Tuesday, February 12, 2013

మొగలిపూలు (చివరి భాగం)

                    "అయ్యా! యాడ్నించి తెత్తావే నువు పూలు.."
                    "కుందేర్నింఛి... లోతట్టుగట్టులో పొదలుంటాయ్... ఆడికి పోయి దొంటుకర్రతో లాగి కోత్తా...."
                    "మరందవా సేతికి......?"
                    " లోనికి అందుతాయ్.. పోగూడదు. దూరాన్నించే కొయ్యాల"
                    " ఆడ పాములుంటాయంట గదయ్యా, రాములమ్మ సెప్పింది"
                    " ఆ...... ఉంటాయ్. పూలోసనకి పురుగు, పుట్ర సేర్తది... పొదల్లోకి...! జాగరతగా... ఒడుపుగా తుంపాల పూలు"
                     "ఊహు!" అయ్యా గుండెమీద తలవాల్చి నిద్రకు జోగుతోంది ముత్తెం.
                      ' అదే ఆలాపన బిడ్డకి.. ఒక్క మొగిలిపూతెచ్చి పిల్లమురిపెం తీర్చలేకపోతుండ' పిల్ల తల నిరుముతూ తన అసమర్ధతకు బాధపడుతున్నాడు ముసిలయ్య.

                       పుట్టి బుద్ధెరిగికాడ్నించి ఓ గోనడగల.. ఓబొమ్మడగల.. ఇగో.. ఉప్పుడీ మొగిలిపువ్వే అడగతాంది.... పద్దాకా అదే ఆలాపన... తల్లికెంత మక్కువగుందో? ఎట్టాగైనా ఈసారి పిల్ల కోరిక తీర్సాల..." అని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాడు ముసిలయ్య. 

                        మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతోంది. 'అయ్య ఊళ్ళోకెళ్ళిపోయిండు.. మల్ల పొద్దూకి వత్తడు' ముత్తెం గుడిసె తలుపులాగి బిగించికట్టి కుందేటివైపు పరుగుతీసింది. ఉత్సాహంతో పరుగుపెడుతున్న ఆ లేత పాదాలకు ఇసుక తిన్నెలమీద మండుతున్న ఎండవేడి తెలీటంలేదు. సంధించి విడిచిన బాణంలా రయ్ న ఒక్క పరుగుతో కుందేటి గట్టుకు చేరింది ముత్తెం.

                         "ఈడ్నించే నాగుంది... అయ్య పూలు తెత్తాడు" అనుకుని కిందికి ఏట్లోకి తొంగిచూసింది. ముత్తెం. నిండా ఎంతో ఆనందం, ఆత్రుత, గట్టుకు ఆనుకుని ఏటిచుట్టూ ఏవేవో చెట్లు, పొదలు.. ఏటిమీంచి వీస్తున్న గాలి ఎండ తీవ్రతను తగ్గిస్తోంది. ముత్తెం క్షణం ఆగి అలుపు తీర్చుకుంది. రోడ్డుకంటే ఎత్తుగా ఉన్న గట్టు మీదకి వచ్చి నిలబడింది. చింకిరిబింకిరిగా కళ్ళకడ్డుపడుతున్న వెంట్రుకలు పైకి తోసుకుంటూ కిందకు తొంగి చూసింది. కింద పెద్ద వలయంలా నీటి గుంట ఉంది. చుట్టూ అంచున లెక్కలేనన్ని తుప్పలు, పొదలు, ముళ్ళ మొక్కలు గజిబిజిగా అల్లుకొని ఉన్నాయి. ముత్తెం కళ్ళు చురుగ్గా తిప్పుతూ చుట్టూ చూసింది. 'ఈడ్నించే తెత్తాడా.... అయ్య పూలు... మరేటి మొగిలిపూలేడా అగపడవే...' అనుకుని ఆశ్చర్యంగా చుట్టూ చూస్తోంది. దట్టమైన చిట్టడవిలా ఉన్న ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉంది. ఏటికి ముందు భాగంలో దూరాన కొంతమేర రేవుగా చేసుకుని నీళ్ళకు వాడుకుంటారు. లోపలికి ఆవేపు, ఈవేపూ ఎవ్వరూ రారు. పూలమీద నిలవనీయని కోరిక ముత్తేన్నిలా తరుముకువచ్చింది.మొగలిపూలను వెతుక్కుంటూ గట్టంట అడుగులో అడుగేసుకుంటూ నడుస్తోంది ముత్తెం. తీరానికి అటు ఇటు అంతా మొగలి పొదలే. కాని పూలులేవు. ముత్తేనికవే మొగలి మొక్కలని తెలీదు. తీగెలు, తుప్పలు తప్పించుకుంటూ నడిచి నడిచి గట్టు మధ్యకు వచ్చేసింది. 

                            "ఈడాలేవు పూలు.. ఏటిసేద్దారి! అయ్యొచ్చేత్తాడేమో.. పొద్దోతోంది' అనుకుని నిరుత్సాహంతో వెనుతిరగబోతుండగా మురిపిస్తూ పొదల్లోంచి చూసిందో మొగలిమొగ్గ. అటు ఇటు కలవరంగా చూస్తున్న ముత్తెం కళ్ళు తళుక్కున మెరిసాయి. చుట్టూ కమ్మి ఉన్న ముళ్ళ ఆకుల మధ్యలోంచి లేలేత బంగారు రంగులో  మిలమిల మెరుస్తున్న పువ్వును చూసి ముత్తెం టక్కున ఆగిపోయింది. ఆశ్చర్యంతోను, ఆనందంతోను ఆ చిన్నారి ముఖం వికసించింది.

                              "అగో... అదే మొగిలిపువ్వు.., బలే బలే..." అని అలసట మరచి ఆ పువ్వు కోసుకునే ప్రయత్నంలో పడింది.చేతిలో బారెడు పొడవున్న కర్రపుల్ల ఉంచుకొని చిన్న చిన్న అడుగులు జారకుండా నడుస్తూ గట్టుకిందకి వచ్చింది. "అయ్యకీపూ అగపడ్నేదు నాగుంది. అందుకే ఒగ్గేసిండు..." అనుకుంటే మనసెంతో సంభ్రమంతో నిండిపోయింది. పువ్వు తన సొంతమైపోయినట్టే మురిసిపోతూ దగ్గిరగా వచ్చేసింది. కర్ర కొన చీల్చి చీలికల మధ్య చిన్న పుల్లముక్క ఉంచి గుడ్డ పేలిక ముడేసింది. ఆమడ దూరంలో నిలబడి ముందుకు వంగి పువ్వు వంక చూస్తూ.. కర్ర పొదలో గుచ్చి లాగింది. పువ్వు తెగలేదు. మళ్ళీ బలంగా లాగింది. పొద కాస్త కదిలింది. పళ్ళు బిగించి బలమంతా పెట్టి లాగింది. మొగలిపొత్తు తెగి కర్రతో పైకి వచ్చింది. 'వచ్చేసినాది... అబ్బ... ఎంత పెద్ధ పువ్వో.... ఎంత బాగుండాదో..' అని పొంగిపోతూ కర్రలోంచి పువ్వును పదిలంగా తీసుకుంది. 'బేగి గుడిసెకి పోవాల... అయ్యకి పూ సూపింసాల.... అయ్యా ఏటంటాడో? అక్కసేత తలసుట్టు పూలల్లించుకోవాల....' అపురూపంగా పువ్వు సందిట పొదువుకుని ఒక్క ఉదుటున గట్టెక్కి రోడ్డుమీదకి వచ్చేసింది ముత్తెం.

                               మునిమాపువేళయింది. ముసిలయ్య పూల అమ్మకం పూర్తి చేసుకుని ఇంటిముఖం పట్టాడు. తడిగుడ్డకు చుట్టి అతని చేతిలో ఉన్న ఒకే ఒక్క మొగలిపొత్తు దోవంతా పరిమళాలు విరజిమ్ముతోంది. 

                              "ఇదిగో అబ్భాయ్... మొగలిపూలేనా! ఇటు తీసుకురా" అన్న పిలుపు విని చప్పున ఆగిపోయాడు. పెద్ద మేడముందు గేట్లో నిలబడి పిలుస్తోందో యువతి. పక్కనే ఓ చిన్న పిల్ల... పువ్వు కొనమని అమ్మని సతాయిస్తూ.. మారం చేస్తూ.

                              "కొంటానన్నాగా.. ఉండు.. రానీవాడ్ని..." అని సముదాయిస్తోంది తల్లి. ముసిలయ్య అటు చూసాడు. 'పువ్వు కోసం మారాం చేస్తున్నట్లుంది పిల్ల.. బేరం అడగకుండా కొంటదేమో...' ముసిలయ్య మనసు ఊగిసలాడింది. అడుగు వెనక్కి వేయబోయి ఆగిపోయాడు. 

                              "ఇది అమ్మడానికి కాదమ్మా" అనేసి కదిలాడు అక్కడ్నించి. వెనుకనుంచి చిన్నిచిన్ని పాదాలతో నేలని తన్నుతూ "అమ్మా.... పువ్వే.." అని ఆ పిల్ల ఏడుస్తూ మారాం చేయటం వినిపిస్తోంది. ముసిలయ్యకు ముత్తెం గుర్తుకువచ్చింది. తలనిండా పూలు కుట్టుకుని సంబరపడిపోయే కూతుర్ని తలుచుకుని మురిపెంగా నవ్వుకున్నాడు. ఇన్నాళ్ళకి పిల్లకోరిక తీరుతోందన్న సంతోషంతో త్వరత్వరగా నడిచి గుడిసెకి వచ్చేసాడు. "ముత్తెవా.. అమ్మాయ్... ముత్తెవా... బేగిరా.." అని అంత దూరంలోంచే పిలుస్తున్నాడు. "తను చేతిలో పువ్వు పెట్టినపుడు చూడాలి పిల్ల ముఖంలో ఆనందం..." తలుచుకుంటేనే ముసిలయ్య మనసంతా కూడా పులకరించిపోతోంది. "తనేం కట్టపడ్డా పిల్లదాన కోసమేగందా.. ఓ రెండ్రోజులు గంజి తాక్కుంటే సర" కష్టపడినా, నష్టపడినా ముద్దులకూతురి ముచ్చట కాదనలేని తండ్రే ముసిలయ్య. మరి అయ్య పిలుపుకి ముత్తెం బయటకి రాలేదు. ఎప్పుడూ ఆయాలకి గుడిసె ముంగిల పిల్లోళ్ళతో ఆడుకుంటూ అంత దూరంనుంచే పరుగున వచ్చి "అయ్యా... వచ్చేసినావా" అని సంబరపడుతూ కాళ్ళకు చుట్టేసుకునే కూతురు ఎదురుపడకపోయేసరికి ముసిలయ్య ఆరాటపడ్డాడు. గుడిసెలోపల, బయట అంతా వెదికి, ముత్తెం సావాసగాళ్ళను కూడా అడిగాడు. "మాకు తెల్దంటే.. మాకు తెల్ధన్నారు వాళ్ళు.." బిడ్డ ఎక్కడికి పోయిందో?" అని ఆలోచిస్తూ, ఎదురుచూస్తూ గుడిసె ముంగిట్లోనే కూలబడ్డాడు ముసిలయ్య. బిడ్డ క్షణం అవుపడకపోతే అతనికి కూడుసయించదు.

                             ఇంతలో వెనక నుంచి పరుగుపరుగున రొప్పుతూ వచ్చి "అయ్యా.. వచ్చీసినా" అంటూ అయ్యా మెడను వాటేసుకుంది ముత్తెం. ముసిలయ్య అలవికాని ఆనందంతో బిడ్డను దగ్గరకు తీసుకున్నాడు. "ఏడకి బోయావమ్మా ఎవురికీ సెప్పకుండా.." ముత్తెం తండ్రి మాటకు బదులివ్వకుండా "అయ్యా.. నువ్వు కల్లు మూసుకో ముందు.." అంది గుబులు తీరిన గుండెతో ఆనందంగా నవ్వి. "ఏట్రా బంగారూ.. ఎందుకమ్మా" అన్నాడు ప్రేమగా. "కల్లు మూసుకోమన్నానా... కల్లు మూసుకుని సెయ్యట్టు.." అంది ముత్తెం వదలకుండా. "ఊ.. సరే" ముసిలయ్య కళ్ళుమూసుకున్నాడు నవ్వుకుంటూ. సాచిన అయ్య అరచేతిలో మూసిన తన గుప్పెట ఉంచి వదిలింది ముత్తెం. "ఇగ సూస్కో" అంది పకపకలాడుతూ. 
Google image

"ఏట్రా నానా.." అంటూ కళ్ళుతెరిచిన ముసిలయ్యకు అరచేతిలో చమటకు తడిసిన రెండ్రూపాయల కాగితం కనిపించింది. అంతులేని ఆశ్చర్యంతో చూస్తున్న అయ్యతో " ఏటయ్యా.. అట్టా సూత్తవ్..మందే ఆ డబ్బు.. కుందేటికి పోయి మొగిలి పూతెచ్చినానయ్యా.. ఓయమ్మడిగితే అమ్మేసినా..." ముసిలయ్య కూతురిని అపురూపంగా దగ్గరకు లాక్కున్నాడు. "ఇంకెప్పుడు ఆడకి పోమాకమ్మా.. పురుగు, పుట్ర ఉంటది... నీకేటైనా అయితే నే బతగ్గలనా.. సెప్పు" అంటూ కన్నీళ్ళతో, చేతిగుడ్డను చుట్టి తను తెచ్చిన పువ్వు ఆప్యాయంగా కూతురి కందించాడు. ముత్తెం నిదానంగా, నిరాసక్తంగా పువ్వు వంక చూసింది. "నాకెందుకయ్యా పువ్వు? అమ్మితే నూకలు కొనుక్కోచ్చుగందా.. నానూ అందుకే పూ అమ్మేసినానయ్యా.." ముసిలయ్య వింతగా కూతురి వంక చూసాడు. బతుకు భారం అప్పుడే మీదపడినట్లు అలసటగా ఉంది. తలరేగి, అక్కడక్కడా గీరుకుపోయి, దుమ్ముకొట్టుకుని ఉంది వళ్ళంతా.

                       నీరసంగా ఉన్న ఆ పసిముఖంలో చిరునవ్వు మాటున ఏదో తృప్తి...!

(అయిపోయింది. నిజానికి ఉదయాన్నే పోస్ట్ రాసిపెట్టేసానండీ.. లాస్ట్ లైన్ రాస్తూ ఉండగా పవర్ కట్ :(. 9 to 5. అందుకే ఆలశ్యమయింది. మొత్తానికి నాకెంతో నచ్చిన ఈ కథ మీకూ నచ్చిందనే ఆశిస్తున్నాను.. )  

మొగలిపూలు

 మొన్న నాకేమి తోచక ఏదో పుస్తకాలు తిరగేస్తుంటే ఈ కథ కనిపించింది. ఎందుకోగాని చాలా నచ్చింది. మీరూ ఓసారి చదివి చూడండి.
Google image

మే నెల.. ఎండ మండిపోతోంది. ఉదయం కాకుండా సూర్యుడు తాపాన్ని కుమ్మరిస్తున్నాడు. తెల్లవారుజామునే కుందేరుగట్టుకు పోయిన ముసిలయ్య అతికష్టం మీద నాలుగు మొగలిపొత్తులు పొదల్లోంచి తుంచేసరికి బారెడు పొడుగున ఎండెక్కేసింది. "ఇయాల్టికింతే.. మర్రొండ్రోజులదాకా పండవు పూలు"అనుకుంటూ మొగలిపూలు ఎండ వేడికి తగ్గకుండా పచ్చి ఆకుల్లో చుట్టి పదిలంగా పట్టుకున్నాడు. గట్టు దిగి రోడెక్కి వడివడిగా ఇంతింత అంగలు వేసుకుంటూ టౌన్ వైపు నడుస్తున్నాడు ముసిలయ్య. టౌన్లో బస్టాండ్ అతని వ్యాపార స్థలం. తన వాడకట్టలో పూలు కొనేవాళ్ళేవరూ లేరు. అక్కడంతా గంజికి గతి లేని కడుపేదలే. ఇక పూలకీ, సరదాలకీ ఎక్కడ తేగలరు? తలకి చవురే ఉండదు.. ఇక సిగలోకి పూలెందుకు? ఊళ్ళో అయినా ముసిలయ్య ఇంటింటికీ తిరిగి పూలమ్మడు. వేసవిలో కొల్లలుగా వచ్చే మల్లెలు, జాజులు, విరజాజులు, కనకాంబరాలు.. వీటికే మోజుపడతారు.ఆ మాలలు రోజూ విధిగా తలలో తురుముకుంటారు గాని, మొగలిపూలు కొనరు. మొగలిపూలకి అందం తక్కువ, పరిమళం ఎక్కువ. మిగతా అన్ని పూలకుండే సౌకుమార్యం, అందం మొగలిరేకుకుండదు. దాన్ని మాలగా కట్టుకోవడం కష్టం. ప్రత్యేకమైన పద్ధతిలో పువ్వులా అల్లి తలలో ముడుచుకోవాలి. పూలబజార్లో పావలాకి దోసెడు మల్లెలు పోస్తారు. పది పైసలిస్తే మరువం పెడతారు. ఒక మొగలిపొత్తు కనీసం రూపాయైనా ఉంటుంది. ఇక ఎవరు కొంటారు? అందువలన ముసిలయ్య వీధుల్లోకి తిరిగి పూలమ్ముకోవడం మానుకున్నాడు. అందువల్ల శ్రమే కాని ఆదాయం కనబడలేదు అతనికి. 

               పీర్లసావిడివద్ద ఆగాడు ముసిలయ్య. నేర్పుగా నాలుగు నిండుపొత్తుల్ని ఆరింటిక్రింద తయారుచేసాడు. లేకపోతే మళ్ళీ రెండు మూడు రోజులకు పూలు విచ్చుకునే వరకు పస్తే. చిరిగిన పైగుడ్డకు మొగలిపొత్తులు చుట్టి మళ్ళీ వేగంగా నడక సాగించాడు.  అక్కడినుండి రెండు మూడు మైళ్ళు నడిస్తే టౌన్ బస్టాండ్ వస్తుంది. అక్కడే ముసిలయ్య పూలకి కాస్త గిరాకి. కాయాకష్టం చేసుకునే పడుచుపిల్లలు, పుట్టింటినుండి అత్తింటికో, అత్తింటి నుండి పుట్టింటికో, మరో అన్నగారింటికో పోతూ ప్రయాణంలో పూలు, పళ్ళు కొనుక్కుంటారు. ముఖ్యంగా ఆ పల్లె పడుచులే ఈ మొగలిపూలు ఎక్కువగా ఇష్టపడతారు. 

              ముసిలయ్య నడుస్తునే ముఖం మీంచి దిగకారుతున్న చెమటలు చేత్తో తుడుచుకున్నాడు. నిమిష నిమిషానికి ఎండ తీవ్రత పెరిగిపోయి నిప్పులు కుమ్మరిస్తున్నట్లుంది. ముసిలయ్య సన్నగా, పొడవుగా, గాలివాటుకి వంగిపోయిన సర్విబొంగులా ఉంటాడు. పీచులు రేగి, ఎండుగడ్డిలావున్న పల్చనిజుట్టు, కండనేది లేకుండా కేవలం ఎముకల్ని కప్పివుంచిన చర్మం, పీక్కుపోయిన ముఖంలో ప్రస్ఫుటంగా అతికినట్లు కనిపిస్తున్న పెద్ద పెద్ద మిడిగుడ్లు... బారుగా వున్న నల్లని తారురోడ్డు మీద నడుస్తూనే ఉన్నాడు ముసిలయ్య. అతనికా నడకలవాటే! ఎండా, వాన, ఉదయం, సాయంత్రం ఇవేమీ పట్టవు ఇతనికి. అతని పాదాలు నిప్పులమీధైనా వడివడిగా నడవగలవు. ఎండలో నడిచి నడిచి కాయలు కాసిన ఆ పాదాలకు వేడి బాధ తెలీదు. నల్లని దుమ్ముకొట్టుకొని ఉన్న ఒళ్లంతా చమటకు చితచితలాడుతూ బురద పూసుకున్నట్లుంది. తన చేతిలోని మొగలిపూలు దారినపోతున్న ఏ ఆడపిల్లనైనా ఆకర్షిస్తాయేమోనని ఆశ. కదులుతున్న ఎర్రని గుడ్డతో అడపాదడపా అటు, ఇటు చూస్తున్నాడు.  

              అలా నిర్లిప్తంగా నడుచుకుంటూ అదిగో... టౌన్ బస్టాండ్కు వచ్చేసాడు ముసిలయ్య. ఒక్కక్షణం ఆగి ఎండి ఎముకలు కనబడుతున్న గుండెలనిండా గాలినింపుకొని ఒగుర్పు తీర్చుకున్నాడు.

              "మొగలిపూలు....  మొగలిపూలు" అంటూ బొంగురుగా అరుస్తూ బస్సుల్లో ఆడ ప్రయాణికులు కూర్చున్న కిటికీల దగ్గర ఆగి, ఆగి తిరుగుతున్నాడు.  

              "ఇదిగో.. ఎంత?"

              "రెండ్రుపాయలు..."
              "అబ్బో..! రూపాయే గదయ్యా"
              
               ముసిలయ్య తొందరపడదల్చుకోలేదు. ఇంకా టైముంది బస్సు కదలడానికి. ఒంగోలు బస్ దగ్గరకు వెళ్ళాడు ముసిలయ్య. బస్ కదలబోతోంది. డ్రైవరేక్కేసాడు. కండక్టర్ రైట్ కొడుతున్నాడు. చప్పున ఒక పిల్ల పిలిచింది. కిటికీలోంచి రెండ్రూపాయలిచ్చి ఒక పొత్తు అందుకుంది. 'ఆ పిల్ల కళ్ళలో మొగిలిపువ్వు మీద ఎంత ఆపేక్షో..' ముసిలయ్య గుండె అదోలా అయింది. 'బేరమాడకుండా చెప్పినంతా ఇచ్చింది పిచ్చితల్లి' ఆ పోత్తునిండా లేత రేకులుంచితే బాగుండేది' బస్సు కదిలిపోయింది. ఇందాకటి పేట బస్సు కదలబోతోంది.

                "రూపాయిన్నరియ్యమ్మా!" అన్నాడు ముసిలయ్య కిటికీ దగ్గర నిలబడి. ఆ పిల్ల లోపల్నించి కొసిరింది. "రూపాయి పావులా ఇత్తా" బస్సు హారను మోగింది. ఆలస్యం చేస్తే బేరం పోతుంది. ముసిలయ్య ఇక ఆలోచించకుండా రూపాయి పావులా పుచ్చుకొని మొగలి పొత్తందించాడు. 

              ఇలా చాలాసేపు తిరిగి అయినకాడికి మొత్తం పొత్తులమ్మేసాడు ముసిలయ్య. అసలు పన్నెండు రూపాయలు రావాలి. పదన్నా వస్తాయనుకున్నాను. ఎనిమిది రూపాయలే గిట్టాయి.

              చిల్లర రొంటిన దోపుకొని ఇంటిముఖం పట్టాడు ముసిలయ్య. త్రోవలో షావుకారు దగ్గర 'సోలెడు నూకలు.. పావులా చింతపండు... పదిపైసల ఉప్పు.. పావులా మిర్చి.. నీరుల్లి కట్టించుకున్నాడు.

             'నోనంతే గంజిలో మిరపకాయో, ఉప్పుగల్లో నంజుకొని తినీగల్ను.. పసిది... పిల్ల అల్లాడిపోద్ది.. రోంతపచ్చడి నూరితే సరిపోద్ది'....

              ఊరి చివర పోరంబోకు స్థలంలో ఒక మూలగా ఉంది ముసిలయ్య గుడిసె. భుజాన మూట వేలాడేసుకుని చేతులూపుకుంటూ వస్తున్న అయ్య దగ్గరకు గెంతుతూ వచ్చింది పదేళ్ళ ముత్తెం "అయ్యా.. అప్పుడే వచ్చేసినావా... ఎన్ని పూలమ్మినావే?" అని అడుగుతూ

              "అయన్నీ ఆనిక సెప్తాగాని బేగెల్లి పొయి ముట్టించుతల్లీ! రోంత గంజి కాసుకుందాం" అయ్యమాట వింటూనే గెంతుకుంటూ వెళ్ళింది ముత్తెం. గుడిసె ఇవతల మూడురాళ్ళు పేర్చి అమర్చిన పొయ్యిలో ఎండుచితుకులు రెండువేసి మంట చేసింది. కుండలో నీళ్ళుపోసి ఎసరు మరుగుతుంటే రెండు పిడికిళ్ళు నూకలు పోసాడు ముసిలయ్య. చిన్న బండమీద గుంద్రాయితో ఉల్లిపాయ, చిట్టెడంత చింతపండు, చిటికెడు ఉప్పు వేసి పచ్చడి తయారుచేసాడు. అయ్యా చల్లార్చి చేసిన గంజి తాగుతూ "అయ్యా....... మరే.... మరే....." అని సణుగుతుంటే "ఏటే తల్లా... మరే... మరే... అంటావేగాని ఏటో సెప్పవే...." అంటూ నడుం వాల్చాడు ముసిలయ్య. ఊరిచివర ఆరుబయలు ప్రదేశంలో గాలి నిరాటంకంగా వీస్తోంది. 

               కుందేరు సమీపంలో ఉన్న గుడిసెల మీదకు ఏటిమీంచి చల్లని గాలి తెరలుతెరలుగా వీస్తోంది. పొట్టనిండా ఉప్పుగల్లు నంజుకొని నూకలగంజి తాగాడేమో ముసిలయ్యకు కళ్ళుకూరుకొస్తున్నాయి. కటిక నేలమీద వాలి జోగుతున్న వాడల్లా.... " అయ్యా.... అయ్యా" అన్న ముత్తెం గుణుగుడు విని కళ్ళు తెరిచి "ఏటే బంగారు..... సెప్పవే?" 

               "అయ్యా మరే... రేపే....."
               "ఊం బేగిసెప్పమ్మా... నాకు తూలొస్తుంది"

               "అయ్యా మరే.... రేపే నాకో మొగిలిపోత్తియ్యవే" అంది గోముగా, అయ్య బొజ్జ మీద చిట్టిచేత్తో ప్రేమగా నిరుమతూ.
                "ఓలమ్మో... మొగిలిపోత్తే......... ఎందుకమ్మా నీకు?"
                 "ఎందుకేతి.... తలలో ఎత్తుకుంతానే" గుండ్రటి చిన్ని కళ్ళు ఆశగా తిప్పుతూ ఎర్రనూలు ముక్క ముడివేసి వేలెడు పిలక జడ ముందుకి వేసుకొని ముద్దుగా చెప్పింది ముత్తెం.

                ముసిలయ్య ప్రేమగా నవ్వాడు. "అబ్బోసి.....! నీ పిలక జెడకి మొగిలిపొత్తు కావాలంటే..... అద్సరేగాని ముత్తెవా! వోరు కుడతారే నీకు తల్లో పూలు" అంటుంటే పిల్ల తల్లి గుర్తొచ్చినట్టుంది. ముసిలయ్య గొంతు కదిలింది.

                "పోలక్క  కుడతదయ్యా...... ఇంచక్కా చిన్ని చిన్ని పూలు కట్టి జడనిండా కుడ్తది. ఇంచక్కుంటుందో.... అయ్యా ఒక్క పొత్తియ్యవే.. ఊ!"

                 "ఏటి ఒకపొత్తే......"
                 "ఊ ఒక్క పొత్తేగదయ్యా...." 
                 "మొగిలిపొత్తంటే మాటలే ఎర్రిపిల్లా... రెండ్రూపాలు"
                 
                 "అయితే ఏటేటి..." అలకగా మూతి ముడిచి గరుస్తూ అడిగింది ముత్తెం. కూతురు బుగ్గ పుణికి "ఏటీనేదే.. సిట్టితల్లే.. మొగిలిపూ నువ్ తల్లో ఎట్టుకుంటే మనయాపారం ఏంగావాలమ్మా.... గంజిలోకి నూకలేట్టొత్తాయే..." అనునయిస్తూ అన్నాడు ముసిలయ్య. 

                  అయ్య పూలమ్మి పైసలు తెస్తేనే అయ్యాల కూడని ముత్తేనికి తెలిసింది. అయినా తనడిగింది ఒక్క పొత్తేగందా! ముత్తెం మరేమీ మాట్లాడలేదు. పసిదాని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్న నిరుత్సాహం ముసిలయ్య గుండెను కదిలించింది. 

                   "అట్టా దిగులు పదమాకే తల్లా... సూద్దార్లే... ఈతూరి ఎక్కువ పొత్తులు దొరుకుతే తీసుకుందు" ఆ ముక్కకే ముత్తెం ముఖం ఇంతైంది....... ఆనందం దీపంలా ముఖమంతా వెలిగింది. సంతోషంగా కేరింతలు కొడుతూ ఆడుకోవడానికి వెళ్ళింది. రోజూ మొగలిపూలు కుట్టుకుని... చాకింటి గౌను వేసుకొని ఆడుకుంటున్నట్లు ముత్తేనికి ఎన్ని కలలో.............

                    రోజులు గడుస్తున్నాయి గాని అయ్య పువ్వు ఇవ్వనేలా! పిల్ల మనసులో ఆరాటం, కోరిక పెరిగిపోతోంది. (ఇంకా ఉందండీ.. అంతా దీనిలోనే రాస్తే పెద్దగా కనిపించి విసుగొస్తుందేమో అని, కథని రెండు భాగాలుగా రాస్తున్నాను. భయపడకండీ "నా ప్రేమాయణంలా" లా దీని నెక్స్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ని ఆలశ్యంగా పోస్ట్ చేయను :). మరికాసేపట్లో పోస్ట్ చేసేస్తాను. ఎందుకంటే అన్నిసార్లూ మీ ఓపికకి పరీక్ష పెట్టి మీతో అక్షింతలు వేయించుకోవడం నాకిష్టంలేదు :) ఇంతకూ కథెలా ఉంది??)