను కదా" అని అమ్మ అంది.

ఇదిగో.. ఇలా ఐదుగురు ముత్తైదువులు నా మెడలో బొందు (పసుపు దారం) వేశారు. 

తరువాత వాళ్ళు నాకొక బంగారు గొలుసు బహుకరించారు. దాన్ని ఇలా మా చిన్నత్తగారు నా మెడలో వేశారు. 

ప్రధానంలో ఓ తాతయ్య నాకు కల్యాణ ఉంగరాన్ని గిఫ్ట్ చేశారు.  

ప్రధానం ఏలూరులో జరిగింది. భరత్ వాళ్ళ ఊరికి రెండు గంటల ప్రయాణం అక్కడి నుండి. పెళ్ళేమో ఉదయం పది గంటలకు. అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడమంటే కష్టమని, ప్రధానం అయిన వెంటనే అందరం కలిసి బయలుదేరిపోయాం. అప్పుడు తీసిన ఫోటో ఇది.  

విడిది ఇంటి దగ్గర నుండి చర్చ్ కి బయలుదేరబోయే ముందు తీసిన ఫోటో ఇది. చీర కట్టుకోవడం దగ్గర నుండి ముడి వరకూ అన్నీ నేనే చేసుకున్నాను. పువ్వులు, వైల్ మాత్రం మా అత్తగారి తరపు ఆవిడ ఎవరో పెట్టారు. ఇహపోతే ఇలా నన్ను చూసి "మరీ ఇంత సింపుల్ గా ఉన్నావేంటీ? నగలు వేసుకో మేకప్ వేసుకో.." అదీ ఇదీ అంటూ గొడవ పెట్టారు అందరూ. నాకేమో ఎంత సింపుల్ గా ఉంటే అంత నచ్చుతుంది.. కంఫర్టబుల్‌గానూ ఉంటుంది. అందుకే.. నవ్వుతూ అందర్నీ మేనేజ్ చేసేసి ఆఖరికి ఇలాగే కంటిన్యూ అయిపోయాను :)

ఇది నన్ను చర్చ్ లోకి వెళుతున్నపుడు. నిజానికి అప్పుడు డాడీ నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్లాలిట. కానీ ఆయన వెనుక కార్ లో వస్తూ ఉన్నారు. అప్పటికే సమయం మించిపోతోందని ఇలా పిల్లలతో కలిసి వెళ్ళిపోయాం. 

నేను వెళ్ళేసరికే భరత్ అక్కడ ఉన్నాడు. నన్ను తన పక్కన కూర్చోపెట్టారు. ఆ పక్కా ఈ పక్కా పిల్లలు కూర్చున్నారు. 

ఈ  కింది ఫోటో ప్రామిస్ చేయడానికి లేస్తున్నపుడు తీసింది. వైల్ ని నా చేతికి అందిస్తున్న పాప ఉంది చూశారూ.. తన పేరు టీనా. మా రెండో మామగారి కూతురు. అంటే నా ఆడపడుచు. అమ్మోయ్..! మహా గడుగ్గాయి. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి నన్ను చూసి అందరూ "నీకెలాటి మొగుడొస్తాడో చూడాలి, పెళ్ళైయ్యాక ఎలా ఉంటావో చూడాలి" అంటే వినడమే గానీ, ఇప్పటి వరకూ నేను ఎవర్ని చూసీ అనుకోలేదు. దీన్ని కలిసాక అనిపించింది :). మా అత్తగారింట్లో ఉన్నంతసేపూ "వదినా వదినా" అంటూ చుట్టూ తిరిగింది. భలే అల్లరి పిల్ల!

మేము లేచి నిలబడ్డాక పాస్టర్ గారు అందరి వైపూ తిరిగి "ఈ పెళ్లి జరగడంలో ఎవరికైనా ఏవైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. లేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేరు" అని, "ఎవరెవరికి ఈ పెళ్లి ఇష్టమో చేతులెత్తండి" అన్నారు. అందరూ చేతులెత్తారు. అయినా ఆయన పెళ్ళి చేయనన్నారు! 

అదేంటీ అంటే.. "పెళ్ళి కూతురూ, పెళ్ళి కొడుకూ చేతులెత్తలేదు. వారికి ఇష్టం లేని వివాహం నేను చేయలేను" అన్నారు. అంచేత మేమూ చేతులెత్తాల్సి వచ్చింది. అదే ఈ కింది ఫోటో :)

ఇదిగో.. తరువాత ఇలా ఇద్దరి చేతా ప్రమాణాలు చెప్పించారు. 

"ఈ అమ్మాయినేనా నువ్వు పెళ్లి చూపుల్లో చూసింది? ముఖం తెరచాటున ఉంది కదా.. తెర తీసి సరిగా చూడు. ఆ అమ్మాయే అయితే తాళి కట్టేద్దువు" అన్నారు పాస్టర్ గారు. అప్పుడు భరత్ నా ముఖం మీద నుండి వైల్ ని వెనక్కి తీసి ఆ అమ్మాయినేనని కన్ఫార్మ్ చేసి తాళి కట్టాడు. అప్పుడు తీసిన ఫోటో ఇది. "ఏంటీ నువ్వొక్కదానివే ఉన్నావు.. భరత్ చేతులు తప్ప మనిషి కనబడడం లేదూ. కుళ్ళు నీకు. కట్ చేసేసావా?" అంటూ తిట్ల దండకాలు మొదలుపెట్టకండి. తనే బ్రతిమాలినా ఒప్పుకోలేదు! "మిగతా ఫోటోల్లో పెట్టావుగా చాల్లే. ఈ ఫోటోలో నేను మరీ బొద్దుగా కనిపిస్తున్నాను" అన్నాడు. నా చప్ప ముక్కు మాత్రం కనిపించడంలేదా.. దానిదేముందిలే అని బుజ్జగించబోయినా ఊరుకోలేదు :D   

హమ్మయ్యా! ఇంకేముందీ.. పెళ్లైపోయింది. తరువాత ఇలా ఇద్దరం నవ్వుతూ రిసెప్షన్ లో నిలబడ్డాం. ఆ ఫోటోలు కూడా పెట్టమంటారేమో? ఇప్పటికే పేద్ద పోస్ట్ అయిపొయింది కదా అని ఇక్కడితే ఆల్బం క్లోజ్ చేస్తున్నాను. 

మ్మ్.. ఇప్పుడు చెప్పండి. ఎలా ఉన్నాయి పెళ్ళి ఫోటోలు? వీటన్నిటిలో మీకు నచ్చిన ఫోటో ఏది? నాకయితే ఫస్ట్ పిక్ బాగా నచ్చింది :). మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా చెప్పాలి మీరు.  

Monday, December 9, 2013

శ్రీవారి పుట్టినరోజు

మొన్న (డిసెంబర్ 7) శనివారం  తన పుట్టినరోజు. మావయ్య గారు బిజీగా ఉండి రాలేకపోవడంతో అత్తయ్యగారూ, మరిది మాత్రం శుక్రవారం ఉదయమే ఇక్కడికి వచ్చారు. ఇంట్లో నాన్ వెజ్ వండితే నేనేమనుకుంటానో అనుకున్నారట, వచ్చేడపుడే చేపల కూర వండి తీసుకొచ్చుకున్నారు. ఆ ఉదయం దోశలు వేశాను. కూరగాయలు, వగైరాల కోసం బయటకు వెళ్ళడంతో భరత్ కోసం ఏమీ వండే టైం లేక పెరుగన్నం పెట్టేసాను లంచ్ బాక్స్ లో. భరత్ ఆఫీస్ కి వెళ్ళిపోయాక అత్తయ్యగారికి స్నానానికి వేన్నీళ్ళు పెట్టి ఇంటి పనిలో పడ్డాను. ఒంటిగంటకో ఎప్పుడో భోజనానికి కూర్చున్నాం. వాళ్ళు చేపల కూరా, నేను పెరుగన్నం. తరువాత మా మరిది గారు ఇంటర్నెట్ తో, నేనూ అత్తయ్యా కబుర్లతో బిజీ బిజీ. 

చెప్పలేదు కదూ.. పెళ్లైయ్యాక గీతక్క వాళ్ళ పక్కింట్లోకే వచ్చాం. ఇంకొక విషయం ఏవిటంటే నా అక్టివా హోండా ఇక పనిచేయట్లేదు. దాన్ని బాగుచేయలేమని చేతులెత్తేశారు కంపెనీ వాళ్ళు. ఆ వేళ గీతక్క బండిని అడిగి, మరిదిగారిని వెంటపెట్టుకుని కేకు షాప్ కి వెళ్లాను. చక్కని ఫ్రూట్ కేక్ ఒకటి ఆర్డర్ చేశాను. ఆరింటికి తయారవుతుంది అప్పుడు రండి అన్నాడు షాప్ వాడు. సర్లెమ్మని పక్కనే ఉన్న Archies కి వెళ్లి ముగ్గురం ఇవ్వగలిగేలా ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చేశాం (నేను పెళ్ళికి ముందే తన పుట్టిన రోజు కోసమని కార్డ్, గిఫ్ట్ కొనేశానులెండి). 

బాగా ముసురుపట్టి ఉండడంతో 5.30 కే చాలా చీకటిగా అయిపోయింది. ఆ రోజే కాదు.. వాళ్ళున్న మూడు రోజులూ అలాగే మిట్టమధ్యాహ్నం కూడా రగ్గులు కప్పుకునేంత చలితో, అప్పుడపుడు  చినుకులు పడుతూ ఉంది. సర్లెండి.. సరిగ్గా ఆరింటికి వెళితే ఎక్కడ వెయిట్ చేయిస్తాడోనని.. ఎలాగు దగ్గరే కదా నడుస్తూ వెళితే పావుగంట పడుతుంది అనుకుంటూ మళ్ళీ నేనూ మా మరిదిగారూ బయలుదేరాం. జాగ్రత్తగా చదవండి. ఇది నా మార్కు ఇన్సిడెంటు. కాకపోతే మరిదిగారి ముందు జరగడం బాధాకరం. హూం.. ఏవైందంటే మా ఇంటి పక్క సందు మలుపు తిరిగాక రోడ్ నిండుగా నీళ్ళున్నాయి. దాంతో ఫుట్ పాత్ ఎక్కాం. కాస్త ముందుకి వెళ్ళాక అడ్డంగా ఓ కుక్క పడుకుని ఉంది. దాన్ని దాటడానికి భయపడి, "చై" అన్నాను. అది "భౌ" అంది. నేను కెవ్వుమంటూ రోడ్ మీదకు దూకాను (బోర్లా పడ్డాను). కట్ చేస్తే.. అరచేతులు కొట్టుకుపోయి రక్తం కారుతూ, బలంగా రాళ్ళ మీద పడడంతో ఒళ్ళు నొప్పులు. పడిపోతే కనీసం లేపకుండా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ తో నిలబడి, కష్టపడి నేను లేచాక "దెబ్బలు తగిలాయా వదినా?" అని మరిది అడిగేసరికి అసలు బాధ కంటే ఆ బాధ ఎక్కువైపోయింది. కుంటితే బావోదని బింకం ప్రదర్శిస్తూ ఎలాగో కేక్ తీసుకుని ఇంటి వరకూ వచ్చాను. తీరా చూస్తే భరత్ బండి కనిపించింది. వీళ్ళున్నారని తను కాస్త త్వరగా వచ్చాడో లేక నా దెబ్బల కార్యక్రమం వల్ల లేట్ గా వచ్చానో తెలియదు (టైం చూసుకోలేదు). 

ఏ మాత్రం సౌండ్ చేయకుండా పైకి వెళ్లి కేక్ ని డాబా మీద పెట్టి, "ఇప్పుడు మీ అన్నయ్య ను బయటకు తీసుకువెళతాను.. ఆ గాప్ లో కేక్ ఫ్రిడ్జ్ లో పెట్టు లేకపోతే ఫ్రెష్ క్రీం కదా పాడయిపోతుంది" అని మరిదికి హితబోధ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే మా అత్తగారు "ఏమ్మాయ్ కేక్ ఏదీ?" అన్నారు భరత్ ముందు. నాకు నీరసం వచ్చేసింది. నేనెంతో కష్టపడి సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఇలా తన ముందే అడిగేసరికి నాకేం చెప్పాలో తోచలేదు. ఇంతలో ఏదో పట్టుకోమంటూ భరత్ గబుక్కున చేతులు పట్టుకున్నాడు. అబ్బహ్! ప్రాణం విలవిల్లాడిపోయింది. మొత్తానికి ఏం జరిగిందో చెప్పాల్సి వచ్చి చెప్పాను. "దారిపోయేదానివి తిన్నగా వెళ్లక కుక్కలతో నీకెందుకే?" అంటూ భరత్ తిట్లు, "అసలు అలా ఎలా చేశావమ్మాయ్?" అంటూ అత్తగారు కడుపుబ్బేలా నవ్వు! హూం.. కాసేపటికి మళ్ళీ కేక్ గురించి అడిగారు. "ఇంకేం కేకు? దెబ్బలకు ఫస్ట్ ఎయిడ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈ టైం అయింది. అయినా కేక్ ముందు రోజే ఆర్డర్ ఇవ్వాలిట. ఈ నొప్పి భరించలేక తిరిగివచ్చేసాం" అన్నాను. ఇంకా నయం మా మరిదిగారు భరత్ కన్నా చక్కగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కనుక సరిపోయింది. 

తరువాత నాకు బాండ్ ఎయిడ్ కావాలి అదీ ఇదీ అని చెప్పి భరత్ ని బయటకు లాక్కెళ్ళాను. ఇంటికొచ్చేసరికి అంతా గప్చిప్ గా ఉంది. ముందుగా నేను ప్లాన్ చేసిన దాని ప్రకారం నాకు నిద్రోస్తోందంటే నాకు నిద్రోస్తోందని మా ముగ్గురం ముసుగు తన్నేసాం. బాగానే అలసిపోయినట్లున్నాడు.. భరత్ కూడా త్వరగానే పడుకున్నాడు. వీళ్ళని పడుకున్నట్లు నటించి, తను పడుకున్నాక నాకు సాయం చేయమంటే.. నిజంగానే గుర్రు పెట్టేసారు. వేరే దారిలేక నేనే 10.30 నుండి రెండు పాకెట్ల బుడగలు ఊది, టార్చ్ వెలుగులో ఫ్రాగ్రెంట్ కాండిల్స్ అన్ని "I లవ్ సింబల్ U" అని రాసి మిగతా కాండిల్స్ ని ఆకాశంలో చుక్కల్లాగా హాల్ అంతా పరిచి వెలిగించాను. ఇక కేక్ తీద్దామని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతూ ఒక బుడగ మీద కాలు వేసేసరికి అది టప్ మంది. ఆ సౌండ్ కి అందరూ లేచారు. అప్పటికి ఇంకా 11.45. అయినా వేరే ఆప్షన్ లేక.. "Happy Birthday అనూ!" అన్నాను సంబరంగా. 

భరత్ త్రిల్ అయిపోతూ థాంక్స్ అనలేదు సరికదా.. కనీసం రూం అంతా నిండుకున్న ఆ బుడగల్ని, కొవ్వొత్తుల వెలుగుల్ని.. నా కళ్ళలో కాంతినీ ఏమాత్రం గమనించకుండా "అర్ధరాత్రిలో ఏంటే..? నిద్దరొస్తోంది.." అంటూ దుప్పటిని మొహం మీదకు లాక్కున్నాడు. ముందు కోపమొచ్చింది.. "దెబ్బ తగిలిన ఈ చేతులతో కష్టంగా ఉన్నా, ప్రాణమంతా గాలిగా చేసి అన్ని బుడగలు ఊది.. కుంటుకుంటూ అన్ని దీపాలు వెలిగించి.. ఎంత ఇష్టపడి చేశాను? ఏంటి ఈ మనిషి" అనిపించింది. ఆ ఉక్రోషంతోనే లేస్తావా లేదా అంటూ దుప్పటి లాగి పడేసాను. ఇక తప్పదన్నట్లు లేచి కూర్చున్నాడు. మిగిలిన గదుల్లోంచి అత్తయ్యా, మరిదిగారూ కూడా వచ్చారు. అక్కడి నుండి అంతా హుషారుగానే జరిగిందిలెండి. నాలుగు గ్రీటింగ్ కార్డ్స్, తనకోసం కొన్న గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చెప్పి కేక్ కట్ చేయించాం. నాకు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రతి చిన్న దాన్ని ఫోటో తీసి బద్రపరచుకునే నేను ఆ రాత్రి ఫోటో తీయలేకపోయాను. ముందు తోచలేదు... గుర్తొచ్చేసరికి అంతా అయిపోయి నిద్రకు ఉపక్రమించేశాం! ఇవండీ... పెళ్లి తరువాత జరుపుకున్న మావారి మొదటి పుట్టినరోజు విశేషాలు. రేపు (10 డిసెంబర్) అభీ గాడి 1st birthday. Please bless him. 

Tuesday, December 3, 2013

కల్యాణం - "ప్రియాను"బంధం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మా వివాహ మహోత్సవం మొన్న (29 నవంబర్ 2013) శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. ప్రధానం (28 న) రోజయితే అక్షింతలతో పాటు వర్షపు చినుకులూ పడ్డాయనుకోండీ.. చినుకులేగా అని తేలిగ్గా తీసుకోకండీ. మాంచి తుఫాను కావడంతో గుండెలు చేత్తో పట్టుకుని కార్యక్రమమంతా జరిపించారు ఇంట్లో. "శుక్రవారం అంతకు మించిన ప్రభావంతో ఉంటుంది తుఫాను" అన్నారు. కాని దేవుని దయ బావుండి ఒక్క చినుకైనా పడలేదు సరికదా.. ఎండ కూడా వచ్చింది!

నిశ్చితార్ధం గురించైనా నాలుగు మాటలు చెప్పగలిగాను కాని, పెళ్లి గురించి మాత్రం అస్సలు మాట్లాడలేకపోతున్నాను. ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో అర్ధంకావడంలేదు. అనూ కూడా అడిగాడు "ఏమైనా మాట్లాడు.. ఏమనిపిస్తోందో చెప్పూ" అని. నేనేమి చెప్పలేకపోయాను! అయినా తను తాళి కడుతున్నపుడు నా కళ్ళ నుండి జారిన కన్నీటి బొట్లు నా భావాలన్నీ తనకు అర్ధమయ్యేట్లు చెప్పాయిలెండి. మీకేమో ఫొటోస్ చెబుతాయి :). కాని ఫొటోస్ ఇంకా రాలేదు. వారం పడుతుందిట! మా మరిది గారు ఆయన మొబైల్ నుండి తీసిన ఫోటో పెడుతున్నాను. అందాక దీన్ని చూడండి :)నిన్నే చెన్నై కి తిరిగివచ్చామండీ. మీకు చెప్పలేదు కదూ.. పెళ్ళికి సెలవులు కావాలని అప్ప్లయ్ చేసిన వారంలోపే రాజీనామా కూడా ఇచ్చేశాను! తనకు అస్సలు నచ్చలేదు నేను వర్క్ చేయడం.. అంటే పర్సనల్ టైం మిస్ అవుతుందని వద్దన్నాడు, అత్తాగారూ వంతపాడారు. నాకూ సంబరంగానే అనిపించింది.. దాంతో రాజీనామా చేసేశాను. మనలో మన మాట.. ఇకపై ఎంచక్కా రోజుకో పోస్టు రాసుకునేంత వీలుంటుంది :P.

ఈ వేళయితే చాలా పనులున్నాయండీ. ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి, చాలా రోజులు ఇంట్లో లేకపోవడంతో దుమ్ము దుమ్ముగా ఉంది. ఇలాటి సమయాల్లో అనిపిస్తుంది పనిమనిషి ఉంటే బావుండని. కాని నాకు నేను చేసుకుంటేనే తృప్తిగా ఉంటుంది. ఉదయం అనూకి బాక్స్ పెట్టి పంపేశాను. సో గబగబా కాస్త ఆ బట్టలు ఉతుక్కుని, ఇల్లు ఊడ్చి తడి గుడ్డ పెట్టుకుని, స్నానం చేసి  మావారు వచ్చేసరికి ఏమైనా వండాలి. హహ్హహ.. అమ్మబాబోయ్ నేనూ హౌస్ వైఫ్ ని అయిపోయాను :D. 

నా కబుర్లకేం గానీ.. మీరు ఆలశ్యం చేయకుండా దీవించేయండి! పెళ్ళి ఫోటోలతో మళ్ళీ కలుస్తాను.. :)

Monday, October 14, 2013

పుట్టినరోజు కానుక

నా కానుక నాకిచ్చిన కానుక గురించి చెబుతానంటూ ఎప్పటి నుండి ఊరిస్తున్నానో కదూ.. ఇంకా రాలేదని మీలో ఎందరు విసుక్కున్నారో నాకు తెలియదు కాని, ఒక అమ్మాయి మాత్రం "ప్రియ గారూ.. ఈ వారమైనా భరత్ గారు ఏం గిఫ్ట్ ఇచ్చారో రాయకూడదూ? కొద్ది వారాల నుండి మీరు మాట మీద నిలబడటమే మానేశారు. ఇదిగో రాస్తాను, అదిగో రాస్తానని చెప్తారు.. తీరా ఆ రోజు వచ్చి చూస్తే ఏమీ ఉండదు. విసుగొచ్చేస్తుందండి. అసలు మీకు బ్లాగ్ కంటిన్యూ చేయాలన్న ఆశక్తి ఉందా లేదా?" అంటూ ఆగ్లంలో మెయిల్ పెట్టింది. అది చదివాక "అమ్మో.. ఇంకెంతమందికి ఈ డౌట్ వచ్చిందో? వాళ్ళు కన్ఫార్మ్ చేసుకునేలోపు పోస్ట్ రాయడం బెటర్ అని రాయడం మొదలుపెట్టాను. 

"తిట్టింది కాబట్టి రాస్తున్నావన్నమాట.. అయితే ఈ సారి మేమూ తిడతాము" అనుకుంటున్నారా? అదేం లేదండీ. పోస్ట్ రాయడానికే సైన్ ఇన్ చేశాను. చేశాక, ఈ మెయిల్ కనబడింది. అయినా నేను కావాలని అశ్రద్ధ చేయడం కాదండి బాబు.. నా ఖర్మ అలా కాలిపోతోందంతే. మొన్న ఏదో కామెంట్ కి రిప్లై ఇస్తూ వాపోయినట్లు, ఏ ముహూర్తాన "నా పనీ పాట" పోస్ట్ రాసి ఆఫీస్ కి వెళ్ళానో గాని వర్క్ వర్క్ వర్క్ అంటూ చెప్పలేనంత భారంతో చచ్చిపోతున్నాను. ఇక గత రెండు వారాలయితే, రోజూ రాత్రి నిద్రపోయే సరికి కచ్చితంగా 12 దాటింది! మళ్ళీ ఉదయాన్నే 7.30 ఆఫీస్. అందరూ హ్యాపీగా దసరా పండుగ చేసుకుంటుంటే నేను పని పండుగ చేసుకుంటున్నాను :(. ఈ రోజైతే ఉదయం 8 గంటలకు కూర్చున్నాను కంప్లీట్ చేయడానికి సాయంత్రం 6.30 అయింది ;(. ఇవీ నా కష్టాలూ, కన్నీళ్ళూ.. 

సరే ఈ కష్టాల గొడవ పక్కన పెట్టేస్తే, నా పుట్టినరోజున భరత్ ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే.. 19న ఆఫీస్ అయిపోయాక సాయంత్రం కలుసుకున్నాం. As usual మా ఇంటి దగ్గర బీచ్ లోనే. వెళ్ళాక ఎప్పటిలానే తను దారిన పోయే వాళ్ళనూ, నేను అలలనూ చూస్తూ కూర్చున్నాం. గాప్ లో నేనొక మాంచి ఇల్లు కూడా కట్టాను. చూస్తారా? 

కాసేపటికి, "నీళ్ళలో కాళ్ళు పెడదాం రా" అన్నాడు. లేచి ముందుకెళ్ళిన తరువాత ఎక్కడి నుండి తెచ్చాడో కాని సడన్‌గా ఒక పువ్వు చేత పట్టుకుని "ఐ లవ్ యూ" అన్నాడు! నేనేమంటాను? షాక్!! మొదటిసారి తను నాకు ప్రపోజ్ చేసినపుడు కలిగినటువంటిదన్నమాట. అనూ ఏంటీ.. పువ్వు ఇవ్వడమేంటీ?! ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ పువ్వు తీసుకుని నవ్వాను (అంతకు మించి మాటలు రాలేదు మరి). 

తనకి ఇలాటి ఆలోచనలు ఉండవు. "హుం! గొప్ప! లవర్స్ అన్న పేరే గాని ఇప్పటివరకూ రోజ్ అయినా ఇచ్చావా? అసలు నువ్వు "ప్రియా లేకపోతే దివ్య, దివ్యా కాకపోతే భవ్య. నువ్వేం అందంగా ఉండవు.. ఏదో మంచిదానివని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను" అన్నప్పుడే గ్రహించి ఉండాల్సింది నా ఫ్యూచర్ ఏంటో.. " అని ఏ రోజైనా కసిగా ఉన్నపుడు దెప్పిపొడిస్తే, "నీకు లేని పువ్వులా? రా డార్లింగ్.. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. బిల్ మాత్రం నువ్వు కట్టేద్దూ గాని" అంటూ నిజంగానే పువ్వు కొని నా చేతే డబ్బులిప్పిస్తాడు. అలా తన నుండి పువ్వులందుకోవడమే కాని.. ఇలా తనకు తానుగా ఇవ్వడం, అది కూడా "ఐ లవ్ యు" అని చెబుతూ అసలెప్పుడూ లేదు. అందుకే షాక్ లో మాటలు రాలేదు. "ఈ బోడి గిఫ్ట్ కి ఇంత బిల్డప్పా.." అన్నట్లు ఆ చూపులేంటండీ బాబూ.. ఇంకా ఉంది. కావాలంటే కింది చూడండి. 

టైం ఏడున్నర అవ్వొస్తున్నపుడు "నాకు ఆకలేస్తోంది" అన్నాడు అనూ. "పద ఇంటికి వెళ్ళి తిందాం.. అమ్మ ఏమైనా చేసుంటుంది" అన్నాను. అహ కాదు మా కాంపస్ (IIT) కి వెళ్లి తిందాం అన్నాడు. సాధారణంగా తను బయట తినడానికి ఇష్టపడడు. అలాటిది బయటే తిందామని పట్టుబట్టేసరికి, ఔననక తప్పింది కాదు. 

కాంపస్ కి వెళ్లాక బండి లైబ్రరీ దగ్గర పార్క్ చేసి, "కాసేపు నడుద్దాం పద. తర్వాత తినొచ్చులే" అన్నాడు.  అప్పుడొచ్చింది నాకు అనుమానం "కొంపదీసి నాకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా? ఛాన్స్ లేదే.. ఏమో అదృష్టం కలిసొస్తే ఏమైనా జరగొచ్చు"  అనుకుంటూ ఉత్సాహం అడుగులు జతకలిపాను. ఆ మాటా ఈ మాటా చెప్పుకుంటూ గంట దాటింది. "ఇంటికి వెళ్ళే టైం అయిపోయింది.. ఇంకా ఏమీ ఇవ్వడేంటీ??" అని బెంగపడ్డాను. ఆహ్.. అదే అదే.. ఏమీ మాట్లాడడేంటీ అని :P. 

త్వరగా ఇచ్చేయ్ ఇంటికెళ్ళిపోవాలి" అని గొంతు వరకూ వచ్చింది కానీ.. నేను కనిపెట్టేసానని అప్సెట్ అవుతాడేమో.. ఇంకాసేపు ఆగి చూద్దాంలే అనుకున్నాను. టైం అయితే చక చకా కదిలిపోతోంది కాని పుట్టినరోజు గురించి మాట్లాడ్డం కాని, టాటా చెప్పే సంకేతాలు కాని కనబడలేదు. దాంతో, నేనే "సరే మరి లేట్ అవుతోంది. ఇక బయలుదేరతాను" అన్నాను. "ఏంటి తొందరా? మీ మమ్మీతో నేను చెప్పానులే లేట్ అవుతుందని" అన్నాడు. నా కళ్ళు మిలమిలా మెరిసాయి ("అ ఐ అ ఐ.. నాకేదో గిఫ్ట్ రానుందోచ్" ఇదే ఆ మెరుపుకి అర్ధం). 

పదయింది. నాకు కడుపులో ఎలకలే కాదు గుర్రాలే పరిగెట్టాయి. కాని అప్పటికి మెయిన్ గేట్ వరకూ నడుచుకుంటూ వచ్చాం కనుక తినాలంటే మళ్ళీ ఐదు కిలోమీటర్లు నడిచి లోపలికి వెళ్ళాల్సిందే. ఆల్రెడీ ఉత్సాహంతో అలుపు తెలియక 2 రౌండ్లు వేసి ఉండడంతో ఇక నా వల్ల కాలేదు. తొక్కలో గిఫ్ట్ కోసం మరీ ఇంత సాక్రిఫైజ్ అవసరం లేదని నేను గట్టిగా భావించాను. అసలు లేనిపోనివి ఊహించుకుని నా కొంప నేనే ముంచుకున్నానేమో అని బాధపడ్డాను కూడాను. సరిగ్గా ఆ సమయంలో అనూ నాకొక కవర్ ఇచ్చాడు. 
అందులో లాస్ట్ ఇయర్ మేము హార్స్‌లీహిల్స్ కి వెళ్ళినపుడు తీసుకున్న ఈ కింది ఫోటో ఉంది. 

ఆ ట్రిప్ తరువాత ఈ ఫోటో ని చూడలేదు నేను. సో మురిసిపోతూ సంభ్రమంగా భరత్ వైపు చూస్తే తనేమో ఫోటో వెనుక చూస్తున్నాడు. ఎంటా అని నేనూ చూశాను.

 "నీ ప్రేమ ఇంద్రదనస్సంత అందంగా, కలర్‌ఫుల్ గా మార్చింది నా జీవితాన్ని. నేనెప్పుడూ అనుకోలేదు.. నన్ను ఎవరైనా ఇంత ప్రేమిస్తారని, నేను ఎవరినైనా ఇలా ప్రేమించగలనని. Thank you so much for everything. You really mean a lot to me and I love you with all my heart!"

అని రాసి ఉంది! I was really impressed. కళ్ళే కాదు.. గుండె కూడా తడయింది. మౌనంగా ముందుకి నడుస్తూ "ఈ వేళ కాఫీ డే (కాంపస్ లోనే) కి వెళ్దాం" అన్నాను. తనకు నచ్చకపోయినా.. "సరే" అన్నాడు. అప్పటికే టైం పదకొండు. షాప్ క్లోజ్ చేసి ఉంటారని నేను కంగారుపడితే, అక్కడేమో అంతా జనాలతో కిక్కిరిసిపోయి ఉంది. భరత్ అంతకు ముందు చెప్పాడు "iitలో జనాలు పగలు కంటే రాత్రిళ్ళే ఎక్కువ తిరుగుతుంటారు" అని. నేను అస్సలు నమ్మలేదు. మొన్న స్వయంగా చూశాక నమ్మాల్సి వచ్చింది. ఎంచక్కా చెట్ల కింద కూర్చుని చదువుకుంటూ, జాగింగ్ కి వెళుతూ, కాఫీ డే లో కాఫీలు తాగుతూ, బాతాకాని కొట్టుకుంటూ.. ఆల్మోస్ట్ అందరూ రోడ్ల మీదే ఉన్నారు!

నాకు టీ, కాఫీలు అలవాటు లేవు. ప్రత్నించాను కాని నచ్చలేదు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా.. నాకు చాక్ట్లేట్స్ అస్సలు నచ్చవు. అసలు ఆ స్మెల్ కూడా నచ్చదు. భరత్ కేమో పిచ్చి చాక్ట్లేట్స్ అంటే! కాఫీ డే లో చాక్ట్లేట్ ఫ్లేవర్ లో ఏదైనా బావుంటుంది అని విన్నాను. అందుకే అక్కడికి తీసుకెళ్ళాను. నాకు నచ్చేట్లు ఏమీ లేకపోయేసరికి, "నాకేం వద్దు. నువ్వు తీసుకో" అన్నాను. ఉరిమినట్లు చూసాడు. "ప్లీజ్.. నీ దగ్గర కాస్త టేస్ట్ చేస్తానులే" అన్నాను. ఇంకేం మాట్లాడట్లేదు. 

కాఫీ వచ్చేలోపు, నేను ఇంటికి వెళ్ళడం.. అమ్మ ఏమంటుందో.. ఈ మాటలు దొర్లాయి. "ఏం కాదులే" అన్న వాడల్లా సడన్‌గా ఏదో గుర్తొచ్చినట్లు ఆగి, "మనం ఇప్పుడు బయటకు వెళ్ళడం కుదర్దు. 11. 30 అయింది చూడు టైం. పైగా పాస్ కూడా పోయింది' అన్నాడు. "ఏ విధంగాను కుదరదా? రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోరా?" అన్నాను తడారిపోయిన గొంతుతో. "కుదిరితే నేను చెప్పనా?" అన్నాడు. ఇంకేముందీ.. గుండెల్లో దడ మొదలయింది నాకు. రేపు పుట్టినరోజు కాదు, పెళ్లి రోజని మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. 

ఈ లోపు కాఫీ రానే వచ్చింది. టేస్ట్ చూడమని నాకే ఇచ్చాడు ముందు. నా మనసు మనసులో లేదు. రేపు ఏం జరుగుతుందన్న దాని గురించి ఆలోచిస్తూ కాఫీ తీసుకున్నాను. తీసుకోవడమే కాదు.. గడ గడా మంచి నీళ్ళు తాగినట్లు తాగేశాను కూడా. "ఛీ యాక్!" అనే దాన్నల్లా ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా తాగుతుండే సరికి, "మీ చెల్లి కాఫీ అంటే నచ్చదు నచ్చదంటూ నా కాఫీ మొత్తం తాగేసిందని" ఆధారంతో మా అక్క కు చూపడానికి ఫోటో తీసాడు. తీసేడపుడు పిలిచాడట గాని నాకు వినిపించలేదు!

తరువాత "ఈ" అని నవ్వుతూ ఫోటోలు తీసుకున్నాంలెండి. ఈ లోపు మా అక్క ఫోన్ చేసింది విషెస్ చెబుతూ. అప్పుడే భయపడుతూ భయపడుతూ అమ్మతో చెప్పాను. ఇలా iit స్టక్ అయ్యాను.. భరత్ జూనియర్ ఒక అమ్మాయి ఉంది.. తన రూంలో నిద్రపోయి తెల్లవారుజామున వచ్చేస్తానని. అమ్మ కి కోపం వచ్చింది కాని.. "ముందుగా చూసుకోవద్దా..? సర్లే. జాగ్రత్త. ఫోన్ చెయ్యి" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అమ్మతో మాట్లాడిన తరువాత కాస్త ప్రశాంతంగా అనిపించింది. అంతలోనే భరత్ ఇంకో బండ రాయి వేసాడు నా నెత్తిన. తనకు ఇప్పుడు ఎవ్వరూ తెలియదట కాంపస్ లో. ఒకరు ఇద్దరు ఉన్నా కూడా అస్సలు బావుండదు.. అన్నాడు. 

ఇంకేం చేయగలను? "గిఫ్ట్ కోసమై వలలో పడినే పాపం పసి పిల్లా.. అయ్యో.. పాపం ప్రియమ్మా" అని పాటందుకుని మళ్ళీ వాకింగ్ మొదలుపెట్టాము. సాధారణంగా 9. 30, 10 కల్లా నిద్రపోతాను. ఏ రోజైనా టీవీ లో బ్లాక్ అండ్ వైట్ సినిమా నచ్చేస్తోనో, వర్క్ తో కుస్తీ పట్టాల్సి వస్తేనో తప్పా.. లేకపోతే టంచనుగా 10 లోపు నిద్రలో ఉంటాను. అలాటిది ఆ రాత్రి అసలు నిద్రేపోలేనంటే జీర్ణించుకోలేకపోయాను. ఇంత కంటే పెద్ద బాధేంటంటే.. నేను దేని కోసమైతే కక్కుర్తిపడ్డానో అదే జరిగి చావలేదు. పువ్వు, ఫోటో ఇచ్చాడు కాని విషెస్ చెప్పలేదు. ఫోన్ లో అక్క కి థాంక్స్ చెప్పినా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం బెటర్ లేకపోతే ఇక కాల్స్ వస్తూనే ఉంటాయని గొంతు చించుకున్నా.. అర్ధం చేసుకోలేదు. ఏంటీ అని కూడా అడగలేదు! వట్టప్పుడైతే అడుగుతాడు ఏదైనా కాల్ పెట్టగానే "ఏంటటా?" అని. 

ఇలా గింజుకుంటూ.. అర్ధరాత్రిలో మద్దెల దరువులా ఆ టైం లో జాగింగ్ చేసే వాళ్ళను చూస్తూ..  రోడ్ మీద వెలుగున్నా.. చుట్టూ చెట్లు, చీకటీ చూసి జడుసుకుంటూ.. నీరసంగా నేను అడుగులేస్తుంటే, భరత్ చాలా ఉత్సాహంగా "హేయ్.. ఫుట్ బాల్ ఆడదామా?" అని అడిగాడు. పిచ్చి గాని పట్టిందేమోనని కాస్త అనుమానంగా చూశాను తనవైపు. "ఏంటి అలా చూస్తున్నావ్? ఒహ్హ్ బాల్ ఎలా అనా? ఈ పక్క రోడ్లో అన్నీ వెలగ చెట్లే. బోల్డన్ని కాయలు కింద పది ఉంటాయి. వాటితో ఆడదాం" అన్నాడు. నాకూ ఆ ఐడియా నచ్చింది. సో ఎంచక్కా వెలక్కాయలతో ఫుట్ బాల్, రోడ్ డివైడర్ మీద కుంటాట ఆడుకున్నాం 2 గంటలు. తరువాత అలసిపోయి అక్కడే ఒక బెంచీ మీద కూలబడి కునికిపాట్లు పడ్డాం. దొరికింది కదా సందని.. దోమలు ఓ రేంజ్ లో పండగ చేసుకున్నాయి మా బ్లడ్ తో. అదిగో.. అప్పుడు! అప్పుడు చెప్పాడు. "హ్యాపీ బర్త్ డే" అని. సడన్ గా చెప్పేసరికి "కలలోకి వచ్చి ఏమైనా గుర్తు చేశానా?" అనడిగాను అనుమానంతో. అప్పుడు భరత్ చెప్పిన సమాధానం విని, నాకైతే అప్పటి వరకూ ఫుట్ బాల్ గా వెలక్కాయల బదులు తనను వాడుంటే బావుండనిపించింది! 

నేను అడిగిన వెంటనే చాలా గొప్పగా.. "ఏం కాదు. నువ్వు 3.30 ఆ టైం లో పుట్టావని మీ మమ్మీ మొన్న మాటల మధ్య చెప్పారు. నువ్వు పుట్టిన టైం కే విషెస్ చెప్పాలని.. వెళ్ళడం కుదరదు, తెలిసిన వాళ్ళు లేరంటూ అబద్దాలు చెప్పాను.  నిజానికి గేట్ క్లోజ్ చేయడం అంటూ ఏమీ ఉండదు. లేట్ నైట్ వెళితే సెక్యూరిటీ గార్డ్ కి ఎందుకు అంతసేపు ఉండాల్సి వచ్చిందో చెప్పి పాస్ ఇవ్వాలంతే :). చెప్పు.. సర్ప్రైజ్ అయ్యావు కదూ.. ఇదే నా గిఫ్ట్" అన్నాడు ఒకింత గర్వంగా. " నిద్ర ను ఆపుకోలేక, నడిచే ఓపిక లేక, కూర్చుని దోమలతో పడలేక నరకం కనిపిస్తోంటే.. హహ్హహ జీవితంలో నీ నుండి మళ్ళీ గిఫ్ట్ అనేది కోరుకుంటే నా చెప్పుతీసుకుని కొట్టు. హాం!" అంటూ మనసు ఘోషించి కంట తడి పెట్టుకుంది. నోరు మాత్రం "Aww.. how sweet! I am really thrilled! Thank you so much" అంది నవ్వులాటి ఏడుపుతో. 

ఇక అప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్లాం. నన్ను డ్రాప్ చేసి తను వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఏం జరిగిందో మీకు తెలుసుగా.. :)

చూసుకోకుండా చాలా పెద్ద పోస్ట్ రాసినట్లున్నాను. ఈ పోస్ట్ ప్రత్యేకంగా నా కోసంమే రాసుకున్నాను. ఆ నిద్రలో ఏడుపొచ్చింది కాని.. తరువాత తలుచుకుంటే చాలా బావుంది. పాపం భరత్ అస్సలు నిద్రకి తాళలేడు. అటువంటిది పాపం నాకోసమని అంత కష్టపడ్డాడు.. he made my day. ఇంతకంటే ఇంక మాటల్లేవ్. Love you, Anu.. :) Thanks a lot for everything.

Saturday, October 12, 2013

పెళ్ళా మజాకా!

"లేడికి లేచిందే పరుగన్నట్లు.. ఏంటా తొందరా? ఆడపిల్లంటే నెమ్మదిగా అణుకువతో ఉండాలి" ఈ మాట ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ నోటి నుండి ఎన్నిసార్లు వినుంటానో లెక్కే లేదు! ఆ మాటలోనే తెలుస్తోంది కదా నాకెంత కుదురో? :) 

నా స్వభావానికి తగ్గట్లే లైఫ్ లో అన్నీ చాలా త్వర త్వరగా జరిగిపోయాయి. సాధారణంగా ఆరో నెలలో బోర్లా పడతారట పిల్లలు. నేను ఐదో నెలలో అడుగిడిన వారానికే బోర్లాపడడం మాత్రమే కాకుండా పాకడానికి కూడా ప్రయత్నించేదాన్నిట! ఎనిమిదో నెలలో "వద్దేయ్" అన్న మాటతో మొదలయిన మాటల ప్రవాహం గురించి అడపాదడపా మా ఇంట్లో అందరూ బాధపడుతూనే ఉంటారు. ఇక చదువు ఎప్పుడు మొదలయిందో, ఎప్పుడు అయిపోయిందో తెలియనంత త్వరగా అయిపొయింది. ఇలా నా లైఫ్‌లో ప్రతీది చాలా ఫాస్ట్ గా, అంత కన్నా స్మూత్ గా జరిగిపోయాయి. ఒక్క నా పెళ్లి తప్ప!

నాకంటే రెండేళ్ళు పెద్దదైన అక్క ఉన్నా కూడా ఎప్పుడూ నా పెళ్లి గురించే ఎక్కువ ఆరాటపడేది అమ్మ (బహుశా నన్ను తొందరగా బయటకు పంపేస్తే తర్వాత కాస్త ప్రశాంతంగా ఉందామని కాబోలు?!). నాన్నకేమో "పెళ్లి" అన్న టాపికే నచ్చదు. దానికి కారణం, మమ్మల్ని దూరంగా పంపించాల్సి వస్తుందన్నది మొదటి కారణమైతే.. రెండోది he is too possessive. ఆయన కన్నా అమ్మను ఎక్కువ ప్రేమించినా కూడా భరించలేరు. అన్ని విషయాల్లోనూ ఎంతో మెచ్యూర్డ్ గా ఉండే డాడీ మా విషయంలో మాత్రం డిఫరెంట్ గా (ఎలా డిఫైన్ చేయాలో అర్ధంకావడంలేదు అందుకే డిఫరెంట్ అంటున్నా) ఉంటారు. 

ఉదాహరణకి, ఓసారి మేమందరం కలిసి బయటకు వెళుతూ ఒక జ్యూస్ షాప్ దగ్గర ఆగాము. సాధారణంగా కార్ లో కూర్చునే తాగుతాం కాని, ఆ రోజు క్లైమేట్ బావుండి ప్లెజెంట్ గా ఉందని బయట నిలబడ్డాం. మాకు కాస్త పక్కగా ఓ ముగ్గురు, నలుగురు కుర్రాళ్ళు కూడా నిలబడి ఉన్నారు. వాడిలో ఒకడు మాటిమాటికి మా అక్క ను చూస్తూ వెకిలిగా పళ్ళికిలించాడట.. జ్యూస్ వచ్చే వరకు ఓర్చుకుని, వచ్చాక నేరుగా వాడి దగ్గరకెళ్ళి ఆ జ్యూస్ వాడి మొహం మీద కొట్టారు.  ఊహించని ఈ పరిమాణానికి వాళ్ళూ, మేమూ అందరం షాక్!  జ్యూస్ మొహం మీద పోయడం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించమని వార్నింగ్ ఇవ్వడం, మళ్ళీ అసలే వాళ్ళు నలుగురున్నారు తిరిగి ఏమైనా చేస్తారేమో అని భయంతో గబగబా మమ్మల్ని లాక్కెళ్ళి స్పీడ్ గా కార్ ఇంకో రూట్లోకి మార్చేయడం అంతా నిముషంలో జరిగిపోయింది. "ఇంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్ అవ్వాలా? లేనిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవడానికి కాకపోతే?" అంటూ తర్వాత అమ్మ తాండవం చేసిందనుకొండీ.. అది వేరే విషయం.

క్లాస్మేట్స్ తో కాని, బంధువుల్లో కాని ఎవరైనా అబ్బాయిలతో మాట్లాడుతున్నపుడు.. కొంత వరకూ ఓకే కాని ఏ మాత్రం నవ్వు శృతి మించినా, అవసరానికి మించి ఒక మాట ఎక్ష్త్రా అయినా.. అంతే సంగతులు. అలాగని స్ట్రిక్ట్ గా ఎవ్వరితోనూ మాట్లాడకూడదంటూ షరతులు విధించి చాదస్తంగా ప్రవర్తించరు. కానీ.. చూపులతోనే కట్టిపడేస్తారు. మాకు సంబంధించిన విషయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో అన్నీ తీసుకుంటారు. అయినా ఎక్కడా ఓవర్ ప్రొటెక్టీవ్ గా ఉన్నట్లు అనిపించనివ్వరు. మా ఇష్టాలను, అభిప్రాయాలనూ ఎంతో గౌరవిస్తారు. ఎలాటి విషయమైనా పంచుకునేంత ప్రేమగా, ఆత్మవిశ్వాసంతో పెంచారు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చెయ్యి చేసుకోలేదు! తిట్టను కూడా తిట్టలేదు. ఏదైనా ఇష్యూ ఉంటే కూర్చోబెట్టి మాట్లాడతారు, లేకపోతే మేము మాట్లాడే వరకూ మౌనంగా ఉంటూ ఆయన మా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు అర్ధమయ్యేలా చేస్తారు.

అమ్మోయ్! హహ్హహ..  నా పెళ్లి గురించి మొదలుపెట్టి నాన్న గురించి రాసేస్తున్నాను. ఇది ఇలా కంటిన్యూ చేస్తే ఈ పోస్ట్ కి ఇక అంతముండదు. అంచేత మళ్ళీ నా పెళ్లి మాటలోకి వచ్చేద్దాం. నా ప్రేమను ఆయన అంగీకరించడానికి నేను పడిన తిప్పలు ఎలాగూ "ప్రేమాయణం" లో చెప్తాను కనుక ఇప్పుడు దాని గురించి మాట్లాడను. 

భరత్, వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పడానికే ఏడాది టైం తీసుకున్నాడు! విషయం విన్నాక అవునో కాదో చెప్పడానికి మా మావయ్యగారు నాలుగు నెలలు టైం తీసుకున్నారు. తీసుకుంటే తీసుకున్నారులే.. ఆయనకు పూర్తి ఇష్టం లేకపోయినా వాళ్ళ అబ్బాయి తీసుకునే నిర్ణయాల మీద నమ్మకంతో ఒప్పుకున్నారు. అప్పుడు మా అమ్మ దగ్గర భరత్ తో పెళ్ళి మాట ఎత్తితే అంతెత్తున ఎగిరిపడింది నా మీద! బుద్ధిమంతుడు, చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, గౌరవప్రదమైన కుటుంబం, చూడ్డానికి కూడా బావుంటాడు. ఇంతకన్నా ఇంకేం కావాలమ్మా అంటే, కులాలు వేరు, అబ్బాయి లావుగా ఉన్నాడు అని ససెమేర వద్దంది. నాన్న నో కామెంట్స్.. "ఏదైనా ముందు అమ్మతో తేల్చుకుని రా. ఆవిడ ఎలా అంటే అలా" అన్నారు. అక్క "నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు చెల్లీ" అని చేతులెత్తేసింది. 

పైగా నెల తిరిగేలోపు అమ్మ నాకు వేరే సంబంధం ఖాయం చేసేసింది! ఏడ్చి, గగ్గోలు పెట్టి మా అమ్మా నాన్నలను ఒప్పించేసరికి హమ్మా! ఆరు నెలలు పట్టింది (అప్పటికీ అమ్మ పూర్తిగా ఒప్పుకోలేదనుకోండీ..). మొత్తానికి 2012 జూలై నెలకి అటూ ఇటూ రెండు వైపులా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాని ఈ లోపు భరత్ కి మరో మంచి ఉద్యోగ అవకాశం వచ్చింది. పోస్టింగ్ కోసం నవంబర్ వరకూ ఆగాల్సి వచ్చింది. జనవరిలో నిశ్చితార్దం పెట్టుకోవాలనుకున్నారు. కాని ఏ కారణమూ లేకుండానే అది కాన్సిల్ అయి, ఆఖరికి మే 7 న జరిగింది. అది కూడా జస్ట్ నిశ్చితార్దానికి నాలుగు రోజులు ముందు మా అమ్మ ఆ ప్రోగ్రాం గురించి మాట్లాడ్డం, అందరూ మంచి మూడ్ లోనే ఉండడంతో క్షణాల మీద అన్ని ఏర్పాట్లూ జరిగి మొత్తానికి సక్సెస్స్ అయింది! 

ఆ.. ఏం సక్సెస్స్ లెండి.. సరిగ్గా ఆ ముందు రోజు నాకు చక్కటి జ్వరం. నిశ్చితార్దానికి అరగంట ముందు వరకూ బెగ్గర్ గెటప్ లో ఓ మూల పడుకుని ఉండి, అబ్బాయి వాళ్ళు వచ్చేసారని హడావిడి చేసేసరికి వెళ్లి తల స్నానం చేసి చీర చుట్టుకుని వచ్చాను. హహ్హహ్హ.. తలస్నానం అంటే గుర్తొచ్చిందండోయ్.. ఆ రోజు ఉదయం నుండి సాయత్రం వరకూ కరెంట్ లేదు! ఉన్న నీళ్లన్నీ, వంటలకీ, క్లీనింగ్ కి, బంధువుల స్నానాలకీ అయిపోయాయి. పాపం.. పెళ్లికూతిరినైన నేను కనీసం మొహం కడుక్కోవడానికి కూడా నీళ్ళు లేవు. ఆ హడావిడిలో డాడీ ఎక్కడున్నారో కూడా తెలియలేదు. మెసేజ్ చేస్తే, అప్పటికప్పుడు రెండు వాటర్ కాన్స్ (25 లీటర్స్ వి) కొనుక్కొని వచ్చారు. ఇక ఆ నీటితో స్నానం చేశాను. ఒక్కసారి ఆ పెళ్లి కుర్చీలో కూర్చున్నాక నా ఆనందం అనారోగ్యాన్ని జయించింది కనుక ఆల్ హ్యపీస్. 

కాని ఈ ప్రోగ్రాం అయిపోయాక అంతా పిన్ డ్రాప్ సైలెన్స్! మళ్ళీ పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి ఇదిగో.. ఇన్ని నెలలు పట్టింది. ముందు అక్టోబర్ నెలాఖరికి అన్నారు. మా డాడీకి కుదరలేదు. నవంబర్ మొదటి వారం అనుకున్నాం.. మా మరిది గారికి ఎక్షామ్స్ ఉన్నాయని, 22న అనుకున్నాం.. మళ్ళీ మా అత్తగారికి ఆఫీస్‌లో ఆల్రెడీ ఫిక్స్ అయిన మీటింగ్స్ ఉండడంతో 29 అనుకున్నారు. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఊరుకుంటే, "డిసెంబర్ 1న నాకు ఎక్షామ్ ఉంది" అని భరత్ అన్నాడు. ఇక నాకు తిక్కరేగింది. "పెళ్ళీ వద్దు కిళ్ళీ వద్దు పో. జనవరిలో పెట్టుకుందాం. ఈ ఏడాది నేను బిజీ" అన్నాను. అవును మరీ.. అటొచ్చి ఇటొచ్చీ కాళీగా ఉంది నేనేనేవిటీ? లేదు లేదు తొక్కలో ఎక్షామ్దేముందిలే.. 29 ఫిక్స్ అన్నారు.  హమ్మయ ఎలాగో డేట్ ఫిక్స్ అయిపోయింది అని మిగతా ఏర్పాట్లు చూసుకుంటూ,  అంతా కాస్త స్మూత్ గా  వెళుతోంది కదా అని ఊపిరి పీల్చుకోబోయేసరికి.. సమైఖ్యాంద్రా సెగ గురించి భయం పట్టుకుంది. టూ వీలర్స్ ని కూడా రోడ్ మీద తిరగనివ్వడం లేదుట.. ఏంటో.. నా పెళ్ళికి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయి మరి. చూద్దాం.. ఏం జరుగుతుందో..!

Thursday, October 3, 2013

బావున్నారా?

ఏవండోయ్..! బావున్నారా? ఎంత కాలమయిపోయిందండీ మీతో కబుర్లు చెప్పి..?! చెప్పడానికి బోలెడు ఊసులున్నాయి. కాని తీరిందనుకున్న నా ఇంటర్నెట్ కష్టం తీరక బ్లాగింటికి దూరమయ్యాను :(. ఈ వీకెండ్ కి కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకోబోతున్నాను సో.. ఇక ఈ ప్రాబ్లం కి ఫుల్ స్టాప్ పడుతుంది (అని ఆశ). ఇప్పుడు ఇంత అర్జెంట్ గా ఆఫీసు నుండి ఈ పోస్ట్ రాయడానికి కారణం నేను ఆనందాన్ని ఆపుకోలేకపోవడమే! ఆనందం ఎందుకంటే.. :) మ్మ్మ్ చెప్పేయనా..? చెప్పేస్తున్నా.. నవంబర్ 29 న ప్రియమ్మ పెళ్ళట (ఆహ నా పెళ్ళియంటా.. ఓహొ నా పెళ్ళియంటా.. ఆహ నా పెళ్ళియంట ఓహొ నా పెళ్ళియంట డండనక డండనక)!

భరత్ ఇచ్చిన పుట్టినరోజు కానుక పోస్ట్, పెళ్లి ఎలా నిశ్చయమయింది., శుభలేఖ, పెళ్లి చీరలు, అవీ ఇవీ... ఇంకా బోల్డన్ని కబుర్లున్నాయి :) రెడీ గా ఉండండేం..??

Saturday, August 31, 2013

కృతజ్ఞతలు, క్షమాపణలు, విశేషాలు

హమ్మయ్య.. నేటితో నా ఇంటర్నెట్ కష్టాలు తీరాయి. ముందుగా, నా పుట్టినరోజుని జ్ఞాపకం ఉంచుకుని పర్సనల్ మెయిల్స్ ద్వారానూ..  బ్లాగ్ లో కామెంట్స్ ద్వారానూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు (లాస్య గారూ.. మరి ముఖ్యoగా మీకు), "కష్టేఫలే" శర్మ తాతయ్య గారికి క్షమాపణలు.

కృతజ్ఞతలు ఓకే కానీ, క్షమాపణలు ఎందుకు చెబుతున్నానో మీకు తెలియదు కదూ? చెప్తాను.. చెప్తాను. ఏమైందంటే.. తాతయ్య గారి బ్లాగ్‌లో భలే మంచి మంచి కబుర్లు చెబుతుంటారు. ఒకసారి ఎందుకో.. ఆ! ఎందుకంటే, ఆయన చిన్నతనంలో వారి అమ్మగారు చేసే వంటలను ప్రస్తావిస్తూ రాసిన పోస్ట్ చదివి.. "బామ్మ గారు చేసే వంటల్లో మీకు నచ్చే వంటకం ఏదైనా బ్లాగ్ ద్వారా మాకూ నేర్పించొచ్చు కద తాతయ్య గారూ?" అని అడిగితే, "బామ్మని అడిగి చేబుతానులేమ్మా" అన్నారు.

రెండు వారాల క్రితం మరో సందర్భంలో ఆయన రాస్తున్న పోస్ట్ (పెళ్ళిలో అలకపాన్పు) గురించి చెప్పగా "అబ్బా! టైటిలే చాలా బావుంది తాతయ్య గారు.. త్వరగా పోస్ట్ చేసేయండి" అన్నాను. దానికి ఆయన, నువ్వు అడిగావని శనగల పాటోళీ ఎలా చేసుకోవాలో రాసి నీ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయంటూ ఆడకనే నిష్టూరమాడారు. ఆయన రాసే ప్రతి పోస్టూ చదువుతాను మరి. ఎలా మిస్ అయ్యానో?! వెంటనే నాలుక కరుచుకుని క్షమాపణలు చెబుతూ, శనగలు నానబోసాను. దానికి ప్రతిగా తాతయ్య గారు, నేను కామెంట్ రాసిన విధానాన్ని మెచ్చుకుంటూ ఆయన అభిమాన రచయిత (శ్రీపాదవారు) మాటలను గుర్తుచేసుకుంటూ, "తెనుగు నేర్పిన తల్లులు" పోస్ట్ గురించి చెప్పి, ఈ లోపు "పెళ్ళిలో అలకపాన్పు" కూడా పోస్ట్ చేసేశారు.

మరుసటి రోజు ఆయన కామెంట్ చూసి సంబరంగా ఆ రెండు పోస్ట్‌లు చదివేసి కామెంట్ చేయబోతుంటే ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోయింది. ఎయిర్టెల్ వాడికి కంప్లైంట్ చేస్తే వారం, పది రోజులు పడుతుందన్నాడు సరిచేయడానికి! ఇంకేముందీ.. పొంగే పొంగే పాల మీద నీళ్ళు చల్లినట్లయిపోయింది నా పరిస్థితి. "ఆయన ఏమనుకుంటున్నారో ఏవిటో.. ఈ పిల్ల ఇకపై ఏమైనా అడిగితే చెయ్యకూడదు అనుకుంటారేమో? నొచ్చుకుంటారేమో" అని బాధపడిపోయాను. ఈ మాత్రానికే ఇంత ఇదయిపోవాలా అని మీరు అనుకోవచ్చు. కాని ఏమో.. నేను ఇష్టపడే వాళ్ళ మనసు నొచ్చుకుంటే తట్టుకోలేను. అందుకే ఈ క్షమాపణలు.

నా మట్టుకు నేను ఎవరి బ్లాగ్లోనైనా కామెంట్ చేశానంటే, వాళ్ళు దానికి రిప్లై ఇచ్చేవరకు కాలుకాలిన పిల్లిలా వాళ్ళ బ్లాగ్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటాను. కొంతమంది పబ్లిష్ చేసి ఊరుకుని ఒకటి రెండు రోజుల తరువాత రిప్లై ఇస్తారు. భలే కోపమొస్తుంది. "ఏం.. ఎలాగూ పబ్లిష్ చేశారుగా ఒక్క ముక్క రిప్లై ఇచ్చేస్తే నాకీ తిరుగుడు ఉండదు కదా" అని :P. కాని ఒక్కోసారి నేను కూడా వెంటనే రిప్లైలు ఇవ్వడం కుదరక మరుసటి రోజు ఇస్తుంటాను. అంతకంటే లేట్ అయితే మాత్రం మనసు గింజుకుంటూ ఉంటుంది "అయ్యయ్యో.. నన్నెలా తిట్టుకుంటున్నారో ఏవిటో" నని :D

సరిగ్గా.. అలాటి బాధే మొన్న నా పుట్టినరోజున కూడా కలిగింది. అంటే తిట్టుకుంటారని కాదుగాని... ...  ఏమో.. చెప్పలేకపోతున్నాను. "అంత బాధ అయితే ఆఫీసు నుండి రిప్లై ఇచ్చుండొచ్చుగా" అని మీరనుకోవచ్చు. తప్పులేదు. ఎందుకంటే.. నేను మా ఆఫీస్ గురించి మీకు చూయించిన పిక్చర్ అలాటిది మరి! కాని నిజానికి ఆఫీస్ లో వర్క్ ఎక్కువగానే ఉంటుంది. ఏదో నా వర్క్ మీద నాకున్న ప్రేమను బట్టి ఆఫీస్‌లో ఉన్నంతసేపూ సరదాగా అనిపిస్తుంది గానీ చెప్పాలంటే కళ్ళు బాగానే స్ట్రైన్ అవుతాయి. ఇంటికి వచ్చాక ఇంకేమీ చేసేందుకు ఓపిక ఉండదు. మెదడు, మనసూ రెండూ "నిద్రా నిద్రా నిద్రా" అంటాయి. హ్మ్మ్.. పైగా బాధ్యత కలిగిన స్థాయిలో ఉండి నేనే ఆఫీస్‌లో కూర్చొని బ్లాగర్ ఓపెన్ చేసుకుని కూర్చున్నానంటే.. హహ్హహ్హహ ఇంకేం లేదు "నా పనీ పాటా" పోస్ట్ కి కామెంట్ చేసిన నాగరాజ్ గారు అన్నట్లు "అనగనగా మా ఆఫీసూ" అని చెప్పుకోవలసి వస్తుంది :).

ఇహపోతే.. నా పుట్టిన రోజు విశేషాలు. అంతకంటే ముందు 18న మా బావగారి పుట్టిన రోజు. అంచేత ఆదివారమంతా అక్కావాళ్ళింట్లో అభి గాడి అల్లరితో సరిపోయింది. 19న ఆఫీస్ కి వెళ్లాను. హహ్హ! నేనసలు మరిచేపోయాను మరుసటిరోజు నా పుట్టినరోజని! సాయంత్రం ఇంటికి వెళ్లేడపుడు కొలీగ్స్ అందరూ "రేపు స్పెషల్ ఏంటీ? పార్టీ ఎక్కడా" అని అడిగినా గుర్తు రాలేదు. కేవలం ఆ రోజు పంపాల్సిన పుస్తక పేజీలే నా బుర్రలో తిరుగుతూ ఉన్నాయి. విసిగిపోయిన నా క్లోజ్ ఫ్రెండ్ (ఆఫీస్‌లో నేను పర్సనల్ రిలేషన్షిప్స్ మైంటైన్ చేయను. బట్, ఈ అమ్మాయి ఎక్సెప్షన్. వీలైతే తన గురించి ఒక పోస్ట్ రాస్తాను) సుగన్య నెత్తిమీద మొత్తుతూ గుర్తు చేసింది. అప్పుడు బల్బ్ వెలిగి అటు నుండి అటు "పోతీస్" కి వెళ్లి చీర కొనుక్కున్నాను.

రాత్రికి రాత్రి బ్లౌస్ ఎవరు కుడతారు చెప్పండి? లక్కీగా నేను సెలెక్ట్ చేసుకున్న చీర మీద బ్లాక్ డిజైన్ రావడంతో నా దగ్గర ఉన్న బ్లాక్ బ్లౌస్ తో మేనేజ్ చేశాను. పుట్టిన రోజునాడు నా డెస్క్ అంతా పూలతో నిండిపోయింది! మెయిల్స్, కాల్స్, ఫ్లవర్స్, గిఫ్ట్స్, సర్ప్రైజ్స్, వర్క్.. బిజీ బిజీగా గడిచిపోయింది. చిన్నపాటి బాధేంటంటే ఎక్కడా అనూ తో టైం స్పెండ్ చేయలేకపోయాను. "ఇంతకూ తనేం సర్ప్రైజ్ ఇచ్చాడు?" అని మాత్రం అడగొద్దు. నేను చెప్పలేను :).

హహ్హహ్హహహ్ నా బొంద! మీరు ఊహించుకుంటున్నట్లేం కాదు. చెప్పాలంటే పెద్ద పోస్ట్ రాయాలి. ఇందులో కుదరదు.  అందుకే చెప్పలేను అన్నాను. వచ్చేవారం ఎప్పుడైనా రాస్తానేం..

ఒకే ఒకే.. ఇక ఫోటోలు చూడండి.

ఇది మా బావగారి పుట్టిన రోజున తీసిన ఫోటోలలో ఒకటి. 

ఉదయం నిద్ర లేచి మొట్టమొదటిగా చూసిన అక్క రాతలు :)

జీవితంలో మొట్టమొదటి సారిగా అక్క నాకిచ్చిన సర్ప్రైజ్! పెళ్లైయ్యాక చెల్లెలి విలువ తెలిసొచ్చినట్లుంది మా అక్కకి :P.  

సుగన్యా, నేను. ఈ ఫోటో చూసి మా అమ్మ ఎంత షాక్ అయిపోయిందో..! "నువ్వు కూడా ఇంత ఒద్దికగా నిలబడతావుటే?!" అంటూ. హహ్హ్హహ.. ఆఫీస్ కదా అందుకే ఇంత ఒద్దిక. లేకపోతే.. నాకస్సలు పళ్ళు కనబడకుండా నవ్వడం చేతకాదు బాబూ మీరేమైనా అనుకోండి. By the way.. ఇదే నా పుట్టినరోజు చీర. 

అబ్బా.. ఏంటో ఏమీ చెప్పకుండానే పేద్ద పోస్ట్ అయిపోయింది! నెక్స్ట్  టపాలో భరత్ నాకిచ్చిన సర్ప్రైజ్ సంగతి చెబుతానేం? 

ఒక చిన్న మాట. అందరికీ కాదులే.. నా బ్లాగ్ రెగులర్ గా ఫాలో అయ్యే వాళ్లకి మాత్రం. ఏంటంటే.. మరీ ముఖ్యమైన విషయాలో, సెలవులో అయితే తప్ప సాధారణంగా వీక్ డేస్ (సోమ - శుక్ర వారాల్లో) లో ఇకపై పోస్ట్స్ పబ్లిష్ చేయను (చేయలేను). కామెంట్స్ కి మాత్రం స్పందించగలనని గమనించగలరు. థాంక్స్. 

Wednesday, July 31, 2013

ఎదురుచూపులు

"కాలం ఒక్కసారి వెనక్కి వెళితే ఎంత బావుండో" ఈ మాట తరచూగా అనుకుంటున్నానండీ ఈ మధ్య. మీతో సరదాగా గడిపిన సన్నివేశాలాను గుర్తు చేసుకోవాలంటే గతంలోకి వెళ్ళక తప్పడంలేదు. ఏదైనా.. "అప్పట్లో, ఆ రోజుల్లో" అంటూ మొదలుపెట్టుకోవాల్సి వస్తోందే తప్ప..  నిన్న, మొన్న, పోయిన వారం, అంతెందుకు? గడిచిన రెండేళ్లలో కూడా మన ఇద్దరికీ సంబంధించి ఒక్క తియ్యటి జ్ఞాపకం కూడా గుర్తురావడం లేదు. ఉంటేగా గుర్తు రావడానికి? నేను మిమ్మల్ని తప్పుపట్టను, పట్టలేను. మీ ప్రేమ నాకు తెలుసు. నాకోసమే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారని తెలుసు. తెలిసీ ఎందుకో బాధ.

ఉదయం లేస్తూనే మీ మొహం చూడాలని, మీ నుదిటి మీద ముద్దు పెడుతూ నా రోజు ప్రారంభించాలని ఆశ పడుతుంటాను. బ్యాడ్ లక్. మీకు చీకటితో లేచే అలవాటు ఉండడం, నేను లేవలేకపోవడం వల్ల ఆరుగంటలకు నిద్రకళ్ళతో మిమ్మల్ని వెతుక్కునే సమయానికి మీరు హాల్లో ఇంటర్నెట్ తో బిజీ గా ఉంటారు. నిట్టూర్చి, మీకంటే ముందు లేవనందుకు బాధపడుతూ ఆ బాధను మీపై కోపంగా మార్చి "పొద్దున్నే మొదలు పెట్టేసారా? ఎన్ని సార్లు చెప్పాలి? మీరు లేచినపుడే నన్నూ లేపమని? అయినా ఆ చేసుకునే పనేదో నా పక్కనే ఉండి చేసుకోవచ్చుగా" అన్న మాటలతో నా రోజు మొదలవుతోంది. రేపైనా ఇలా జరక్కూడదనుకుంటూ మీకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ప్రిపేర్ చేసి, స్నానానికి కావలసిన ఏర్పాట్లు చేసి, మీరు వచ్చేలోపు ఇల్లు ఊడ్చుకుని, వచ్చాక "లేట్ అవుతోంది" అంటూ మీరు హడావిడిగా తింటుంటే.. కసురుకుని, ఆఫీస్ కి సాగనంపేడపుడు పదే పదే జాగ్రత్తలు చెప్పి "ఆఫీస్ చేరుకున్నాను" అంటూ మీరు పంపే sms కోసం ఎదురుచూడడంతో మొదలు. సాయంత్రం మీరు వచ్చే వరకూ ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ.. "ఎప్పుడెపుడు మీరు ఇంటికి వస్తారా.. సరదాగా కాసేపు మీతో ముచ్చట్లాడదామా" అని ఎదురుచూస్తూనే ఉంటాను.

Google image 
రాత్రి ఏడున్నర అయే సరికి మనసంతా ఉల్లాసంగా మారిపోతుంది. అప్పటికి వంట పని, ఇంటి పని ముగించుకుని.. స్నానం చేసి తయారయి టీవీ ముందు కూర్చుంటాను. టీవీ చూస్తానన్న మాటే కాని నా మనసంతా గేట్ దగ్గరే ఉంటుంది. ఏ చిన్న చప్పుడు వినిపించినా మీరేనేమో చూద్దామని కిటికీ దగ్గరకు పరుగు పెడతాను. అలా ఎన్నోసార్లు నేను తిరిగాక మీరు వస్తారు. సంతోషంగా ఎదురొచ్చి నీళ్ళందించి, ఫ్రెష్అప్ అయ్యే వరకూ వెయిట్ చేసి మీతో ఏమైనా మాట్లాడదామని మొదలుపెట్టేలోపు, మీరే మీ ఆఫీస్ కబుర్లు మొదలుపెడతారు. రోజంతా మీరేం చేశారో, మీ ఆఫీస్ లో మనుషులు ఎలాటి వారో తెలుసుకోవడం.. అదీ మీ మాటల్లో! నాకు చాలా సంతోషం. కాని అదే నా సంతోషం కాదు. 

నా మాటలు మీకు బోర్ గా అనిపిస్తాయన్నారు. "సరేలే ఆయన చెప్పే కబుర్లే విందాం. ఆయన గొంతు వినడం కంటేనా" అనుకున్నాను. కాని కొన్ని రోజులకు నా మనసు మొరాయించడం మొదలుపెట్టింది. మీ గొంతు  
వింటున్నానన్న సంతోషం కంటే, "ఇక ఎప్పుడూ ఈ కబుర్లేనా? మా ఇద్దరికీ సంబంధించినవి ఏవీ లేవా మాట్లాడుకోవడానికి? ఈ రోజు ఆయనకు ఇష్టమైన చీర కట్టుకున్నాను.. కనీసం గుర్తించడేం? ప్రతి రోజూ "మధ్యాహ్నం సరిగా భోంచేశారా.. బావుందా?" అని అడుగుతాను. కాని ఒక్క పూటైన "నువ్వు లంచ్ చేశావా?" అని ఆయనకు ఆయనగా అడగరేం? ఇంటికి రావడం, తినడం, ఫోన్ లో మాట్లాడ్డం కాసేపు నెట్ చూసుకోవడం, నిద్రపోవడం.. ఇంతేనా? ఇంకేం లేదా? ఈ మాత్రం దానికి భార్య ఎందుకు? పనిమనిషిని పెట్టుకోవచ్చుగా? అసలు ఎన్నాళ్ళయింది నవ్వే ఆయన కళ్ళు చూసి?  ఎన్నాళ్ళయింది ఆయన చేతిని పట్టుకుని సరదాగా నడిచి? ఎన్నాళ్ళయింది ఆయన నన్ను బాగున్నావా అని అడిగి? నేనేమైనా అతిగా ఆశపడుతున్నానా??" మనసు పదే పదే అడిగే ఈ ప్రశ్నల తాలూకూ భాదే ఎక్కువవుతోంది.

మరో వైపు "పాపం రోజంతా వర్క్ చేసి అలసిపోయి ఇంటికి వస్తారు.. అప్పటి వరకూ ఎవ్వరితోనూ మాట్లాడే వీలు కుదరదు కనుక ఇంటికి వచ్చాక మాట్లాడతారు. ఆయనకంటూ కొన్ని ఇష్టాలు, పనులు ఉంటాయి కదా.. అవి చేసుకోకపోతే మనిషి ఎలా ఆనందంగా ఉండగలరు? ఎప్పటికీ పెళ్ళైన కొత్తలోలా ఉండమంటే ఎలా.. బాధ్యతలు పెరిగేకొద్దీ సమయం తగ్గుతుంది. అర్ధం చేసుకును మసలుకోవాలి కాని ఇలా "నా చీర చూడలేదు. తిన్నావా అని అడగలేదు" అంటూ చిన్న చిన్న విషయాల్ని భూతద్దంలో పెట్టి చూసుకుని బాధ పడి, ఆయనను బాధపెట్టకూడదు. ఇంటికి కావలసినవన్నీ అమర్చిపెడుతున్నారు. ఉన్నంతలో ఏ లోటూ రాకుండా చూసుకుంటున్నారు. అది చాలదా?" అనిపిస్తుంది.

నా బాధ చూడ్డానికి చిన్నదిగా కనిపించినా అది మనసు మీద ఎంత ఒత్తిడి కలిగిస్తుందో చెప్పలేను. ఇది మీకు తెలియంది కాదు. మీతో నేనెన్నోసార్లు చెప్పాను. నేను కాకుండా..  వర్క్, ఫ్రెండ్స్,  అవీ ఇవీ అంటూ మీ ప్రపంచంలో ఎన్నో ఉండొచ్చు. కాని మీరే నా ప్రపంచం. మీతో గడిపే సమయంలో కలిగే సంతోషం నాకు మరి ఎందులోనూ దొరకదు. నాకూ కొన్ని వ్యాపకాలు ఉన్నాయి. కాని అవన్నీ నాకు మీ తరువాతే.

మీ నుండి నేను కోరుకునేది కాస్త ప్రేమ, నా ప్రేమకు మరికాస్త గుర్తింపు. అంతే. మీరు నాతో గంటలు గంటలు కబుర్లు చెప్పనవసరం లేదు. మాట్లాడే పది నిముషాలు చిరునవ్వుతో మాట్లాడితే చాలు. నా అందాన్ని పొగుడుతూ నా కొంగు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఒక్క సారి ఈ చీర నీకు బావుందనో, ఈ వేళ చక్కగా కనిపిస్తున్నావనో చెబితే చాలు. టీనేజ్ కుర్రాడిలా నాతో సరసాలాడనవసరం లేదు. అప్పుడప్పుడు నా చెయ్యి పట్టుకుని మీరు నాకు ఉన్నారన్న భరోసాను కలిగిస్తే చాలు. నిజమే.. మీరు నాకోసమే కష్టపడుతున్నారు. నాతో పాటు మీ లైఫ్ లో ఇంకా కొన్ని పనులు ఉంటాయి. కాదనను. కాని నేనూ మీ లైఫ్ లో ఒక భాగాన్నే. అప్పుడపుడు నా మనసులోకి కూడా తొంగి చూడడంలో తప్పు లేదు. క్షమించండి. కాస్త కటినంగా మాట్లాడాను కదూ? మీ మాటలు గుర్తొచ్చాయి.

మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నేను మిమ్మల్ని తప్పు పట్టడంలేదు. మీ మనసు అర్ధం చేసుకుని మీకు అనుగుణంగా నడుచుకోవడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను. అదే విధంగా మీరూ నన్ను అర్ధం చేసుకుంటే బావుండని ఆశపడుతున్నాను. మీ బిజీ లైఫ్ లో నా గురించి ఆలోచించడం కష్టమే.. కాని అది ఏదో ఒక రోజు సాధ్యపడుతుందని ఎదురుచూస్తున్నాను.

ఇట్లు,
మీ నేను

మన ప్రియ కి పెళ్ళే కాలేదు కదా ఈ లెటర్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోతున్నారా? హహ్హహ్హ.. ఈ లెటర్ నాకు సంబంధించింది కాదండీ. నా స్నేహితురాలు తన భర్త గురించి కంప్లైంట్ చేస్తూ చెప్పిన విషయాలను విని "మరీ ఇంత నెగిటీవ్ గా మాట్లాడితే అర్ధం చేసుకోవడం సంగతి దేవుడెరుగు ఇంకాస్త దూరమైపోతాడే తల్లీ. కాస్త పాజిటీవ్‌గా నీ బాధలను వివరిస్తూ ఒక లెటర్ రాయి. అన్నీ పట్టించుకోకపోయినా కనీసం ఒక్క మాటైనా మనసుని తాకకపోతుందా?" అన్నాను. దానికి తను, నేను మాట్లాడ్డం లో బాగా వీక్ నీకు తెలుసు కదా.. బాబ్బాబు ఆ లెటర్ ఏదో నువ్వే రాసి పెట్టేయవా అంటూ బ్రతిమాలింది. ఉన్నది ఉన్నట్లు రాయగలను గాని ఊహించి రాయడం నాకు చేత కాదు. ఆ మాటే తనతో చెప్పాక, మళ్ళీ ఓ గంట సేపు ఫోన్ లో తన కష్టాల చిట్టాను విప్పింది. నాకు తను చెప్పిన విధానం అస్సలు నచ్చలేదు. నేను ఆ స్థానంలో ఉంటే ఎలా ఫీల్ అవుతానో ఊహించుకుని, నేనైతే ఎలా స్పందిస్తానో అలా ఈ లెటర్ రాశాను. చూడాలి తనకు నచ్చుతుందో లేదో.

నా పర్సనల్ లైఫ్ లో ఇలాటి లెటర్ రాయవలసి వస్తుందని నేననుకోను.. కాని ఎందుకైనా మంచిదని (ముందస్తు బెయిల్లాగ అన్నమాట) దాచిపెట్టుకుంటూ నా "మనసులోని మౌనరాగం" లో జత చేస్తున్నాను :P

Friday, July 26, 2013

వంటలు - గీతక్క

ఒక ఫ్రెండ్ ద్వారా గీతక్క నాకు పరిచయమయింది. రెండేళ్ళ క్రితం వచ్చారు వాళ్ళు చెన్నై కి. తెలుగు వాళ్ళే. "హాయ్, బాగున్నారా, బాయ్" కొత్తలో ఇంతకంటే ఇంకేమి మాట్లాడుకునే వాళ్ళం కాదు. అక్క కి రెండున్నరేళ్ళ (అప్పుడు) బాబు. వాడి మూలానే కాస్త త్వరగా ఫ్రెండ్స్ అయిపోయాం మేము. ఒక విధంగా మేము ఫ్రెండ్స్ అవ్వడానికి వంటలే ఇంకా పెద్ద పాత్ర పోషించాయి.

ఆవిడ పరిచయమయ్యే సరికే నేను వంటలు చేసేదాన్ని కాని పూర్తిస్థాయి వంటలు రావు. అమ్మ దగ్గర నేర్చుకుందామని దగ్గర కూర్చున్నా, పాఠాల కంటే పాట్లే ఎక్కువగా ఉండేవి. అందుకే.. నాకు వచ్చిందేదో చేసుకునే దాన్ని కాని కొత్తవాటి జోలికి పోలేదు. అప్పట్లో నాకు వచ్చిన వంటలంటే.. బంగాళదుంప వేపుడు, కూర, వంకాయ కూర, అరటి పువ్వు పెసరపప్పు, ఆకు కూర, కొన్ని కూరగాయల వేపుళ్ళు, బీరకాయ ఇగురు, దొండకాయ కూర, వెజ్ నూడల్స్ (ఇవి చేయడంలో మాత్రం నేను ఎక్స్పర్ట్ ని) టమాటా రైస్. ఇంతే. ఇవి కూడా ఎప్పుడూ ఒకే స్టైల్ లో. ఇంటికి ఎవరొచ్చినా ఇవి వండి పెట్టేసేదాన్ని. నాన్న ఇష్టంగా తింటారు. అక్కకి పని చెప్పనంత వరకూ ఏదైనా "గుడ్" అనే అంటుంది. కాని అమ్మకి మాత్రం నా వంటలు నచ్చవు (పిల్లల వంటలు అంటూ కూరలో కరివేపాకులా తీసేస్తుంది. బ్రతిమాలినా ఒక్క ముద్దకంటే ఎక్కువ తినదు).  అలాటిది కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు నాకు భరత్ దొరికాడు. వచ్చిన వాటితో పాటు ఇంటర్నెట్ లో చూసినవీ ఎడాపెడా వండిపెట్టేసేదాన్ని. పాపం అప్పట్లో తను హాస్టల్ లో ఉండేవాడు కనుక గోల చేయకుండా "బావుంది" అంటూ తినేవాడు. నేనింకా రెచ్చిపోయి ప్రయోగాలు చేసి "ప్రియ వంటలు చాలా బావుంటాయి" అని ఇంటా, బయటా, ఆఫీస్ లో పేరు తెచ్చేసుకున్నాను. నా ఫ్రెండ్స్ అయితే నేను చేసిన వాటి కోసం కొట్టుకునే వారు! ఇంకేముందీ.. ఇవన్ని చూసి నేను క్లౌడ్ 9 ఎక్కి కూర్చున్నాను. 

ఇంటికి ఎవరైనా మొదటిసారి వచ్చినపుడు కచ్చితంగా ఏదో ఒకటి ఇచ్చి పంపడం ఆచారం/అలవాటు. అలాగే ఎవరు వచ్చినా తినకుండా మాత్రం పంపను. అలాగే ఓ సారి గీతక్కా వాళ్ళు ఇంటికి వచ్చినపుడు ఏదో వండాను. ఆవిడ చాలా బావుందని మరీ మరీ చెప్పడంతో పొంగిపొర్లిపోయాను. తరువాత వాళ్ళబ్బాయి పుట్టిన రోజుకి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వెళ్లాం. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నా వంటలు అసలు నథింగ్. ఆవిడ చేసినవన్నీ ఎంత బావున్నాయో!! నేనైతే ఫిదా అయిపోయాను. ఏ వంట ఎలా చేసిందో తెలుసుకోవాలన్న కుతూహలం ఓ వైపు, అడిగితే ఏమనుకుంటారో అన్న సందేహం ఓ వైపు. మొహమాటపడుతూనే "చాలా బాగా చేశారు అక్కా. మీరేమి అనుకోకపోతే నాకూ నేర్పగలరా? నాకు చాలా ఇష్టం వంట చేయడమంటే" అన్నాను. ఆవిడ నవ్వేసి "దానిదేముంది ప్రియా.. తప్పకుండా" అన్నారు. 

అప్పుడు మొదలు.. తన దగ్గర నా శిష్యరికం. పప్పు, గుత్తొంకాయ కూరా, పాయసం, పకోడీ, చికెన్ (భరత్ కోసం), అబ్బా.. ఈ లిస్టు ఇక ఆగదండి. ఈ రోజు "నీ వంట చాలా బావుంది" అంటూ నాకొచ్చిన ప్రతీ కాంప్లిమెంట్ గీతక్కకే చెందుతుంది. ఎంతో ఓపికతో నా సందేహాలన్నీ తీరుస్తూ, ఎన్నో చిట్కాలు చెబుతూ నన్ను మంచి(?) కుక్ గా మలచిన తనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరే.. వంటల విషయంలో తృష్ణ గారి "రుచి.." బ్లాగ్ కూడా నాకు ఎంతో తోడ్పడింది. ఆవిడకూ బ్లాగ్ ముఖంగా థాంక్స్ చెబుతున్నాను. 

నిజానికి నేనే వంటల బ్లాగ్ మొదలుపెడదాం అనుకున్నాను కాని, నాకంటే నా గురువు స్టార్ట్ చేస్తే ఇంకా బావుంటుందని "ఇంత బాగా వంట చేస్తున్నావు కదక్కా.. వీటిని వీలైనంత ఎక్కువ మందికి నేర్పొచ్చు కదా? ఒక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం.. ఏమంటావు" అన్నాను. తనకీ ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ వేళే బ్లాగ్ మొదలుపెట్టారు. తన బ్లాగ్ లింక్: http://geethavanta.blogspot.in, తనను ప్రోత్సహించి మరిన్ని మంచి వంటలు బ్లాగ్ ద్వారా మనతో పంచుకోవడానికి  మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. 

థాంక్స్ :)

Thursday, July 25, 2013

కోరుకున్నవాడు

తెలిసిన ఒకాయన గాంధీజీ గారి గురించి PhD చేసి దాన్ని సబ్మిట్ చేసే ముందు కాస్త ఎడిట్ చేసి పెట్టమని నన్ను రిక్వెస్ట్ చేశారు. అందులో భాగంగానే నేను గూగుల్ సెర్చ్ చేస్తుంటే బాపు గారి సినిమాల గురించి ఒక లింక్ కనబడింది. కింద డిస్క్రిప్షన్ లో "ముత్యాల ముగ్గు సినిమా..." అని కనబడేసరికి అట్ట్రాక్ట్ అయి ఓపెన్ చేశాను. అందులో ఆ సినిమా గురించి ఎంతో గొప్పగా కొన్ని మాటలు చదివి, YouTube లో ఆ సినిమా చూడ్డం మొదలు పెట్టాను.

అందులో హీరోయిన్ కి హీరోతో పెళ్ళయ్యాక మొదటి రాత్రి సీన్లో ఆ భార్య (హీరోయిన్) తన భర్త (హీరో) గుండె మీద తల పెట్టుకుని పడుకుని ఉంటుంది. ఆ భర్త తాపీగా సిగరెట్ తాగుతూ సరదాగా (ప్రేమగా పిలిచాడేమో?) ఆమె ముఖం మీద ఉఫ్ఫ్ అని ఊదుతాడు. ఆమె చిరునవ్వు నవ్వుతూ తలెత్తి చూస్తుంది.. తర్వాత వాళ్ళు కబుర్లలో పడ్డారు!!!  నేననుకున్నాను.. "ఛీ దరిద్రుడా. నీకు సిగరెట్ తాగే అలవాటుందా?! అదీ ఈ గదిలోకి తెచ్చి తాగడమే కాక, పైగా నా మొహం మీద ఊదుతావా??" అని ఆవిడ అంతెత్తున లేస్తుంది ఇప్పుడు గొడవ సీన్ వస్తుందీ.." అని. కాని విచిత్రంగా అలా ఏం జరగలేదు సరికదా అసలా ప్రస్తావనే రాలేదు  (ఇప్పటికి అంత వరకూ మాత్రమే చూశాను సినిమాని)! 

నాకు పర్సనల్ గా సిగరెట్ తాగే వాళ్ళంటే చాలా చిరాకు. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ లో స్మోక్ చేసే వాళ్ళను చూస్తే మొహం మీదే కొట్టాలనిపిస్తుంది. నాకు తెలిసీ చాలా మంది అమ్మాయిలు ఇదే ఫీలింగ్‌తో ఉంటారు. అదీ ఆ కాలంలో..?! ఏమో బాబు ఆ హీరో, హీరోయిన్ల గొడవ పక్కనపెడితే, ఆ సీన్ చూస్తున్నపుడు భరత్ నాకు నిజమైన హీరోలా అనిపించాడు. అది చూస్తున్నంత సేపూ ఊహల్లో ఓ వైపు చిరునవ్వు నవ్వుతున్న భరత్, మరో వైపు బాక్గ్రౌండ్ లో "రాజువయ్యా.. మహరాజువయ్యా.." అని మ్యూజిక్.

భరత్ తో ప్రేమలో పడక ముందు నేను నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని కాని ఎప్పుడూ.. "తను స్మోక్ చేయకూడదు, డ్రింక్ చేయకూడదు" అనుకోలేదు. అసలా ఆలోచనే రాలేదు! ఎంతసేపూ.. "మానసికంగా అందగాడవ్వాలి, ప్రాక్టికల్ గా ఆలోచించాలి (ఇదే కాస్త నా కొంప ముంచిందిలెండి), దైవభక్తి ఉండాలి, సహాయ గుణం కలిగి ఉండాలి, గొప్ప ధనవంతుడూ అవసరం లేదు.. చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బంది పడేంత పేదవాడూ వద్దు, నన్ను పూర్తిగా అర్ధం చేసుకోగలగాలి, అమ్మాయిల పిచ్చి ఉండొద్దు, అనుమానాలకు అసలు తావే ఉండకూడదు, బోల్డంత ప్రేమను ఇవ్వాలి.. కాస్త రొమాంటిక్ ఫెలో అయుండాలి, అందరి ముందూ చాలా డీసెంట్ గా.. నాతో మాత్రం తను తనలా ఉండాలి, ఎంతసేపూ నేనూ నాది అనకుండా మనం మనది అనుకునే మనస్తత్వం గలగి ఉండాలి, కొంచెం సెన్సాఫ్ హ్యుమర్ కూడా ఉండాలి, మనీ మేనేజ్మెంట్ కంపల్సరీ.. అలాగే కాస్తంత సామాజిక స్పృహ కూడా " ఇవే కోరుకునేదాన్ని. ఏంటీ ఆయాసం వచ్చిందా మీకు?? "నీకే టూ మచ్ గా అనిపించట్లేదా తల్లీ.. అయినా నీకంత సీనుందా" అనేనా మీ ఎక్స్ప్రెషన్ కి అర్ధం?? బేసికల్లీ ఇక్కడ మీరొకటి గుర్తుచేసుకోవాలి. సీన్ ఉన్నా లేకపోయినా.. మనిషి జన్మ ఎత్తాక, అందునా ఆడపిల్లగా పుట్టాక (వామ్మో.. నేను నా గురిచి మాత్రమే చెప్తున్నాను. దయచేసి ఫిమేల్ రీడర్స్ ఎవ్వరూ నా మీద గొడవకి రావొద్దు) సామర్ధ్యాలతో సంబంధం లేకుండా కోరికలు పుడతాయంతే. అయినా ఏం.. మీకు కలగలేదా ఏంటి?

"పుట్టాయి సరే.. తీరాయా లేదా?" అంటే, ఎప్పుడూ.. "అవును నేను అనుకున్నదానికంటే (రెండు విషయాల్లో తప్ప) మంచి తోడు దొరికింది" అనిపిస్తుంది. అప్పుడప్పుడు (కోపమొచ్చినపుడు).. "కాదు పొమ్మని"పిస్తుంది :P. ఒక్కోసారి తన మీద ఆరాధన, కోపం కలిసివస్తుంటాయి. మ్మ్.. మీకు అర్ధం కావడానికి నాకు మొదటిసారి ఆ ఫీలింగ్ కలిగిన ఇన్సిడెంట్ చెప్తాను.

మేము సాధారణంగా పెద్దగా బయటకు వెళ్ళమండి.. బయట తిరగడమంటే చిరాకు తనకు. ఏదో మా ఇంటికి 100 మీటర్స్ దూరంలోనే బీచ్ ఉండడంతో అక్కడికి మాత్రం కాస్త ఫ్రీక్వెంట్ గా వెళ్ళేవాళ్ళం. నాకు ఐస్ క్రీం లన్నా, బజ్జీలన్నా పిచ్చి. తనకు అవేం నచ్చవు. ఎలాగూ నేను బయట చేసిన వాటిని ప్రిఫర్ చేయను గనుక బజ్జీల విషయంలో ఓకే గాని ఐస్‌క్రీం విషయంలో మాత్రం మదనపడేదాన్ని. ఐస్‌క్రీం అయినా ట్రై చేయొచ్చు కదా అంటే, నాకు తల నొప్పి వస్తుంది వద్దు అంటాడు. తను తినకుండా నేను మాత్రం తింటే ఏం బావుంటుందిలే.. ఏమైనా అనుకుంటాడేమో అని మొహమాటపడి ఊరుకునేదాన్ని. డాడీ తో వచ్చుంటే ఎంత బావుండేదో అని బాధపడిన రోజులూ ఉన్నాయి. నా ఫీలింగ్స్ గమనించాడో లేక ఇంకేమైనానో తెలియదు కాని ఓ రోజు "కుల్ఫీ తింటావా?" అని అడిగాడు. చంద్రముఖీ సినిమాలో రజినీకాంత్ కి నగలు చూయించేడపుడు జ్యోతిక మొహం వెలిగినట్లు వెలిగింది నా మొహం. వెంటనే తల ఊపుతూ "కుల్ఫీ? ఊ ఊ కావాలి కావాలి" అన్నాను. కనుబొమ్మలు రెండూ పైకెత్తి ఒక వింత ఎక్స్ప్రెషన్ తో నన్ను చూసి "పద" అన్నాడు. రెండు తీసుకున్నాను. "నాకు వద్దు. నువ్వు మాత్రం తీసుకో" అన్నాడు. "నాకు తెలుసు. నువ్వు తినవుగా.. నేను నాకు మాత్రమే తీసుకున్నాను" అని చెప్పాను. ఒక్క క్షణం తెల్లబోయి అంతలోనే తమాయించుకుని, ఇంకొకటి తీసుకుంటావా అనడిగాడు. "అహ వద్దులే.. రాత్రికి డాడీతో వస్తాగా అప్పుడు తినాలి మళ్ళీ" అన్నాను. సర్లే అని ఆ అబ్బాయికి డబ్బులివ్వబోతుంటే ఆపి "నేనిస్తాను, నేనేగా తినేది" అన్నాను. "నీది నాది ఏంటీ? మన డబ్బులేగా.. " అన్నాడు నవ్వుతూ. మర్యాదకి అన్నాడేమో అనుకుని పరిశీలనగా తన కళ్ళలోకి చూశాను. నిజాయితీగానే అన్నాడు. ఇక నేనేం మాట్లాడకుండా సరే అనేసి కుల్ఫీ కవర్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాను.

భరత్ డబ్బులిచ్చేసి మేము వెళ్ళబోతుంటే, ఆ అబ్బాయి ఆపి ఇంకో రెండు రూపాయలు ఇవ్వమన్నాడు. "అదేంటీ దాని మీద 14 రుపీస్ అనేగా ప్రైస్ ఉందీ? నేను రెండిటికీ కలిపి 28 కరెక్ట్ గానే ఇచ్చాను కదా?" అన్నాడు భరత్. దానికి ఆ అబ్బాయి బీచ్ దగ్గరకు తీసుకొచ్చి అమ్మడం వలన ఒక్కోదాని మీద రూపాయి ఎక్ష్త్రా అవుతుంది, ఇవ్వండి అన్నాడు. భరత్ అస్సలు ఒప్పుకోలేదు. వాడితో వాదించడం మొదలుపెట్టాడు. "రెండ్రూపాలయ కోసం ఏంటి భరత్? ఇచ్చేద్దాం. వాడితో గొడవెందుకు?" అని నేనన్నాను. "అలా ఎలా ప్రియా? జస్ట్ 2 రుపీసే కావచ్చు.. కాని అది బ్లాక్ మనీ కిందే వస్తుంది. Let us not encourage such things" అన్నాడు. "అబ్బా ప్లీజ్.. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. వాడికి లేకే కదా అడుగుతున్నాడు? ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫ్రీ గా నీకో రూపాయి ఇస్తానంటే నువ్వు ఆక్సెప్ట్ చేస్తావా చెప్పు? వాడు ఆశపడుతున్నాడు. ఇచ్చేద్దాం. మనకి ఒరిగేది ఏమీ లేదు కదా" అన్నాను. నా మాటలు  తనకు కోపం తెప్పించాయి. వాడిని వదిలేసి నాతో ఆర్గ్యు చేయడం మొదలుపెట్టాడు. నాకు తన పాయింట్ అర్ధమయింది కాని చాలా చిరాగ్గా కూడా అనిపించింది. "అసలు కుల్ఫీ వద్దు ఏమీ వద్దు.. ఈ గొడవే ఉండదు తిరిగిచ్చేస్తే" అనిపించింది కాని అప్పటికే హడావిడిగా నేను ఒకటి తినడం మొదలుపెట్టేసాను కదా.. సో వేరే ఆప్షన్ లేక గబుక్కున నా హ్యాండ్ బాగ్ లోనుండి రెండ్రూపాయలు తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టేసి భరత్ ని బలవంతంగా అక్కడి నుండి పక్కకు లాక్కేళ్ళాను. "నాకు అర్ధమవుతోంది నువ్వు చెప్పేది కాని వాడు ఒప్పుకోవట్లేదు.. అందరూ మనల్నే చూస్తూ ఉన్నారు. తొందరపాటుతో ఒకటి ఓపెన్ చేసేశాను కనుక తిరిగి ఇవ్వడం కూడా కుదరదు. ఇంక సీన్ క్రియేట్ చేయడం ఇష్టంలేక డబ్బులు ఇచ్చేశాను. I am sorry" అన్నాను. అప్పటికే తన కళ్ళలో నీళ్ళు! "నేనే ఎప్పుడూ నెత్తి మీద నీళ్ళ కుండ పెట్టుకుని తిరుగుతానురా బాబూ అంటే.. భలే! నాకు తగ్గ వాడే దొరికాడులే..  ఇంత చిన్న విషయానికి కంట తడి పెట్టుకుంటాడేంటీ" అని బెంబేలెత్తిపోయాను. "అయ్యో I am sorry, I don't mean to insult you.. నాకేం చెప్పాలో అర్ధం కావట్లేదు. నీ ఫీలింగ్ నాకు అర్ధమయింది కాని.. " అంటుండగా.. "చూడు.. న్యాయమైన దాని కోసం రూపాయి కాదు 100 రూపాయలు పెట్టడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కాని అన్యాయంగా ఒక్క రూపాయి పెట్టాలన్నా నా వల్ల కాదు. వాడు అడుక్కొని ఉంటే నిక్షేపంగా ఇచ్చేవాడిని. కాని వాడు చేసే మోసాన్ని రూల్ అన్నట్లు వాదించడం వల్లే నాకు అభ్యంతరం వచ్చింది. ....(మౌనం)....  నిన్ను చాలా ఇరిటేట్ చేశాను. సారీ" అన్నాడు.

ఈ విషయం అనే కాదు.. సబ్బుల నుండి సమస్తం ఇండియన్ బ్రాండే కొనడానికి ప్రిఫర్ చేస్తాడు. అప్పుడప్పుడు కాస్త చిరాగ్గా అనిపిస్తుంటుంది.. "బ్రాండ్ దేముందీ? ఏది బావుంటే అది వాడతాం గాని" అని.  And at the same time, వాటికి తను చెప్పే రీజన్స్ వింటే.. ఇన్స్పిరింగ్గానూ, పోనిలే కొంతమందిలా అనుకుని, చెప్పి వదిలేయడం కాకుండా ఫాలో అవుతున్నాడు అని హ్యాపీగా ఉంటుంది. నిజం చెప్పొద్దూ.. ఒక్కోసారి మారు వేషంలో ఉన్న ముసలాడిలా అనిపించేవాడు. అంతలోనే "ఈ వయసుకి ఎంత మెచ్యుర్డ్ గా రెస్పొన్సిబుల్ ఆలోచిస్తున్నాడో కదా..? Wow!" అనిపిస్తుంది.

ఇక మిగతా విషయాలకు వస్తే, ఇంతకు ముందు చెప్పినట్లు.. నేను కోరుకున్న దాని కన్నా రెండింతలు మంచి వాడు దొరికాడు. నేను భగవంతుని నుండి చాలా బహుమతులు పొందుకున్నాను. అందులో ది బెస్ట్ "భరత్". రిలేషన్షిప్స్ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు, అభిప్రాయభేదాలు,  గొడవలూ రావడం సహజం. కాస్త సహానంతో వాటిని అధిగమించి వస్తేనే కదా ఆ బంధం మరింత బలపడేది? ఆ సహనం భరత్ లోనూ మెండుగా ఉండడం నా అదృష్టం. మొత్తానికి నేను కోరుకున్న వరుడే దొరికాడు :)

Tuesday, July 23, 2013

చిన్ననాటి దొంగతనం

లైఫ్ లో ఎప్పుడైనా దొంగతనం చేశారా మీరు?? "ఏవమ్మోయ్..! ఏదో రాస్తున్నావు కదా అని నీ పోస్ట్‌లు చదివిపెడుతుంటే దొంగతనం చేశారా అనడుగుతావా? ఎలా కనబడుతున్నామేం??" అని సీరియస్ అయిపోకండి. నేను, చిన్నప్పుడు చేసిన చిన్న చిన్న దొంగతనాల గురించి అడుగుతున్నాను. అంటే.. స్కూల్ లో బలపాలు, పక్కింట్లో పువ్వులూ లాటివన్న మాట.

మీ సంగతేమో కాని నేనైతే కొంచెం ఎక్కువే చేశానండీ. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకూ నేను మొట్టమొదటిసారి దొంగతనం చేసింది జామకాయలు. చిన్నప్పుడు వేసవి సెలవులకు మా మేనత్తా వాళ్ళింటికి వెళ్ళేదాన్ని. వాళ్ళ పక్కింట్లో నాగరత్ర్నం గారనీ ఓ బామ్మ ఉండేవారు. ఆవిడకు చాదస్తం ఎక్కువ. ఎప్పుడూ ఎవరో ఒకరిమీద విసుక్కుంటూ చిటపటలాడుతూ మళ్ళీ గ్యాప్ దొరికినపుడల్లా స్తోత్ర మంత్రాలు జపిస్తూ ఉండేవారు! తాతగారు కాలం చేసారట.. పిల్లలేమో విదేశాల్లో సెటిల్ అయ్యి అప్పుడపుడూ చూడ్డానికి మాత్రం వస్తారట. ఆవిడ ఒక్కరే ఉంటారు ఇంట్లో. ముసలావిడ అన్న పేరే గానీ ఇంటి పనీ, పెరటి పనీ అంతా భలే చురుకుగా చేసుకునే వారు. ఆవిడ పెరట్లో రెండు రకాల పెద్ద పేద్ద జామచెట్లు, సపోటా చెట్టు, జీడిమామిడి చెట్టు, మామిడి చెట్లు, నిమ్మకాయ చెట్టు, గోరింటాకు చెట్టు, .. ఇలా పలు విధాలయిన చెట్లు, ఉయ్యాల కట్టుకోవడానికి వీలుగా ఉండడమే కాక కాయలతో తొంగుతూ నోరూరించేవి. వాటిని ఆవిడ తినలేరు.. అలాగని మరెవ్వరికీ పెట్టరు . ఎప్పుడైనా ఒక్కసారి..  బాగా మూడ్ వస్తే ఒక్క కాయను ఆరు ముక్కలు కోసి అందులో ఒక ముక్కను భద్రంగా తీసుకొచ్చి నా చేతిలోపెట్టి పండగ చేసుకోమనేవారు. "ఇది మాత్రం నాకెందుకూ? మీరే తినేయకపోయారా?" అన్న మాట గొంతు వరకూ వచ్చేది కాని మింగేసేదాన్ని. నేనామాట అనగానే సరే అని నిజంగానే తీసేసుకుంటుందని నా నమ్మకం. ఆ చిన్న ముక్క నాకూ నా పక్కనున్న పిల్లలకూ కలిపి సరిపోయేది కాదు. ఆ మాటే ఆవిడతో చెప్పి మరొక్కటి ఇవ్వమని అడిగితే కసురుకునేది. కనీసం కింద పడిపోయిన కాయలయినా ఏరుకుంటామని ఎన్నిసార్లు బ్రతిమాలినా ససేమేరా ఒప్పుకునేవారు కాదు. కోపమొచ్చి ఓ మాధ్యహ్నం పూట ఆవిడ నిద్ర పోతుండగా సైలెంట్‌గా జామ చెట్టెక్కి కావలసినన్ని కాయలు కోసుకొచ్చేసుకున్నాను. మా మేనమామ "తప్పు కదూ?? అలా చేయవచ్చునా? వెళ్లి అక్కడ పెట్టేసిరా" అని కోప్పడితే, మేనత్త మాత్రం ఫుల్ సపోర్ట్ ఇచ్చేసింది. "ఆవిడ తింటుందా పెడుతుందా? కాయలన్నీ అలా నేలపాలయ్యి పాడయిపోవలసిందే కాని ఒకరికి ఇవ్వడానికి మాత్రం మనసురాదు. ఉండనివ్వండి సాయంత్రం పిల్లలకు పంచిపెడదాం" అంది. ఆ సాయంత్రం నిద్ర లేచాక ఆ బామ్మగారు తిట్టిన తిట్లైతే.. అబ్బాహ్ మానవతరం కాదు వర్ణించడానికి :P. నేను కాస్త ఎదిగాక ఈ విషయం గుర్తొస్తే అనిపిస్తుంది "ఛ ఛ అలా చేసుండాల్సింది కాదు" అని. నిజానికి ఆరోజు గాని మా అమ్మ ఉండుంటే.. ఇంకేంలేదు తీసుకెళ్ళి నాగరత్నం గారికి నన్ను అప్పగించి ఉండేది. ఆవిడ నా పెళ్లి చేసుండేవారు :)

హహ్హహా.. అమ్మ పేరు  తలవగానే ఒక సంఘటన గుర్తొస్తోంది. ఓ సారి ఏమైందంటే (నాకు పదహారేళ్లపుడు), మా ఫ్యామిలీ + మా డాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీస్ కలిపి "యేర్కాడ్ " అనే ఊరు వెళ్లాం. మా డాడీకి క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అంతగా నచ్చవు. ఆయన ట్రెక్కింగ్ ఇష్టపడతారు కనుక అక్కడేదో ఒక చిన్న కొండ ట్రెక్కింగ్ కి అనువుగా ఉందని తెలుసుకుని అక్కడికి తీసుకువెళ్ళారు. కార్స్ పార్క్ చేసి కొండ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఒక ఇంటి దగ్గర బోలెడన్ని రోజ్ చెట్లతో పాటు రకరకాల పూల చెట్లు ఉన్నాయి. అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. నాన్నతో చెబితే "నీకు పువ్వులే కదా కావాలి? ఈ సీజన్లో ఇక్కడ పూసే మల్లెలు చాలా స్పెషల్ అని విని, ఉదయం వెళ్ళినపుడు అమ్మ కొంది. చెప్పడం మర్చిపోయాను. కార్ లో ఉన్నాయి తెచ్చుకో" అన్నారు. వెళ్లి తెచ్చుకుని తలలో పెట్టేసుకున్నాను. మా వాళ్ళంతా నవ్వారు నన్ను చూసి.  త్రీఫోర్త్, టాప్ మీద ఎవరైనా మల్లె పువ్వులు పెట్టుకుంటారా? నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి పాడైపోతున్నట్లున్నావ్" అంటూ ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్ చేశారు. "ఏడిశారు పొండి..  ఇక్కడెవ్వరూ బయట వాళ్ళు లేరుగా? ఉంటే మాత్రం ఏంటీ? నాకు ఇష్టం కనుక పెట్టుకున్నాను" అని దులుపేసుకున్నాను. ముందుకెళ్ళాక మళ్ళీ ఇంకో ఇల్లు అచ్చు అంతకు ముందు చూసిన దానిలానే వాకిలంతా బోల్డన్ని పూల నిండిపోయి కనబడింది. అక్కడ కూడా ఎవ్వరూ లేరు. ఈలోపు అక్క వచ్చి "వెళ్ళి రెండు పువ్వులు కోసుకురావే.. బావున్నాయి" అంది. "ఆహా! అంతొద్దులే.. నీక్కావాలంటే నువ్వెళ్ళు. అంతగా భయమయితే నేను తోడు వస్తా" అని బెట్టు చేశాను. తను ఒప్పుకోలేదు. సరే వచ్చేడపుడు చూసుకోవచ్చని వెళ్ళిపోయాం.

కిందకి దిగేడపుడు "రా అక్కా ఇద్దరం కోసుకొచ్చుకుందాం" అని బ్రతిమాలాను. తనకి పువ్వులు పెట్టుకోవడం పెద్దగా నచ్చదు. ఏదో అక్కడున్న రోజ్స్ డిఫరెంట్ స్మెల్ల్ తో ఉండేసరికి ఆశపడింది. "అడిగి కోసుకుందామంటే ఎవ్వరూ లేరు. చెప్పకుండా కోసుకుంటే అమ్మ తంతుంది. ఎలాగూ ఇది పూల పిచ్చిది.. కచ్చితంగా తెచ్చుకుంటుంది.. అప్పుడు చూసుకోవచ్చులే" అనుకుందిట (తర్వాత చెప్పింది).  "డాడీని అడుగు. మీ ఇద్దరూ వెళ్లి రండి. నేను అమ్మను మేనేజ్ చేస్తాను" అంది. సర్లే అని డాడీ ని అడిగితే "నేను ఇక్కడ నిలబడతాను. నువ్వెళ్ళి కోసుకో" అన్నారు. "మాతో పెట్టుకుంటే పూలను మిస్ అవ్వాల్సిందే.. గబుక్కున కోసుకొచ్చేసుకుంటే పోయే! లక్కీగా ఎవరూ లేరు" అన్న అక్క మాటలు విని, చక్కగా పరిగెట్టుకుంటూ వెళ్లి రెండు పువ్వులు కోసుకుని అదే పరుగుతో సంబరంగా తిరిగొచ్చాను. "అక్క అమ్మ దగ్గరకు వెళ్ళిపోయింది. ఆ పువ్వులు ఇలా ఇవ్వు పాకెట్లో పెట్టుకుంటాను. అమ్మ చూస్తే తిడుతుంది" అని డాడీ పువ్వులను జేబులో దాచారు. అక్కడి చెట్లు చేమల గురించి డిస్కస్ చేస్తూ కార్ దగ్గరకు వెళ్ళే సరికి మా అమ్మ కోపోద్రేకురాలై ఆయాసపడుతూ కనిపించింది. "కొంపదీసి ఇది చెప్పేసిందా ఏంటీ?" అని కంగారుపడుతూనే, ఏమైందన్నట్లు మా అక్కవైపు చూశాను. చేత్తో "పువ్వులు" అన్నట్లు సైగ చేసి చూయించింది. "మేము ఆల్రెడీ దాచేశాంగా? ఎలా కనబడతాయి? చీకట్లో రాయి వేస్తుందేమో.. ఎలాగయినా లేదని నమ్మించాలి" అనుకుంటూ దగ్గరకెళ్ళాను. అమ్మ వేసిన ప్రశ్నలకు నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు "లేదు" అని సమాధానం చెప్పాను. అమ్మ నమ్మలేదు సరికదా.. దొంగతనం చేసింది కాకుండా అబద్దాలు కూడా చెప్తావా అంటూ మీదకొచ్చింది. డాడీ అడ్డొస్తూ నా కంటే ఒక ఆకు ఎక్కువగా, "నేను ప్రియా ఇద్దరం కలిసే వచ్చాం. పూల గోల మాకు తెలియనే తెలియదు. నీ అనుమానాలకు ఓ హద్దు పద్దు లేకుండాపోతోంది" అని సీరియస్ అయ్యారు.  అమ్మ డాడీ వైపు విసురుగా చూసి రవి అంకుల్ కెమెరా అడిగి తీసుకొచ్చి డాడీకీ నాకూ చూయించింది. చూస్తే ఏముంది..?!! మీరే చూడండీ.రన్నింగ్ మోషన్లో కాప్చర్ చేస్తే ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నారట. బాగా వచ్చిందని అందరికీ చూయించారట! "ఖర్మ! ఈ దరిద్రుడు.. వీడికి వేరే పని లేదు. గొప్ప ఫోటోగ్రాఫర్ అని వీడి బోడి ఫీలింగ్. శనిలా దాపురించాడు.... .... ..." అని నానా విధాలుగా తిట్టుకున్నాను ( పెద్దయ్యాక సారీ చెప్పుకున్నానులెండి.. మనసులో తిట్టుకున్నాను కనుక మనసులోనే సారీ చెప్పుకున్నాను). ఫోటో మాట ఎలా ఉన్నా, ముందు డాడీ కి, ఆ తరువాత నాకూ అమ్మ క్లాస్ తో చుక్కలు కనిపించాయి. ఆ క్లాస్ రన్నింగ్ లో ఉండగానే ఆ ఇంటి ఓనర్లు రావడం, వాళ్లకి ఓ సారీ, వాళ్ళ పువ్వులు, వాటితో పాటు నన్నూ అప్పగించింది. పాపం వాళ్ళు చాలా మంచోళ్ళు. "పోనీలేమ్మా రెండు పువ్వులేగా? చిన్నపిల్ల ఆశపడింది" అంటూ నన్ను వెనకేసుకొచ్చారు. స్టిల్! అమ్మ వదిలితేగా? ఆ క్లాస్ పూర్తయ్యేసరికి దెబ్బతో నాకు బుద్దోచ్చేసింది. ఆ తరువాత నుండి ఇంకెప్పుడైనా అడక్కుండా చెట్ల మీద చెయ్యేస్తే ఒట్టు!!! 

విలువైన ఈ జీవితానికి మరింత విలువనూ, అందాన్నీ చేకూర్చిన అమ్మకీ, నాన్నకీ, అక్కకీ, నా జీవితంలో పరిచయమయిన ప్రతి ఒక్కరికీ  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.  

By the way.. జీవితంలో నేను తీసిన మొట్టమొదటి ఫోటో ఇది :). అప్పుడు నాకు ఐదేళ్ళు. నాన్న ఫోటో పబ్లిష్ చేయడానికి పర్మిషన్ దొరకలేదు. అందుకే.. అమ్మా, అక్కా ఉన్న ఫోటో మాత్రం పెడుతున్నా :) 

Monday, July 22, 2013

ప్లాస్టిక్ బాటిల్స్ తో..

చిన్నపుడు బయటకు వెళ్ళిన ప్రతిసారీ దాహమేస్తే అప్పటికప్పుడు బాటిల్ కొనుక్కునేదాన్ని. అది తప్పని, దాని వల్ల ప్లాస్టిక్ వాడకం పెరుగుతోందని అది వాతావరణానికి మంచిది కాదని అంచేత బయటకు వెళ్ళాల్సి వచ్చినపుడు ఇంటి నుండే నీళ్ళు తీసుకువెళ్ళడం మంచి అలవాటని న్యూస్ పేపర్స్ లో వచ్చే ఆర్టికల్స్ చదివి తెలుసుకున్నాను. అప్పటి నుండి ఎక్కడకు వెళ్ళినా బాగ్ లో కచ్చితంగా వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఎవ్వరికీ కూల్ డ్రింక్స్ తాగే అలవాటు లేదు. కాని మొన్న మా బంధువులు ఇంటికి వచ్చినపుడు వాళ్ళ కోసమని కొనాల్సి వచ్చింది. ఆ బాటిల్స్ వట్టినే పారేయడం ఇష్టంలేదు అలాగని వాటిని ఇంకేలాగు వాడము . అందుకని సరదాగా ఈ కింది వస్తువులు తయారు చేశాను. నాకు ముందు తట్టలేదు కాని ఇప్పుడు అనిపిస్తోంది ఎలా చేసుకోవాలో కూడా రాస్తే బావుండని. నిజానికి ఈ ఫోటోలను జాగ్రత్తగా చూస్తేనే తెలిసిపోతుంది ఎలా చేశానో. కాని చేసేడపుడే ఒక్కొక్క స్టెప్ ని ఫోటో తీసినట్లయితే ఇంకా ఈజీగా ఉండేది కదా.. హూం.. నెక్స్ట్ టైం తప్పకుండా ఆ పని చేస్తాను. ఆ ఫ్లవర్స్ కి వేసిన పెయింట్ ఆరాక, వెడల్పుగా ఉన్న పాత్రలో నీళ్ళు పోసి అందులో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ గా అలంకరిస్తాను. కాస్త శ్రద్ధగా చేసి ఉంటే చక్కగా ఉండేవి. నేనే హడావిడిగా ఫస్ట్ కోటింగ్ మాత్రం ఇచ్చి ఊరుకున్నాను. టైం ఉన్నపుడు రెండో కోటింగ్ కూడా ఇస్తే పని పూర్తవుతుంది. ఆ ఉలెన్ బాస్కెట్ కూడా కింద బాగానే అల్లాను కాని పైకి వచ్చేసరికి తొందరపాటుతో లూజ్ గా చేసేశాను. కిందా, పైనా ఉన్న పార్ట్స్ ని ఫ్లవర్స్ గా వాడావు బాగానే ఉంది కాని మధ్యలో ఉన్న ప్లాస్టిక్ అంతా పారేసినట్లేనా అనేగా మీ ప్రశ్న? కొంత పార్ట్ ని పెయింట్స్ ని కలుపుకునే ప్లేట్ లా వాడుకుంటున్నాను. మిగతా వాటితో ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నా. అలాగే ఒక బాటిల్తోనేమో ఉలెన్ బాస్కెట్ చేసాను కదా మరో దానిలో మట్టి వేసి కొత్తిమీర విత్తనాలు నాటాను. ఇలా పారేసే వస్తువులతో పనికొచ్చే వాటిని చేసుకునేందుకు మీకు తోచిన/తెలిసిన ఉపాయాలు చెప్పి పుణ్యం కట్టుకోండి :)

Thursday, July 18, 2013

మా ఇంటి పక్షిగూడు!!

వెనుక వాషింగ్ మెషిన్ ఉన్న దగ్గర  ఒక అటక ఉంది. పాత చీపుర్లు, అనవసరపు డబ్బాలు దాని మీద దాచి, ఎక్కువ పోగయిన తరువాత చెత్త తీసుకెళ్ళడానికి వచ్చే ఆవిడకు ఇస్తుంటాను. నిన్న కూడా అలాగే నూనె డబ్బాలు అవీ కిందకు దించి ఇంకేమైనా ఉన్నాయేమోనని చూస్తే ఒక ప్లాస్టిక్ చీపురు కనబడింది. దాన్ని కూడా తీద్దామని లాగితే కాస్త బరువుగా ఉండి రాలేదు. నేను ఎక్కి నిలబడింది చిన్న స్టూల్ కావడంతో  పైన ఏముందో కనబడలేదు. ఇంకాస్త గట్టిగా లాగాను. రాలేదు. ఈ సారి బలమంతా ఉపయోగించి ఘాట్టిగా లాగితే కాస్త ముందుకొచ్చింది. దానితో పాటే రెండు మూడు సన్నటి పుల్లలాటివి ఎగిరొచ్చి నా నెత్తి మీద పడ్డాయి. డౌట్ వచ్చి పక్కనున్న ఐరన్ గ్రిల్ ఎక్కి, ఆ చీపురుని అటు ఇటు కదుపుతూ అప్పటికీ అక్కడేముందో సరిగా కనబడక ఎగిరెగిరి చూస్తుంటే.. అప్పుడే అటు వచ్చిన అమ్మ "మొన్ననేగా దెబ్బలు తగిలించుకుని వచ్చావు? అయినా బుద్ది రాదు రాక్షస జన్మకు. అన్నీ కోతి పనులే. ఆడపిల్లలా పుట్టినందుకైనా కుదురుగా ఓ చోట కూర్చోరాదు? అనుక్షణం నిన్ను కనిపెట్టుకోలేక చచ్చిపోతున్నాను. దిగు. రా ఇటు రా" అని కేకలందుకుంది. చప్పున కిందకి దిగేసాను (దూకేసాను). నేను కదిపినందుకో లేక దూకేడపుడు తెలియకుండా లాగేసానో కాని చిన్న కుప్ప లాటిది అటక చివరకు వచ్చింది. దానితో పాటే కాస్త చెత్త వాషింగ్ మెషిన్ మీద, ఇంకాస్త నేల మీదా పడింది. పైగా చెడ్డ వాసన కూడా వచ్చింది. ఆటోమేటిక్ గా అమ్మ కేకలు అలా కంటిన్యూ అయ్యాయి.

ఆఖరికి దాన్ని కిందకి దించమని చెప్పింది అమ్మ. దించాక చూద్దుము కదా.. అందమైన చిన్న గూడు ఉంది! ఆ కిటికీ మీదకి కొన్ని పావురాలు, ఇంకేదో పిట్టలూ (పేరు తెలియదు నాకు) అప్పుడప్పుడు వస్తుంటాయి. వాటికి గింజలూ, నీళ్ళు  అవీ పెడుతుంటాను. ఈ మధ్య ప్రతి రోజూ ఆ పేరు తెలియని పిట్ట ఒకటి వచ్చి పోవడం గమనించాను కానీ గూడు పెట్టిందన్న విషయం తెలియదు.

ఈ పిట్టే అది (Google image) 
ఆ గూట్లో నాలుగు బ్లూ రంగు గుడ్లు ఉన్నాయి. అసలు ఆ గూడు ఎంత పగడ్బందీగా కట్టిందోనండీ! నేను ఇదే ఫస్ట్ టైం పక్షి గూడుని నేరుగా చూడడం. బయట అంతా కాస్త మందంగా గట్టిగా ఉండే పుల్లలు, దాని మీద ముళ్ళతో కూడిన పుల్లలు, వాటి మీద మామూలు పుల్లలు, ఆ పుల్లల మీద మెత్తని గడ్డి, మళ్ళీ ఆ గడ్డి మీద లేతగా ఉన్న పచ్చటి వేపాకులు!!! ఆ వేపాకుల మీద భద్రంగా ఉంచింది గుడ్లను! వావ్... ఎంత అద్భుతంగా అనిపించిందో.. ఎంతసేపు చూసినా ఆశ్చర్యంగానే, తనివి తీరనట్లే అనిపించింది. ఫోటో తీసుకుందామంటే సమయానికి కెమెరా ఇంట్లో లేదు. ఫ్రెండ్ తీసుకుంది. దాంతో లాప్టాప్ ని ఉపయోగించాను. అందుకే సరిగా తీయలేకపోయాను. మీరూ చూడండి ఈ ఫోటోలు.  

గూడు బావుంది కదూ..? కాని తరువాత మొదలయింది అసలు సమస్య. దించిన దాన్ని మళ్ళీ పైన పెట్టడం కుదరలేదు. కాసేపు ప్రయత్నించాను.. గుడ్లు పక్కకు వచ్చేయడం, పుల్లలు పడిపోవడం లాటివి జరిగాయి. ఏం చేయాలో అర్ధంకాలేదు. "అయ్యో.. అనవసరంగా తీసాను. ఛ ఛ" అని బాధపడ్డాను. అప్పుడు అమ్మ "ఏం పరవాలేదు. అక్కడ నేల మీద పెట్టేసి ఇలా వచ్చేయ్. తలుపు వేసేద్దాం.. సాయంత్రం అది వచ్చినపుడు తీసుకెళ్ళిపోతుంది" అంది. నాకస్సలు నమ్మకం కుదరలేదు. "అదెలా తీసుకెళ్లగలుగుతుంది అమ్మా" అంటూ నా ప్రశ్నలతో కాసేపు వేధించాను. "చెప్తున్నానా? నాకు తెలుసు. నువ్వు రా" అని విసుగ్గా అంది అమ్మ. వెంటనే వింటే నేను నేనెందుకవుతాను? హూం.. చివరికి అమ్మ చేత రెండు చరుపులు చరిపించుకుని లోపలికి వెళ్లాను. అమ్మ వీపు తట్టి  చెప్పినప్పటికీ నేను నమ్మలేదనుకోండీ..  ఆ పిట్ట వచ్చి తన గుడ్లను తీసుకేళుతుందని. ఈ అష్టదరిద్రాల్లో నిష్ఠదరిద్రంలా మళ్ళీ ఆ పక్కింటోళ్ళు పెంచుతున్న మాయదారి పిల్లి ఎక్కడొస్తుందోనని, అక్కడకు వెళితే అమ్మ మళ్ళీ కొడుతుందేమోనన్న భయం ఉన్నా సాయంత్రం వరకు ఆ డోర్ దగ్గరే పుస్తకం పట్టుకుని కూర్చున్నాను. ఆల్రెడీ తన్నులు తిని ఉన్నానని అమ్మ ఇక ఏమీ అనలేదు. 

సాయంత్రం చీకటి పడే టైం కి ఆ పిట్ట వచ్చింది. రావడం రావడమే అది అటక మీదకు వెళ్ళి.. తరువాత బయటకు వచ్చి చూసి, ఒక్కో గుడ్డునూ ఎంతో జాగ్రత్తగా నోటితో పట్టుకొని ఎటో ఎగిరింది! ఆఖరి గుడ్డు తీసుకెళ్ళాక మళ్ళీ తిరిగి రాలేదు. అన్నిటినీ అది ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్లినందుకు సంతోషంగా అనిపించినా, అయ్యో.. అసలు ఆ గూడు దించకుండా ఉండి ఉంటే అది ఇక్కడే ఉండుండేది.. పిల్లలనూ చూసుండేదాన్ని అని బాధపడ్డాను. ఒక చోట నుండి గుడ్లు కదిపాక మళ్ళీ అదే చోటులో గుడ్లు పెట్టదని అమ్మ చెప్పింది. కాని ఉదయం నుండీ అది మళ్ళీ కొత్త పుల్లలు అటక మీదకు మోసుకొచ్చుకుంటూ ఉంది!! 

Beautiful experience! 

Friday, July 12, 2013

కడప - చెన్నై

రెండు మూడు నెలల క్రితం వరకు భరత్ కడపలో లెక్చరర్ గా వర్క్ చేసేవాడు. అక్కడికి వెళ్ళేప్పుడు అవసరమవుతుందని తన బైక్ ని కూడా తీసుకెళ్ళాడు. తీరా అక్కడి నుండి ఇక్కడకు వచ్చేసేడపుడు దాని RC పోయేసరికి వేరే దారి లేక దాన్ని తెలిసిన వాళ్ళింట్లో పెట్టి వచ్చాడు. 

కొత్త RC రావడానికి ఇంకా టైం పట్టేట్లుందని, "వీలు చూసుకుని బండి మీదే వచ్చేస్తే గొడవ వదిలిపోతుంది.. అంత పెద్ద దూరమేమీ కాదు. ఉదయం ఆరింటికల్లా కడపలో బయలుదేరితే ఎంత నిదానంగా వచ్చినా సాయంతానికి ఇల్లు చేరుకోవచ్చు" అన్నాడు. అమ్మో.. బైక్ మీద అంత దూరమా? చాలా రిస్క్ బాబు అని భయంగా అనిపించింది కాని "ఆ.. ఇప్పుడు కాదుగా. బయలుదేరినపుడు చూద్దాంలే" అని ఊరుకున్నా. ఆ రోజు రానే వచ్చింది (పోయిన ఆదివారం, 7/7/13). వారించినా వినలేదు. భయపడుతూనే సరే అన్నాను. వెళ్ళేడపుడు బస్‌లో వెళ్లి వచ్చేడపుడు బైక్ మీద రావడం అన్నమాట. అప్పటి వరకు బాగానే ఉన్నాను కాని తను బయలుదేరే టైంకి టెన్షన్ పడిపోయాను. అస్సలు మనసు ఒప్పుకోలేదు. తనేమో ఆగట్లేదు. దాంతో ఇంట్లో ఒప్పించి నేనూ తనతో బయలుదేరాను. 

కోయంబేడ్ బస్టాండ్ కి వెళ్ళడానికి లోకల్ బస్ ఎక్కాం. అప్పుడు మొదలయింది నాలో వణుకు. ఎందుకో మనసు చాలా కీడు శంకించింది. నాకు అదే ఆఖరు రాత్రేమో అనిపించింది! ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాను. భరత్ చెయ్యి గట్టిగా పట్టుకుని తనను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ కూర్చున్నా. ఏడుపొక్కటే తక్కువ. ఏవేవో ఆలోచనలు. బయటేమో ఒకటే వర్షం. కోయంబేడ్ బస్టాండ్‌లో దిగాక, "అనూ నాకేమి బాలేదు. మరో రోజు వెళదాంలే. ఎందుకో మనసు కీడు శంకిస్తోంది" అన్నాను. తను నా వైపు విసుగ్గా చూసి అంతలోనే తమాయించుకుని "ఏం పర్లేదు నాన్న. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. దేవుణ్ణి ప్రార్దించుకో" అన్నాడు. 

కడప బస్ ఎక్కాక కూడా నా పరిస్థితిలో పెద్ద మార్పేమీ లేదు. ఎప్పుడూ గడగడా వాగేదాన్నల్లా మౌన మునిలా కూర్చున్నాను. భోరున కురిసే వర్షాన్ని చూసి ఎప్పుడూ కేరింతలు కొట్టేదాన్నల్లా.. అమ్మో వర్షం అని భయపడ్డాను. కాసేపటికి భరత్ హాయిగా నిద్రపోయాడు. నాకు గుండెల్లో రైళ్ళు పరిగెడుతుంటే ఇంకెక్కడ నిద్ర? హుం.. కొరివిదెయ్యంలా చూస్తూ బెదురు బెదురుగా కూర్చున్నాను. 

మధ్యరాత్రిలో సడెన్‌గా బస్ డబ్బాలా ఊగుతూ ఆల్మోస్ట్ ఓ పక్కగా ఒరిగిపోయినంత పని అయి నిలదొక్కుకుంది! నేనసలే చాలా ధైర్యంగా ఉన్నానేమో.. అంత చలిలోనూ చెమటలు పట్టేసాయి. పక్కనున్న మానవుణ్ణి తట్టినా చనలంలేదాయే.. హాయిగా గుర్రు పెట్టి పడుకున్నాడు!! "యెహే.. లే" అని కసురుకున్నాను.. బస్ పంక్చర్ అయిందంటూ లైట్స్ వేసి జనాలంతా హడావిడి చేశారు.. అయినాసరే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే. చక్కా నిద్రపోయాడు. "ఓరి దేవుడో.. ఇంత కష్టపడి నిశ్చితార్దం వరకూ వచ్చాం. ఇంకా ఆ మూడు ముళ్ళూ పడనేలేదు. భగవంతుడా... ఈ లోపు......... " ........ "ఛీ ఛీ ఏమీ కాదు. మరీ చెండాలంగా అయిపోయానేంటి నేను? అస్సలు బుద్ధిలేదు నాకు. చావాలని రాసి పెట్టి ఉంటే చస్తాం ఇక అందులో భయపడడానికి ఏముందీ? భయపడ్డం వల్ల జరిగేది ఆగదు కదా.. పైగా ఉన్న సమయం వేస్ట్ అయిపోతోంది" ఈ ఆలోచన వచ్చాక ఇక భయపడలేదు (ట్రై చేశాను). బలవంతంగా నిద్రపోయాను. తెల్లవారుజామున నాలుగు గంటలకు చేరాల్సింది.. దారి పొడవునా వర్షం, ఆ పంక్చర్ల వల్ల ఆరున్నరయింది కడప చేరేసరికి. 

తెల్లారేసరికి కాస్త ధైర్యం వచ్చింది. భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిల్లలతో ఆడుతూ నేను, ఫ్రెండ్ తో కబుర్లలో పడి భరత్.. ఇద్దరం టైం మర్చిపోయాం. తొమ్మిదింటికి తేరుకుని అక్కడ బయలుదేరాం. 

బయలుదేరినపుడు తీసుకున్న ఫోటో
ఒక 20 మినిట్స్ బాగానే సాగింది జర్నీ. లైట్ గా తుపర పడుతూ, చల్లటి గాలితో  ఆకాశమంతా మబ్బులతో నిండి ఉండి చాలా ప్లెజెంట్‌గా ఉంది వాతావరణం. మేమూ అంతే ప్లెజెంట్‌గా నేచర్ ని ఎంజాయ్ చేస్తూ 40/45 స్పీడ్ లో వెళుతున్నాం. రోడ్డు పక్కగా గడ్డి మేస్తున్న ఒక గేదె, ఎవరో కొట్టి తరిమినట్లు బెంబేలెత్తిపోతూ మా బండికి అడ్డం వచ్చి నిలబడడం, నా కళ్ళ ముందే భరత్ ఎగిరి అవతల పడడం చూస్తుండగానే నా తల రోడ్ కి కొట్టుకోవడం క్షణాల్లోజరిగిపోయాయి. తేరుకోవడానికి 2 నిముషాలు పట్టింది. ఈలోగా జనాలు పోగయ్యారు. నేను లేచి భరత్ పడిన వైపు చూసేసరికి తను దూరంగా పడిన తన హెల్మెట్ తీసుకుంటూ కనిపించాడు. లక్కీగా ఆ రోజు జీన్స్ వేసుకోవడం వలన నా కాళ్ళు కొట్టుకుపోలేదు గాని చేతులు కొట్టుకోపోయి తలకు దెబ్బ తగిలింది. ఇవి ఓకే గాని నడుము దగ్గర ఎముకకి బైక్ హేండిల్ బాగా బలంగా తగిలింది. పాపం భరత్ కి మాత్రం మోకాళ్ళు, చేతులు రక్తాలు కారేలా దెబ్బలు తగిలాయి. తన ప్యాంటు కూడా చిరిగిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం వలన లక్కీ గా తలకి మాత్రం దెబ్బ తగల్లేదు. కాని ఓవరాల్ చెప్పాలంటే పరిస్థితి మరీ అంత దారుణం అయితే కాలేదు. ఇంకా అక్కడే నిలబడి ఉంటే సీన్ క్రియేట్ చేసినట్లు అవుతుందని, బాగానే ఉన్నామండీ అని చెబుతూ ముందు అక్కడి నుండి కదిలాం. 

భరత్ బాగానే భయపడ్డాడు. నాకైతే మనసు చాలా తేలికపడిపోయింది. అప్పటి వరకు ఉన్న భయం, టెన్షన్ అంతా ఎగిరిపోయింది. చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండాలి కాని దేవుని కృప వల్ల చిన్న దెబ్బలతోనే తప్పించుకున్నాం. ఆ టైం కి రోడ్ కాళీగా ఉండడం కూడా పెద్ద +పాయింట్ అయింది. 

కాస్త ముందుకెళ్ళి ఆగి దెబ్బ తగిలిన చోట్ల వాటర్ తో క్లీన్ చేసుకున్నాం. చెన్నైలో బయలుదేరేడపుడే "బ్యాండ్ఎయిడ్ లాటి ఫస్ట్‌ఎయిడ్ కిట్ తీసుకువెళదాం అనూ.. ఎందుకూ మంచిది కదా" అని నేనంటే, "శుభం పలకరా మల్లన్నా అంటే పెళ్ళి కూతురు ముండెక్కడ చచ్చిందీ అన్నాడంట వెనకటికి నీలాంటి వాడెవడో. సరదాగా వెళ్ళోద్దాం రావే అంటే ఫస్ట్‌ఎయిడ్ కిట్ అంటావెంటే? నోట్లో నుండి ఒక్క మంచి మాట కూడా రాదా?" అని కేకలేశాడు. అవి గుర్తు చేసుకుంటూ ధుమ ధుమలాడాను. తరువాత మేము గ్రహించిందేంటంటే పడిపోయిన తరువాత నుండి బ్యాక్ బ్రేక్స్ పనిచేయట్లేదు. ఇక బండి మీద ఈ పరిస్థితుల్లో చెన్నై వరకు రావడం అంటే కుదిరేపని కాదు. ఏం చేయాలో తెల్చుకోలేకపోయాం. సరే.. ముందు ఆ చుట్టుపక్కల మెకానిక్ షాప్ ఏమైనా ఉందేమో చూసి బైక్ పరిస్థితి కనుక్కుని తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకుని నిదానంగా ముందుకి వెళుతుంటే ఓ పది నిముషాల్లోనే రోడ్ పక్కన ఓ మెకానిక్ షాప్ కనబడింది. పరవాలేదు 20 మినిట్స్‌లో రిపేర్ అయిపొయింది. నెక్స్ట్, మా ఈ బైక్ ప్రయాణం కంటిన్యూ చేయాలా వద్దా అన్నది సమస్య. 

"రేణుగుంటలో నా x కొలీగ్ ఒకాయన ఇల్లు ఉంది. ముందు అక్కడి వరకు వెళదాం. ఎలాగూ సీరియస్ దెబ్బలేమీ తగల్లేదు కదా.. ఇప్పుడు కాస్త అడ్జస్ట్ అయితే ఒక తలనొప్పి వదిలిపోతుంది. ఇంకా నిదానంగా జాగ్రత్తగా వెళదాం. ఈలోపు దారి మధ్యలో ఎక్కడ అన్‌కంఫర్టబుల్ అనిపించినా we'll stop there. ఓకేనా?" అన్నాడు భరత్. నాకేం ప్రాబ్లం కనిపించలేదు. సరేనన్నాను. 

ఆక్సిడెంట్ తాలుకు భయం, ఆ గాయాల మంట వల్ల ఎంజాయ్ చేయలేకపోయాం గాని.. అబ్బాహ్ ఆ క్లైమెట్, ఆ రోడ్, చుట్టూ కొండలు.. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయో! చూస్తారా.. ?

మధ్యలో నో బ్రేక్స్. రేణుగుంటకు వెళ్లేసరికి పావు తక్కువ మూడయింది.  దారి పొడవునా ఏదో ఒక ఆక్సిడెంట్ చూస్తూనే ఉన్నాం ప్రతి ఊరిలోనూ. బాధపెట్టే విషయం ఏంటంటే.. అన్నీ సీరియస్ ఆక్సిడెంట్సే.

చెప్పడం మర్చిపోయాను.. ఒక్క బ్రేక్ తీసుకున్నామండోయ్. ఒక ఊరిలో, "రైల్వేకోడూరు" అనుకుంట ఊరిపేరు (not sure). తినడం కోసం అని ఆగాం. "అన్నపూర్ణ" రెస్టారెంట్ అట.. అది చూడ్డానికే ఏమంత బాలేదు కాని తప్పదు కనుక నోరుమూసుకున్నాను. మీల్స్ ఆర్డర్ చేశాం. దేవుడో.. ఆ పప్పు ఎంత కారంగా ఉందో! సాధారణంగానే మా ఇంట్లో ఉప్పు, కారాలు బాగా తక్కువగా వాడతాం. అలాటిది ఆ పప్పు నోట్లో పెట్టుకోగానే కళ్ళు కూడా మండాయి. భరత్ ని చూస్తే తనూ ఒగుర్చుకుంటూనే తింటున్నాడు. నేనూ ఎలాగో ముక్కు చీదుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ నాలుగైదు ముద్దలు తిని, ఇది మన వల్ల కాదులే రసం అయినా పోసుకుందామని వైట్ రైస్ కాస్త ముందుకి తీసుకుంటే దానిలో చిన్న మాంసపు ముక్క కనిపించింది. ఛీ!!! యాక్... నా మొహమంతా వికారంగా మారిపోయింది. కాని భరత్ ఇబ్బంది పడకూడదని ఏమి మాట్లాడకుండా "నాకు అస్సలు ఆకలిగా లేదు. ప్లీస్" అన్నాను. నా మొహం చూసి భరత్ ఇంకేమి మాట్లాడలేదు. "It's okay నాన్న. చెయ్యి కడిగేసుకో" అన్నాడు. "బ్రతికిపోయానురా దేవుడా" అనిపించింది. కాని అప్పటి వరకు ఆ అన్నమే తిన్నానన్న ఆలోచన వచ్చాక అబ్బో.. వర్ణనాతీతంలే. వాంతోస్తోంది. కాని భరత్ కంగారు పడతాడేమో లాటి ఆలోచనలతో బలవంతంగా ఆపుకుని ఎలా కూర్చున్నానంటే........ ...  అలా కూర్చున్నాను. అక్కడి నుండి బయలుదేరిపోయాక కూడా ఎటు చూసినా ఆ చిన్న మాంసపు ముక్కే కనిపించింది!! ఖర్మ ఖర్మ!!

రేణుగుంటకు వెళ్ళాక, భరత్ "ఈజీగానే వెళ్లిపోవచ్చు నాన్న. కనీసం ఏడున్నరకైనా ఇంటిని చేరుకోవచ్చు" అన్నాడు. అప్పటికే ఎముకలకు తగిలిన దెబ్బల తాలుకూ నొప్పులూ, వాటికి తోడు అంత సేపు ఆ "అప్పా ఛీ (ఇది నేను పెట్టిన పేరు)" బండి మీద కూర్చోవడం వల్ల వచ్చిన నొప్పులు. అసలు అంత సేపు మేనేజ్ చేయడానికే నానా తిప్పలూ పడితే, ఇప్పుడు రాత్రి ఏడున్నర వరకు అంటున్నాడు! ఇంకేమైనా ఉందా..??! నా ఫీలింగ్స్ ని గమనించినా, తను గమనించినట్లు నాకు తెలిస్తే నన్ను కన్విన్స్ చేయడానికి పట్టే టైం వేస్ట్ అవుతుందని నా మాట కోసం ఎదురు చూడలేదు.

నాకు మాటలకు కొదవా చెప్పండి..? ఈ కబుర్లు ఈవేళకి ఆగేట్లు నాకనిపించడంలేదు కాని ఇక నేను బలవంతంగా తక్కువ మాటలతో ముగించేస్తున్నాను :) ("ఇవి తక్కువ మాటలా.. మాయమ్మే!" అనుకుంటున్నారా...? హహ్హహ్హహహ్హ). అలా శ్రీకాళహస్తి మీదుగా తడ కి వచ్చి, చెన్నైని చేరుకునే NH5 చేరుకున్నాం. చాలానే కష్టపడ్డాంలెండి. వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం.. కాని దూరం మాత్రం అణువంతైనా తగ్గినట్లు అనిపించలేదు. హుం.. భగవంతుని దయ వల్ల అయినా ఎలాగో ఏడింటికి ఇంటికొచ్చి చేరుకున్నాం.

అడుగు తీసి అడుగు వేయగలిగితే ఒట్టు. మరుసటి రోజంతా నేను నిద్రావస్థలోనే గడిపాను. భరత్ అయితే మందులు, సూదులు, ఆయింటుమెంట్లు, ఆఫీస్.. ఇలా పండుగ చేసుకున్నాడు. ఇంట్లో వాళ్ళ రియాక్షన్ గురించి చెప్పాలంటే.. హహ్హహ్హ.. అబ్బే.. అస్సలేమి అనలేదు హహ్హహ్హ.. :(  :P