Thursday, December 11, 2014

రండి రండి

హమ్మయ్యా! Finally!! 

కొత్త ప్లేస్ కి వచ్చేశాం. చక్కటి ఇల్లు, అంతకంటే చక్కటి ఇంటి ఓనర్లు. ఊరి చివర ఉండడం వలన ట్రాఫిక్ గోల లేదు. చుట్టూ కొబ్బరి చెట్లు, చెరువులు, పొలాలు. ఎంత బావుందో! 

'అదిగో, ఇదిగో..  ఈవేళ, రేపు' అని ఊరించిన ఇంటర్నెట్ కనెక్షన్ మొన్న వచ్చింది. బోల్డన్ని కబుర్లున్నాయి చెప్పడానికి. "ఈ మధ్య ఈ పిల్ల అసలేమీ రాయడంలేదు. ఇక చూడ్డం అనవసరం" అని విసుక్కుని ఉంటారని తెలుసు. కాస్త ఈ ఒక్కసారికి మన్నించేసి, మీ అలకను పక్కన పెట్టి సిద్దమైపోండి. ఈలోపు పోస్ట్లు రాస్తూ ఉంటాను నేను. ఏవంటారు? 

Tuesday, September 23, 2014

దా బావా.. పోదాము!!

మొన్నొక రోజు పెయింటింగ్ చేసినంత శ్రద్ధగా నేను గుమ్మడి పులుసు చేసుకుంటోంటే లోపలికి వచ్చారు బావా మరదళ్ళిద్దరూ. రావడమే చెరో బీన్ బాగ్ లో పక్కపక్కన సెటిల్ అయ్యారు.

"లల్లీ.. రా రా రా" "ఏంటి ప్రీతం ఈ వేళ స్కూల్ కి వెళ్ళలేదా?" పలకరించాను ఇద్దర్నీ.

"బావ పోలే. చూల్ కి. ఆతాడుతుంతునాం" చేతిలో ఉన్న బొమ్మను చూపిస్తూ చెప్పింది లల్లి.

"ఊహు. మా మమ్మీ... .. నన్నందీ స్కూల్ కి పొవొద్దూ, నీకు జొరంగుందని"  "ప్రియక్కా.. నీకు తెల్సునా నాకెంత జొరముందో... .. అస్సలు బుడ్డిదానికైతే చెయ్ కాలిపోయింది!" గొప్పగా చెప్పాడు ప్రీతం.

"జ్వరమా? ఏదీ చూడని.." వాడి నుదుటి మీద చెయ్యి పెట్టాను.   

"పీక్కా (ప్రియక్కా).. ఏంతి మా బావ చే పత్తునావూ? వొదియ్" ప్రీతంగాడి వైపు తిరిగి, "పేద్ద. దా బావా పోదాము" అంది ఉడుక్కుంటూ.

నవ్వొచ్చింది నాకు. "మీ బావ చెయ్యి నేనెక్కడ పట్టుకున్నానే? జ్వరమెంతుందో చూద్దామని నుదుటి మీద చెయ్యి వేశాను. అయినా మరీ బావుంది. ఏం.. మీ బావని తాకితే మాసిపోతాడుటే?" నిష్టూరమాడాను.

"జలమా (జ్వరమా). ఆ చెప్పుతా" లేచి వాడి దగ్గరకెళ్ళి, జ్వరం చూసే పేరుతో వాడి కళ్ళు మూసి, "పీక్కా.. పోయే. జలమంతా పోయే" సినిమాల్లో ఆపరేషన్ సక్సెస్ అయినపుడు డాక్టర్ మొహం పెట్టినట్లు పెట్టింది.

"మ్మ్.. నిజమా??! ఇందాక నే చూసినపుడు ఉందిగా మరి?" ఆశ్చర్యంగా మొహం పెట్టాను.

మొహమంతా చిట్లించి "లే పీక్కా. చల్లుంతే (చల్లగా ఉంటేనూ అనన్నమాట :P). నువ్వు చే పెత్తు" ప్రీతం మాత్రం ఇవేవి పట్టించుకోకుండా నా టాబ్ తో ఆడుకుంటున్నాడు.

"నేను చూడను పో. ఇందాక పెట్టొద్దన్నావ్ గా?" అలిగినట్లు మూతి ముడిచాను.

దానికెంత కోపం వచ్చేసిందో! నావైపు చుర చురా చూసి "పేద్ద. దా బావా పోదాము" వాడేమో సబ్వే సర్ఫేస్ తో బిజీగా ఉన్నాడాయే.. ఇంకెక్కడ పట్టించుకునేది?

"అవునా..? సరే ప్రీతం. వెళ్ళిపొండి. అయితే బెల్లం నేనొక్కదాన్నే తినేస్తాను" పులుసులో వేయడానికని పెట్టిన బెల్లం చేతిలోకి తీసుకుంటూ అన్నాను.

కళ్ళింతింత చేసుకుని, తియ్యటి నవ్వుతో నా దగ్గరకొస్తూ "పీక్కా బత్తన్న (భరత్ అన్న) తెచ్చింద? ఎదీ పెత్తు" అడిగింది.

ఈలోపు ఓ బిస్కెట్ పాకెట్టూ, స్కెచ్ పెన్నూ పట్టుకుని లోపలి వస్తూనే "దీదీ.. I need a book" అంటూ లోపలికి వచ్చింది శాన్వి. దాన్ని చూడగానే ప్రీతం, చేతిలో ఉన్న టాబ్ ని పక్కన పెట్టేసి స్ట్రైట్ గా కూర్చున్నాడు. నేను ఊరిపి పీల్చుకున్నాను.  హమ్మయ్యా బ్రతికిపోయింది నా టాబ్, అని :-P.

శాన్వి వచ్చి ప్రీతం పక్కన కూర్చుంది. వెంటనే లల్లీ లేచి వచ్చి తను కూడా వాళ్ళిద్దరూ కూర్చున్న దాని మీదే ఎలాగో సర్దుకుంది. కూర్చోవడానికి ఓ బీన్ బాగ్ ఖాళీ అయినందుకు నేను హ్యాపీ :).

ప్రీతం తన జ్వరం కథను శాన్వికి వివరించాడు. దానికి తను "Oh! I also got fever so many times. But... I still went to school... you know? My mamma said, .. .. only..  bad children will sit at home on school days" గుక్క తిప్పుకోకుండా సీరియస్గా లెక్చర్ ఇచ్చేసింది.

పాపం ప్రీతంకి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. "నువ్వే బాడ్ గాళ్" అనేసి దాని చేతిలోని బిస్కెట్ పాకెట్ తీసుకుని తింటూ కూర్చున్నాడు. నేను నవ్వుకుంటూ కిచెన్ రూం లోకి వెళ్ళిపోయాను. ఏవో వాదనలు వినిపిస్తున్నాయి గానీ పట్టించుకోలేదు. ఓ ఐదు నిముషాలకు శాన్వి ఏడుపు మొహంతో వచ్చి నా నడుముకి చుట్టుకుని "దీదీ..  Preetham.. ..  is eating ALL .......  my biscuits" అంది. "Ohh! It's okay baby. He is your friend, and sharing is a good habit right? Don't worry. I'll give you another packet" అని చెప్పాను. దానికి తను "Lalli baby took my sketch pen. And shez not giving me......  I want it for a minute దీదీ. Sharing is a good habit హేనా? You come and tell her" అంటూ నన్ను లాక్కెళ్ళింది.

నాకు తెలుసు ఆ కంచు నుండి ఒక వస్తువు తీసుకోవడం అసాధ్యమని :-P. కానీ శాన్వి తృప్తి కోసం వెళ్ళి లల్లిని బుజ్జగించి బ్రతిమాలాను. "యే... నాతి. నాతి" అంటూ చెయ్యి వెనుక దాచేసుకుంది. శాన్వి కి తెలుగు రాకపోయినా, అక్కడేం జరుగుతోందో అర్ధమయింది. చాల కోపం వచ్చేసింది దానికి. "దీదీ... you are saying please and still shez not giving na? Okay" అంటూ నడుం మీద చెయ్యి పెట్టుకుని కోపంగా, "Lalli baby, that pen is mine. Give me" అంది. లల్లి తన వైపు కూడా చూడలేదు. పాపం ఇది ఓ నిముషం చూసి ప్రీతం వైపు తిరిగి "Preetham, enough. That's my biscuit packet. Give it to me" అంది. వాడసలు ఏమీ వినబడనట్లే తింటూ తన పని తను చూసుకుంటున్నాడు. పాపం బేలగా నావైపు చూసింది. నేను నిస్సహాయంగా చూస్తూనే "It's okay. I'll get you another one" అంటూ దగ్గరకు తీసుకున్నాను. తను ఉక్రోషాన్ని ఆపుకోలేక "Get out. Both of you. Bad children.... I will not play with you again. Get out" అని అరిచింది. వెంటనే నా చేతిని తన నోటికి అడ్డు పెడుతూ "No, Saanvi. You shouldn't use such words. Say sorry to them" అన్నాను.

అప్పటి వరకూ ఏమీ పట్టనట్లు ఉన్న లల్లీకి కోపం వచ్చేసింది! చుర చురా లేచి "దా బావా పోదాము. పేద్ద. దా బావా" అంటూ ప్రీతం ని చైర్లోంచి లాగేసింది. వాడేమో కదలడంలేదు. "ఏమైంది? వెళ్ళిపోవాల్నా? శాన్వి అందా" అని అడుగుతున్నాడు.

ఇంతలో శాన్వి "But they took off my things and not giving me back.... దీదీ. They are...  bad children" అంది. "Yeah.. but its not that they are bad, baby. Sometimes small children will behave like that" అని సర్ది చెప్పబోయాను. తను వెంటనే "I am also small" అంది. నాకేం చెప్పాలో తోచలేదు. అంతలో మళ్ళీ తనే "It's okay" అని, తల దించుకుని "sorry" అంది.

లల్లి ఒక్కక్షణం శాన్వి వైపు చూసింది. మళ్ళీ వెంటనే "దా బావా పోదాము" అంటూ వాడిని లాక్కుంటూ బయటకు వెళ్ళిపోయింది!

మర్చిపోయిన బొమ్మని తీసుకువెళ్ళడానికి వచ్చినపుడు తీశాను ఈ ఫోటోని

హూం!!! Of-course, మరుసటి రోజు ముగ్గురూ మళ్ళీ కలిసిపోయి ఆడుకున్నారనుకోండీ. అయినప్పటికీ.. ఆ ... హహ్హహహ్! No comments.

ఏవండోయ్.. నో కామెంట్స్ అన్నది నా అభిప్రాయం చెప్పలేక. మరేం పరవాలేదు..  మీరేమనుకున్నారో కాస్త చెప్పి వెళ్ళండి :)

Friday, September 5, 2014

వెళ్లొస్తానే చెన్నై..!!

హ్మ్మ్! చెన్నై ని విడిచి వెళ్ళాలన్న ఆలోచన కూడా నాకెంత భారంగా, బాధగా ఉందో..! అప్పుడపుడూ ఓ నాలుగు రోజులకు అత్తవారింటికి ప్రయాణమైతేనే మనసు బిక్క మొహం వేస్తుంది. సెంట్రల్ లో ట్రైన్ ఎక్కి ఎక్కగానే బెంగ మొదలవుతుంది! అలాటిది ఇప్పుడు చుట్టం చూపుకు తప్ప ఇక్కడకు రావడం పెద్దగా జరగదన్న నిజం మరీ చేదుగా ఉంది.

ఎన్నెన్ని జ్ఞాపకాలు ఈ ఊరితో? అమ్మ ఒడిలో ఉన్నట్లే ఉంటుంది ఇక్కడ నాకు. నడక నేర్వడంతో మొదలు, నేటి వరకూ జీవితమంతా (మధ్యలో రెండు మూడేళ్ళు మినహా) ఇక్కడే గడిచింది. అసలు మా ఇంటిని వదిలి మరో ఏరియాకి వచ్చినందుకే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది! ఇహ ఇపుడు ఊరే వదిలి వెళ్ళడం అంటే, మూలిగే పిల్లి మీద పేద్ద పనసకాయ పడినట్లుంది.

"ఇకపై రోజూ బీచ్ కి వెళ్లి లేచి పడే అలలను చూస్తూ.. ఇళయరాజా సంగీతం కంటే శ్రావ్యంగా వినిపించే దాని ఊసులు వింటూ ప్రపంచాన్ని మరచిపోవడం కుదర్దు కదా? ఒంటరిగా నడిచినా ఏదో ప్రాణస్నేహితురాలితో నడుస్తున్నట్లనిపించే ఈ వీధులని విడిచి వెళ్లక తప్పదు కదా?" అని బాధపడిపోయాను అప్పుడు. అయినా, "ఏముందిలే.. అరగంట ప్రయాణం. అనుకున్నపుడల్లా చూసి వెళ్ళొచ్చు అని తమాయించుకున్నాను. ఇక్కడకు వచ్చాక నాకు ఏర్పడిన తియ్యని అనుబంధాలు ఇప్పుడు నా భారాన్ని మరింత పెంచుతున్నాయి.

శాన్వి, విజ్జి అక్క, లక్కీ. వీళ్ళ తోడే ప్రపంచం అయిపోయింది ఈ మధ్య. 5. 30 కి లేచి కింద ఉంటున్న విజ్జక్క కి ఫోన్ చేసి తననూ లేపి, ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్ళడం, వచ్చాక గబగబా స్నానం అదీ ముగించుకుని వంట చేసి భరత్ ని ఆఫీస్ కి పంపేసి లక్కీ గాడిని ఇంటికి తెచ్చుకోవడం. వాడికి పాలు పట్టే సమయానికి శాన్వి స్కూల్ నుండి వచ్చేస్తుంది. ఆ తరువాత 'ఇది జరుగుతుంది' అని చెప్పలేం. దాని మూడ్ ని బట్టి! అప్పటి నుండి రాత్రి వరకూ అన్నం, నీళ్ళు, నిద్రా అన్నీ నాతోనే. ఇక ఆటలు, పాటలు, కథలు, కబుర్లూ సరేసరి. మధ్య మధ్యలో నేను పని చేసుకుంటుంటే తన చిన్ని చిన్ని చేతులతో నాకు సాయం చేస్తుంటుంది. మొదట్లో భరత్ ఆఫీసు నుండి ఇంట్లోకి రావడమే ఇది వాళ్ళింటికి పరుగుపెట్టేదనుకోండీ... ఈ మధ్య తన బొజ్జ మీద పడుకుని కబుర్లు చెప్పుకునేంత క్లోజ్ అయిపోయారు!

వాళ్ళమ్మ, అదే.. విజ్జక్క అయితే "నాకు ఓ కూతురు ఉందన్న విషయం కూడా మర్చిపోతున్నాను. నాకు తను కావాలంటే నిన్ను దత్తత చేసుకోవాలి కాబోలు" అని నవ్వుతుంది. ఆమె మైండ్ సెట్ అచ్చూ నాలానే ఉండడంతో చాలా కొద్ది సమయంలోనే బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది నాకు.

ఇప్పటికి మీకు శాన్వి, విజ్జక్క ల గురించి క్లారిటీ వచ్చింది కదా? ఇప్పుడు లక్కీ గాడి గురించి చెప్తాను. వాడు మరెవరో కాదూ.. గీతక్క రెండో కొడుకు. మొన్న 12కి మూడో నెల వచ్చింది. వాళ్ళ పెద్దబాయి ప్రీతం కి తన తమ్ముడిని ఆక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉండి, చిన్నాణ్ణి పట్టుకుని కొట్టడం, గిల్లడం, పీక నొక్కేయడం లాటివి చేస్తున్నాడు. ఈ గోల తప్పించడానికి గీతక్క లక్కీ గాడికి పాలు పెట్టేసి నాకిచ్చేస్తుంది.

అలా సడెన్ గా నా లైఫ్ చాలా కలర్ఫుల్ గా మారిపోయింది. ఎంతగా అంటే, మరీ.. దేశ భక్తులెవరూ నా మీద గొడవకు రాకూడదు మరి? సరేనంటున్నారా? అయితే ఒకే :). నిజానికి చిన్నప్పటి నుండి మొన్న ఆగస్టు పదిహేను వరకూ ఆ రోజు సెలవు అన్న ఆనందం తప్ప ఇంకేమీ స్పెషల్ కాదండి నాకు. కానీ, ఈ ఏడాది నాకు ఆ రోజు ఎంత స్పెషల్ గా అనిపించిందంటే.. ప్రతి రోజూ ఆగస్టు పదిహేనయితే ఎంత బావుణ్నో అనిపించింది. ఎదుకంటే... మీరే చూడండి.హహ్హహ్హః! జైహింద్ చెప్పమన్నందుకు వాడి ఏడుపు 
ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని కత్తి పట్టుకుందే.. తనే నా డార్లింగ్! శాన్వి ప్రియ!!
చూశారా పిల్లలంతా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో? అబ్బా.. వాళ్ళ చేష్టలూ, కబుర్లూ వింటుంటే అసలు టైమే తెలియలేదు. I was completely lost.

లక్కీ గాడి గురించి చెప్పాలంటే మాటలు రావు నాకు. 'వాడు నా కొడుకే.. అప్పుడపుడూ గీతక్క తీసుకువెళుతుంది అంతే' అనిపిస్తుంటుంది :-P. వాడి ఉంగా ఉంగా కబుర్లూ, ఊ రాగాలతో నన్ను నేనే మర్చిపోతాను. ఎలా అంటే.. ఇలా!

 రోజూ మధ్యాహ్నం ఇదే జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో.  లక్కీ గాడిని నిద్రపుచ్చేసి శాన్వీ నేనూ ఆడుకుంటాం. నేను ఎక్కువసేపు వాడితో కబుర్లాడితే దానికి కోపం వస్తుంది. అంతెందుకూ? మొన్న అక్కావాళ్ళు ఇంటికొచ్చినపుడు నేను అభీ గాణ్ణి ఎత్తుకున్నానని శాన్వీ ఎంత అలిగిందో నా మీద!!

పుట్టింట్లో ఉన్నపుడు చినుకులు మొదలవగానే సైకిల్ వేసుకుని బీచ్ కి వెళ్ళడం, ఇక్కడకు వచ్చాక ట్యాంక్ ఎక్కి కూర్చోవడం అలవాటు. ఈ మధ్యైతే ఇదిగో.. ఇలా. తను నాకు అదేంత దూరంలోనే ఉన్నా, 'అయ్యో పట్టుకోలేకపోతున్నా.. చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నావ్.. అక్క పరిగెట్టలేకపోతోంది. ప్లీజ్ ఆగు' అని తనని బ్రతిమాలుకోవడం, దానికి నచ్చినపుడు దొరకడం. ఈలోపు నేను పట్టుకుంటే అది నా మీద అలిగి పోట్లాడడం. హహ్హహా!!! 

వర్షం కంటే తనతో ఆటలు నచ్చాయి నాకు. ఇందుకు విజ్జక్క కి థాంక్స్ చెప్పుకోవాలి. "జలుబుదేముందిలే.. వస్తే ఓ వారంలో తగ్గిపోతుంది. కానీ ఈ సంతోషం దానికి నేనేవిధంగా ఇవ్వగలను? రోజులు మళ్ళీ తిరిగి రావుగా? Let her enjoy" అంటుంది :)

గీతక్క, నేను, విజ్జి అక్క 
భరత్ కి ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ అవడం వలన వీళ్ళందరికీ దూరంగా వెళ్ళాల్సి వస్తోంది. అందుకు నాకు చాలా బాధగా ఉన్నా, అక్కడికి వెళ్ళాక నా జీవితంలోకి రాబోయే కొత్త స్నేహితులను తలుచుకుంటే ఉత్సాహంగా ఉంది. ఇదే కదా జీవితం?! లైఫే ఒక జర్నీ అయినపుడు ఒకే చోట ఆగిపోవాలనుకుంటే ఎలా..?? అలా అనుకుని పట్టిబట్టి మా ఇంట్లోనే ఉండిపోతే ఈ ఆనందాన్నంతా మిస్ అయ్యేదాన్ని కాదూ?? 

అందుకే, "వెళ్ళడం నీకు ఇష్టమేనా? లేదంటే వద్దని ఆఫీస్ లో చెప్పేస్తాను" అని భరత్ అన్నపుడు.. "ఇష్టమే.. వెళదాం. అత్తయ్య వాళ్లకు దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది" అని చెప్పాను. 

హూo.. వెళ్లొస్తానే చెన్నై..!!

Tuesday, August 19, 2014

ఉండ్రాళ్ళ కుండ

సాధారణంగా నా బ్లాగ్లో ఓ సారి పోస్ట్ పబ్లిష్ చేసిన తరువాత దాన్ని చదవను. ఎందుకో మరి.. పోయిన వారం నేను రీసెంట్ గా రాసిన పోస్ట్లు కొన్ని చూశాను. నిజం చెప్పనా... నా గురించి నేను ఇంత డబ్బా కొట్టుకుంటున్నానా అనిపించింది! సోది. ఏ పోస్ట్ చూసినా.. నేను, నేను, నేను, అనూ. నా ప్రేమ, నా పెళ్ళి, నా బొంద. హూం! ఇంతకు మించి అసలేమీ లేదు! కాస్త పాత పోస్ట్లే నయం. కొద్దో గొప్పో చదివేట్టున్నాయి. ఈ మధ్య రాసిన పోస్ట్స్ అయితే.. హహ్హ్హహ.. చదువుతున్నపుడు నాకే 'మరీ ఇంత సొంత సోదా?' అని కాస్త చిరాకుతో కూడిన సిగ్గుగా అనిపించింది.

"చూడు. ఇది 'నా' మనసులోని మౌన రాగం. మరి ఇందులో నా గురించే ఎక్కువ ఉంటుంది మరి. ఇందులో వింతేముందీ.. తప్పేముందీ?? ఊరుకుంటుంటే మరీ కూరలో కరివేపాకులా... .. అహ కాదులే ఈ మధ్య అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు! ఆగాగు ఇంకో ఎక్జాంపుల్ వెతుక్కుందాం.. మ్మ్ కూరలో నూనెలా తీసేస్తున్నావ్! అసలు ఈ పోస్ట్లు చదివాక నేనే 'ఏంట్రా లైఫ్ మరీ ఇంత బోరింగ్ గా సాగుతోందా? నా పెయింటింగ్స్ ఏవీ? నా ఫ్రెండ్స్ ఎక్కడ? నా ఆటలన్నీ ఎటు వెళ్లిపోయాయి? అమ్మో అమ్మో... ఈ ప్రేమా, పెళ్ళీ నా లైఫ్ లో నాకే స్థానం లేనంతగా ఆక్రమించేసుకున్నాయా??!!!!' అని బాధపడిపోతుంటే, రాసిందంతా సోదిలా ఉందీ చదివేవాళ్ళు ఏమనుకుంటున్నారో అని ఏడుస్తున్నావా! బుద్ధిలేదూ..?" అంటూ మనసు గోల!

మొత్తానికి ఈ ఆవేశంతో మళ్ళీ పెయింటింగ్ ల మీద పడ్డాను. చాలా రోజులయిపోయేసరికి ఏం చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియలేదు! కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంటే అప్పుడెప్పుడో Horsley Hills కి వెళ్ళినపుడు కొన్నానని చెప్పాను చూడండీ.. ఒక కుండ? అది కనిపించింది. వెంటనే దాని దుమ్ము దులిపి, దేనికైనా పనికొస్తాయేమోనని దాచిపెట్టిన పిస్తా షెల్స్ బయటకు తీశాను. పోయినసారి ప్లాస్టిక్ బాటిల్స్ తో ఏవో పువ్వులూ గట్రా చేసినవి పోస్ట్ చేస్తే, ఎలా చేయాలో కూడా చెప్పుంటే బావుండేది అన్నారు కదా..? అందుకే ఈ సారి మొదటి నుండీ ఫొటోస్ తీసి పెట్టాను :)పై ఫోటోలో కనబడుతున్న వస్తువులను చూసి బెదిరిపోకండి. 'ఇది చేయాలి, ఇలా చేయాలి' అన్న ప్లాన్ ఉన్న వాళ్ళకైతే ఆయా వస్తువులు మాత్రం చాలు గానీ.. ఏం చేస్తానో, ఎలా చేస్తానో తెలియని నేను మాత్రం అన్నీ దగ్గర పెట్టుకుంటే సడెన్ గా ఆలోచన వచ్చినపుడు పరుగుపెట్టే పని ఉండదు కదా అని అప్పటికి తోచినవన్నీ తెచ్చిపెట్టుకున్నాను :-P.

ఇంతకూ కావలసిన వస్తువులు ఏవిటంటే..: 1. కుండ, 2. చాల్క్ పౌడర్, 3. ఫెవికల్, 4. పిస్తా షెల్స్, 5. నీళ్ళు, 6. ఒక బౌల్/కప్, 7. స్పూన్, 8. మీకు నచ్చిన/తోచిన కలర్స్, 9. పెయింట్ బ్రష్, 10. ఓ వేస్ట్ క్లాత్. 
ముందుగా కుండని దుమ్ము లేకుండా తుడిచి పెట్టుకోండి. ఆ తరువాత పై ఫోటోలో చూయించినట్లుగా,  ఒక బౌల్ లో చాల్క్  పౌడర్ (ఎంతా? అని అడగొద్దు. ఎందుకంటే నాకూ తెలియదు. ఎంతో కొంత వేసుకోండి.. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. నేనూ అదే చేశాను) తీసుకుని, అందులో ఫెవికల్ వేస్తూ పేస్ట్ లా కలపండి. ఎంత ఫెవికల్ వేసినా ఆ పేస్ట్ గట్టిగానే ఉంటుంది కనుక కాస్త వాటర్ ఆడ్ చేసుకుని బజ్జీల పిండి టైప్ లో ఉండలు లేకుండా జారుగా కలుపుకోండి.ఆ తరువాత కలుపుకున్న పేస్ట్ ని స్పూన్ తో కొద్ది కొద్దిగా కుండ మీద వేస్తూ, వెంటనే దాని మీద పిస్తా గింజల్ని పై ఫోటోలో చూయించినట్లుగా అతికిస్తూ పనిలో పనిగా ఓ చెంచాడు పేస్ట్ ని అతికించుకున్న వాటి మీద కూడా వేయండి. లేకపోతే ఊడిపోతాయి!నేను అంచు దగ్గర షెల్స్ అంటించలేదు మరి. మీకు ఇష్టమైతే పూర్తిగా ఫిల్ చేసుకోవచ్చు. తరువాత బాగా ఆరనివ్వండి. ఆరాక బీటలు రావచ్చు. రావచ్చు కాదులెండి.. వస్తాయి. మళ్ళీ కొద్దిగా పేస్ట్ కలుపుకుని (ఈసారి ఇంకాస్త థిక్ గా) ఆ క్రాక్స్ మీద జాగ్రత్తగా అప్లై చేయండి. ఏమైనా పిండి మిగిలిపోతే సెకండ్ కోట్ లా వేసుకోవచ్చు.అది బాగా ఆరాక మీకు నచ్చిన రంగులతో నచ్చినట్లు పెయింట్ చేసుకోండి. అంతే.. ఉండ్రాళ్ళ కుండ రెడీ! ఉండ్రాళ్ళ కుండేంటీ అనుకుంటున్నారా? ఎందుకో దీన్ని చూస్తున్నపుడు ఉండ్రాళ్ళే కళ్ళలో మెదుల్తూ ఉన్నాయి మరి. అందుకే దీనికి ఆ పేరు పెట్టాను :)

మొత్తానికి ఈ కుండ కళను ప్రదర్శించాక నేనూ, నా మనసూ.. ఇద్దరం హ్యాపీ హ్యాపీ :D

By the way.. how do you like it?

Sunday, July 27, 2014

'ఆమె' మరోసారి

"రిచయమయి పది నెలలు కూడా పూర్తవ్వలేదు. కల్మషం లేని తన ప్రేమతో నా మనసు గెలుచుకుంది. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఏమాత్రం అహం చూయించక వెంటనే కలిసిపోయే ఆమె వ్యక్తిత్వం తన పట్ల మరింత ఇష్టాన్ని పెంచుకునేలా చేసింది. జీవితాంతం ఈ స్నేహం కొనసాగాలని తను ఆశ పడి, నేనూ ఆశ పడేలా చేసింది. చాలా తెలివైన అమ్మాయి. ఎదుటి వారు కష్టంలో ఉంటే చూడలేదు. వీలైనంత సహాయం చేస్తుంది. చిన్న చిన్న సంతోషాలకు ఎంత సంబరపడుతుందో! చిన్న కుటుంబం తనది. చక్కగా చదువుకుంది. చాలా మంచి జీతం సంపాదిస్తూ కుటుంబానికీ ఆసరాగా ఉంటోంది. 

ఇంత చక్కని అమ్మాయితో వచ్చిన చిక్కల్లా ఒక్కటే. మనసు, మంచి అంటే ఏంటో కూడా తెలియని ఒక వెధవని ప్రేమించింది. (ఆమె నాతో చెప్పిన మాటల ప్రకారం) అతను ఎంత వెధవంటే.. భూప్రపంచంలో ఉన్న భాషలు వేటిలోనూ పదాలు లేవు చెప్పడానికి.  ఆర్ధిక అవసరాలకు వాడుకుంటాడు కాని కాసింత ప్రేమను కూడా.. ఛ ఛ అవసరంలేదు కనీసం మనిషిగా కూడా గౌరవించడట. వివిధ రకాలయిన మాటలతో ఆమెను గాయపరిస్తే ఏడుస్తూ నాకు ఫోన్ చేసేది. ముందు, ఇది పూర్తిగా తన స్వవిషయం అని విని బాధపడి ఊరుకున్నాను. తరువాత మా మధ్య పెరిగిన అనుబంధంతో చనువు తీసుకుని "అయితే అలాటి వాడితో జీవితం పంచుకోవాలని ఇంకా ఎందుకు అనుకుంటున్నావు? నా మాట విను.. జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకోకు. ఒక్కసారి మనసుని పక్కన పెట్టి మెదడుతో ఆలోచించు" అని నానా విధాలుగా చెప్పాను. మౌనంగా విని ఊరుకునేది. మళ్ళీ యాధామాములే. అతను పో పోమ్మంటున్నా నువ్వే కావాలంటూ కాళ్ళు పట్టుకునేదిట! ఎప్పుడు ఫోన్ చేసినా అతని గురించి చెప్తూ కంటతడి పెట్టుకునేది. నాకు చాలా కోపం వచ్చేది తన ప్రవర్తనతో. చెప్తేనేమో వినదు.. ఇరవ్వయ్యేడేళ్ళు వచ్చిన అమ్మాయి ఇంకా మెచ్యూర్డ్ గా ఆలోచించలేకపోతే ఎలా?!!. పోనీ నిజంగా తెలియకా అంటే అదీ కాదు.. అన్నీ తెలుసు కాని ఏదో పిచ్చితనం. ఎన్నో విధాలుగా చెప్పి చెప్పి నా నోరు వాచిపోయింది కాని ప్రయోజనం లేదు. ఇక విసుగొచ్చి ఒకరోజు "ప్లీజ్ ఇకపై నీ ప్రేమకు సంబంధించిన విషయాలు నాకు చెప్పకు. వింటుంటే ఎంతో బాధా కోపం వస్తున్నాయి. నీ కన్నీటికి కేవలం నువ్వే కారణం. నీకది తెలిసినా కోరి కోరి నువ్వే కొనితెచ్చుకుంటున్నావ్" అన్నాను. తరువాత నుండి మేము ఈ విషయం మాట్లాడుకోలేదు. 

పోయిన శని వారం ఏదో పిండి వంటలు చేస్తూ ఉండగా తను ఫోన్ చేసింది. చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ లోపు నాకు ఇంకాస్త పిండి కలపాల్సి వచ్చింది. ఫోన్ చేత్తో పట్టుకుని కష్టమని, ఒక్క 5 మినిట్స్ లో కాల్ చేస్తాను ఆగు అని చెప్పాను. "సరే" అంది. అన్నట్లుగానే ఐదు నిముషాల్లో ఆమెకు ఫోన్ చేశాను. గొంతు కాస్త బొంగురుగా వినిపించింది. చీదుతూ "ఆ చెప్పు ప్రియా" అంది. "అరె ఏమైంది? ఎందుకలా ఉన్నావ్?" అంటూ కంగారుపడ్డాను. "ఏమీ లేదు అతనికి ఫోన్ చేశాను" అంది. నాకేం మాట్లాడాలో అర్ధం కాలేదు. తను ఏడుస్తూ ఉంది. "అయ్యో.. ప్లీజ్ నువ్వలా ఏడవకు. Things will be alight" అన్నాను. "సరే ప్రియ.. నేను రాత్రికి ఫోన్ చేస్తాను నీకు" అంది. సర్లే డిస్టర్బ్డ్ గా ఉంది కదా కాసేపటికి సర్దుకుంటుందిలే అని ఊరుకుని "సరే" అని చెప్పి ఫోన్ పెట్టేసాను. 

సరిగ్గా వారానికి ఆమె మరణ వార్త నాకందింది. నేను తనతో మాట్లాడిన రాత్రే తను చనిపోయిందట! విన్న చాలాసేపటి వరకు మామూలు మనిషిని కాలేకపోయాను. తేరుకున్నాక చాలా కోపం వచ్చింది. ప్రాక్టికల్ గా చూస్తే..  ఆ ఇంట్లో పెళ్లి కుదిరిన మరో ఆడపిల్ల ఉంది. వాళ్ళ అమ్మానాన్నలకు ఈమె జీతమే ముఖ్యమైన ఆధారం. ఇక మానసిక బాధ గురించి చెప్పాలంటే ఆమె కుటుంబానికి ఎంత కాలం పడుతుంది చెప్పండి ఈ బాధ నుండి తేరుకోవడానికి? ఇప్పట్లో మామూలు మనుషులు కాగలరా?? ఎంత బద్ధ శత్రువైనా చావుని కోరుకోము కదా.. అలాటిది ఎంతో ప్రేమించే తమ కుమార్తె/సహోదరి ఇక ఎప్పటికీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందంటే ఎంత బాధ??? ఆమె చెప్పిన దాని ప్రకారం.. ఆ అబ్బాయి తనను ఎంతో అవమానపరుస్తాడు, లెక్క చేయడు, అమ్మాయిల పిచ్చి కూడా ఉంది. మరి అలాటి అబ్బాయి కోసం కన్న తల్లిదండ్రులకు, తోడబుట్టిన దానికీ ఇంతటి బాధను మిగల్చడం తగునా? 

ఆమె మీద నా కోపం నిముష కాలమే. కాసేపటికి కన్నీరు మున్నీరయ్యాను. పిచ్చి పిల్ల.. ఎంత పని చేసింది!!! అయ్యో.. ఒక్కసారి సమయం వెనక్కి వెళితే ఎంత బావుండు! అస్సలు నేను ఫోన్ పెట్టకపోదును. తను ఇక లేదు.. తిరిగి రాదు అన్న విషయాన్ని నేనింకా జీర్ణించుకోలేకపోతున్నాను. వచ్చేనెల 17 తారీఖున ఆమె పుట్టిన రోజు. ఆ రోజున తన దగ్గరకు వెళ్ళాలనుకున్నాను ఏవేవో ప్లాన్స్ వేసుకున్నాం..  :(

చనిపోవాలన్న తాత్కాలిక ఆలోచనను అధిగమించి ఉంటే తన విలువైన జీవితాన్ని కోల్పోయి ఉండేది కాదు. తెలియక చేస్తే అది పొరపాటు. కాని తెలిసి తెలిసీ చేస్తే అది పాపం. అందునా ఆత్మహత్యా మహా పాపం. నాకు మాటలు రావడం లేదండీ. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఆ కుటుంబం దేవుని ఓదార్పు పొందుకోవాలనీ మనసారా ప్రార్దిస్తున్నాను.  

ఒక్క మాట! మీకు తెలుసూ.. అయినా నేను మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రతి మనిషికీ సమస్యలుంటాయి. సమస్యంటూ లేని మనిషే ఉండడు. కాని జీవితంలో ఎదురయే కష్టాలకన్నా (అది ఎటువంటిదైనా సరే..) జీవితం ఎంతో గొప్పది/విలువైనది. ఈ విషయం అందరికీ తెలిసినా, కన్నీటి పొరలు మనసుని ఉక్కిరిబిక్కిరి చేసేసరికి మెదడు మొద్దుబారిపోయి తొందరపాటులో ఇటువంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు కొంతమంది. దయచేసి బాధ/కోపం గా ఉన్నపుడు గాని సంతోషంగా ఉన్నపుడు గాని ఎలాటి నిర్ణయాలూ తీసుకోవద్దు. కాస్త ఆలోచించండి."

ఈ పోస్ట్ నేను పోయిన ఏడాది జూన్ నెలలో రాసి పోస్ట్ చేశాను. But due to different reasons, వెంటనే ఒక 5 మినిట్స్ లో డిలీట్ చేసేశా. కాని....... కానీ అదే తప్పు మళ్ళీ ఇప్పుడు నా పాత కొలీగ్ చేసింది.  చాలా బాధగా ఉంది. నాకు తెలిసిన ఈ ఇద్దరు అమ్మాయిలూ అన్ని విషయాల్లోనూ ఎంతో తెలివిగా, ప్రాక్టికల్ గా  ఉండేవారు.. అయినా....................................  god...... నేనేమీ చెప్పలేకపోతున్నాను. 

ఇది చదివే మీలో ఎవరైనా ఇలాటి ఆలోచనతో ఉన్నట్లయితే, please please please think about it again.

Saturday, May 31, 2014

Voice blogging!!!

Google image 

అవునండీ.. నిజం! నిజంగా నిజం!

ఏంటీ.. ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి మీకు ఇంతకు ముందే తెలుసా?!

నాకు మాత్రం నిన్ననే తెలిసిందండీ. ప్రేమాయణం పార్ట్ 9 రాద్దామని వచ్చి, అటూ ఇటూ తిరుగుతుంటే "bubbly.net" వెబ్ సైట్ కనిపించింది. అలా ఈ వాయిస్ బ్లాగ్స్ గురించి తెలుసుకున్నాను. అంతేనా..  వెంటనే ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసేసుకున్నాను :D

హహ్హ్హహ! క్రియేట్ అయితే చేశాను కానీ..  ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియలేదు :) అయినా జ్ఞాపకంగా ఉంటుంది కదా అని.. రికార్ద్ చేసింది చేసినట్లు అప్లోడ్ చేసేశాను మరి. నా గొంతు నాకు చాలా కొత్తగా (కాస్త చెత్తగా కూడా) అనిపించింది. పోనీలే, తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు.. వినగ వినగ బాగానే ఉంటుందిలే అని సర్దిచెప్పుకున్నాను ;)

మీరూ వింటారా? ఇదిగో http://bubbly.net/Priya7 ఇదే ప్రొఫైల్ లింక్. మీలో ఎవరికైనా అక్కడ ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే నన్నూ ఆడ్ చేసుకోండీ :)

Tuesday, February 18, 2014

ఏమ్మా.. ఏదైనా విశేషమా??

(ఈ పోస్ట్ పెళ్ళైన వారికి మాత్రమే)

ఈ 2 నెలల్లో ఇప్పటికి ఈ ప్రశ్న ఎన్నిసార్లు విన్నానో! ముందు సిగ్గేసింది, తరువాత తమాషాగా అనిపించిది, ఆ తరువాత విసుగొచ్చింది, ఇప్పుడు కోపమొస్తోంది! కనబడితే చాలు "ఏమ్మా.. ఏదైనా విశేషమా??" అని అడుగుతున్నారు.

డిసెంబరు నెలలో అక్కావాళ్ళింటికి వెళ్లి, ప్రయాణం చేసి ఉండడంతో అలసిపోయి అలా నడుం వాల్చాను. ఈ లోపు వాళ్ళ అత్తగారు వచ్చారు "ఏమ్మా.. ఏదైనా విశేషమా?" అన్నారు. నేను లేస్తూ.. "అబ్బే బాబుగాడు నడిచేస్తున్నాడని అక్క చెబితేనూ చూసి వెళదామని వచ్చానండీ" అన్నాను. "అది సర్లేమ్మా. నీరసంగా కనబడుతున్నావే అనడుగుతున్నాను" అన్నారు. నాకు ఆ ప్రశ్నలోని గూడార్ధం తెలియక చాలా మాములుగా "ఆ.. మొన్న జ్వరమొచ్చినప్పటి నుండీ కాస్త నీరసంగానే ఉంటోందండీ. అందునా ప్రయాణం చేసి వచ్చానేమో కాస్త తలనొప్పిగా ఉంది" చెప్పాను. "మరింకేవమ్మా? అదృష్టవంతురాలివే! స్వీట్లు ఎప్పుడు పంచిపెడుతున్నారు?" అని, వెలిగిపోతున్న మొహంతో నా పక్కకొచ్చి కూర్చొని నా చేతులు నిరిమారు. "ఇదేం ఖర్మరా బాబు! బాలేదంటే సంతోషపడిపోతూ స్వీట్లు పంచమంటారేవిటీ? పైగా అదృష్టవంతురాలినట!? నాకు నీ మీద స్పెషల్ అభిమానం ప్రియా అంటుంటారుగా.. ఇదే కాబోలు" అనుకుంటూ ఓ వింత ఎక్ష్ప్రెషన్ తో నోరెళ్ళబెట్టుకుని నేను చూస్తుంటే, మా అక్క కంగారుపడిపోతూ "అబ్బే.. అదేం లేదత్తయ్యా. దానికి వట్టినే కాస్త తలనొప్పని పడుకుందంతే" అని నా చెయ్యి వాళ్లత్తగారి చేతుల నుండి విడిపించి, "నువ్వు లేవవే. వెళ్లి కాళ్ళూ చేతులూ కడుక్కుని రా భోంచేద్దువ్" అంటూ బయటకు తరిమేసింది.

భోజనాలూ అవీ అయ్యాక, నిదానంగా చెప్పింది. ఆవిడ ఏ విశేషం గురించి అడిగారో. నాకు అర్ధమై చస్తే ఒట్టు. బాలేకపోవడానికి దీనికీ సంబంధమేంటో తెలియక తికమక పడి, అక్కని అడిగినా దాని సమాధానాలు నాకెలాగూ అర్ధంకావని లైట్ తీసుకున్నాను. అది మొదలు తెలిసిన వాళ్ళూ, తెలియని వాళ్ళూ ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ ఈ ప్రశ్న వేస్తూ చావగొట్టేస్తున్నారు. నీరసంగా కనిపించినా విశేషమే, ఫ్రెష్ గా కనిపించినా విశేషమే! మొన్న ఎందుకో మూడ్ బావుండి చక్కగా కొత్త కాటన్ చీర కట్టుకుని, ముందు రోజు మాల కట్టుకున్న జాజుల మాల తల్లో తురుముకున్నాను. అంత రెడీ అయ్యాక బయటకు వెళ్ళకపోతే ఎలా మరీ? అందుకే, పక్కన కాయగూరల కొట్టుకెళ్ళి ఆకుకూరేమైనా తెచ్చుకుందామని బయలుదేరాను. వచ్చేప్పుడు భరత్ అడిగాడని గుడ్లు కూడా కొన్నాను. నాకసలే కుదురెక్కువా.. ఎక్కడ పగులుతాయోనని నిదానంగా నడుచుకుంటూ వచ్చి గేట్ తీశాను. ఇంతలో పక్కింటి ఆంటీ పలకరించారు చీర బావుందంటూ. నవ్వుతూ థాంక్స్ చెప్తున్నానూ.. అంతలోనే ఆవిడ "చాలా కళగా కనబడుతున్నావు. ఏవైనా విశేషమా ఏంటమ్మాయ్?" అనేసారు. బలవంతాన పెదాల మీది చిరునవ్వు చెరగనీయకుండా, "అదేం లేదాంటీ. మొన్ననేగా పెళ్లైంది.. అప్పుడేనా? సరే వెళ్ళొస్తాను" అని గబగబా కదిలాను. ఆవిడ వదిలితేనా?? "ఏం మొన్నమ్మాయ్? మీ పెళ్లై మూడు నెలలు అయిపోవడంలేదా? ఇంకా లేకపోవడం ఏంటీ? త్వరగా కనేయండి. నేనెందుకు చెప్తున్నానంటే..... ......... ................" అంటూ పావుగంట వాయించేశారు!

అది బయటి వాళ్ళగోల. మా అత్తగారైతే మొన్న సంక్రాంతి పండుగ నుండి పట్టుకున్నారు. "వద్దనుకుని మందులేమైనా మింగుతున్నావా అమ్మాయ్? ఇదిగో అలాటివేం చేయకండి చెప్తున్నాను. ముందు వద్దు అనుకున్నారంటే తరువాత కావాలన్నా పుట్టరు. .... ... .. .. ......." అంటూ రోజుకోసారి క్లాసులు తీసుకుంటున్నారు. అక్కడికీ సిగ్గుని పక్కన పెట్టి, "అయ్యో అలాటిదేం లేదు అత్తయ్యా. దేవుడు కనికరించొద్దూ" అన్నాను కూడాను. అయినా విననిదే! పై పెచ్చు "నాకసలే ఒంట్లో బావుండడం లేదమ్మాయ్. మనవరాలు పుడితే దాన్ని చూసి సంతోషంగా ఈ నాలుగు రోజులూ గడుపుదామనీ అంతే" అంటూ 80 ఏళ్ళ ముసలావిడలా బాధపడుతున్నారు. ఆవిడని సముదాయించేలోపు నా తల ప్రాణం తోకకొచ్చేస్తోంది. ఏదో పెళ్లై పద్నాలుగేళ్ళైనా పిల్లలు కలగనట్లు వీళ్ళు డిప్రెషన్ లోకి వెళ్తూ నన్నూ లాగుతున్నారు.

దీనికి కొసరుమెరుపు "అప్పుడే మనకు పిల్లలెందుకు? ఇంకాస్త కెరీర్లో సెటిల్ అయ్యాక చూసుకుందాం. ఈ బ్యాంకు ఉద్యోగాలతో ఎక్కడ వేగేది అస్తమాను ట్రాన్స్ఫర్స్ తో? వాళ్ళు కబుర్లు చెప్తారు కానీ కన్నాక వచ్చి ఉండి చూసుకోలేరుగా.. ఎవరి ఉద్యోగాలు వాళ్ళకున్నాయి. నేనూ ఆఫీసు కి వెళ్ళిపోతాను. నువ్వు ఒక్కదానివే మేనేజ్ చేయలేవ్. పిల్లల్ని చూసుకోవడం అంటే మాటలు కాదు. మీ అక్క అంటే ఉమ్మడి కుటుంబంలో ఉంది కనుక సరిపోతోంది" అంటూ చల్లగా అయినా నిక్కచ్చిగా భరత్ చెప్పడం.

మీ లైఫ్ లో ఇలాటి పరిస్థితి ఎదురైందా? మీరేమంటారు? అనుభవముంటే తోడపుట్టిన దాన్నో, స్నేహితురాలినో అనుకుని కాస్త మంచి సలహాలివ్వండి.

Saturday, February 15, 2014

కొత్త కాపురం

ఏంటండీ.. ఎలా ఉన్నారు? చాలా రోజులయిపోయింది మిమ్మల్ని పలకరించి. "ఏమైపోయావ్ అమ్మాయ్..?" అంటూ మెయిల్స్, కామెంట్స్ చేసిన స్నేహితులందరికీ నా ధన్యవాదాలు. "ఈ సారి ఏం సాకు చెబుతావ్" అని గుర్రుగా చూడకండి. మీకు తెలియనిదేముందండీ... కొత్తగా పెళ్లైంది కదా.. :) కొత్త జీవితంలో కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. అందుకే బ్లాగింటి తలుపులు తెరవలేదు. అలా అని రాయడం మానేశానని కాదు.. మరీ పర్సనల్ విషయాలు కావడంతో డైరీతో చెప్పాల్సి వచ్చింది కబుర్లన్నీను ;) 

అదిగో.. అలా మూతి విరుపులెందుకండీ? నా కొత్త జీవితం ఎలా ఉందో మీకూ చెప్పాలనే కదా ఇప్పుడు రాస్తోంది? "ఈ అల్లరి గడుగ్గాయికి పెళ్లవుతోంది కదా.. ఇహ బుద్ధిగా ఉంటుంది, ఆ వసపిట్ట వాగుడికి ఈ మూడు ముళ్ళతో ఆనకట్ట పడుతుంద" ని పెద్దవాళ్ళు అంటుంటే, చాటుగా నవ్వుకున్నాను. "నాదేమైనా అరేంజెడ్ మ్యారేజేవిటీ ఇవన్నీ జరగడానికి? హహ్హహ..  భరత్ చాలా మంచోడు నా అల్లరికి వచ్చిన డోఖా ఏమీలేదు" అనుకున్నాను! ఇప్పుడు అర్ధమవుతోంది పెద్దల మాట పెరుగన్నపు మూట అని ఎందుకంటారో :)

ఉదయం ఆరున్నరా ఏడు కి మొదలవుతోంది నా రోజు (అంతకన్నా ముందు రోజూ లేవాలంటే నావల్ల కాదు బాబూ). ఇంట్లో అంటే అమ్మ లేపేది కనుక సరిపోయేది. ఒకవేళ ఆవిడ లేకపోతే అలారం పెట్టుకుని దాన్ని స్నూజ్ చేస్తూ నా ఇష్టమొచ్చినంతసేపు పడుకునేదాన్ని. ఇప్పుడు నాకా సౌలభ్యం లేదు మరి! అయినా నాకు కాస్త మొహమాటం తక్కువా, భరత్ కి ఎక్కువా కావడంతో ఇంట్లోలానే సాగిపోతోందనుకోండీ.. :P 

గబగబా బ్రష్ చేసి నాలుగు చెంబులు నీళ్ళు ఒంటిమీద దిమ్మరించుకుని కిచెన్ లోకి అడుగుపెడతాను. పాపం మావారు నాలా కాదండోయ్.. రాత్రి ఏ వేళకు పడుకున్నా, ఐదు ఐదున్నర కల్లా టంచనుగా లేచి కూర్చుంటారు. మనం అప్పుడు మాంచి నిద్రలో ఉంటాం. కాస్త పొద్దెక్కనిదే మనకు మెలకువ రాదు :(. ఎలాగైనా తనతోపాటుగా లేవాలని నడుంకట్టుకుని బాగా కృషి చేశాను కానీ, నా ఖర్మకొద్దీ అలా ప్రయత్నించిన రోజుల్లో ఇంకో అరగంట లేట్ అవుతోంది గానీ కనీసం మామూలు టైం కి ఐదు నిముషాలు కూడా ముందు అవడంలేదు! అయినా సరే ఇప్పటికీ నా నడుం కట్టు వదల్లెదనుకోండీ.. పట్టు వదలని విక్రమార్కురాలిలా ప్రయత్నిస్తూనే ఉన్నాను (ఇందుకు చక్కటి ఇల్లాలవ్వాలన్న తాపత్రయంతో పాటు మరో ముఖ్య కారణం కూడా ఉంది. సమయం వచ్చినపుడు చెబుతాను). సర్లే.. ఇప్పటికే నా నిద్ర గురించి ఎక్కువ రాసేశాను. లేనిపోయింది.. ఇది చదివి చదివి మీకు నిద్రొచ్చేస్తుందేమో?! 

ఉమ్మ్.. అలా కిచెన్ రూం లోకి వెళ్లి గబగబా పాలు కాచి, ఏ ఇడ్లీయో.. దోశలో చేస్తూ పనిలో పనిగా  రైస్ కుక్కర్లో పెట్టేస్తాను. కూర.... ...... కొత్తలో చాలా ఉత్సాహంగా వండేదాన్ని. కానీ రోజులు పోగాపోగా కూర వండాలంటేనే విసుగ్గా ఉంటోంది. ఇంట్లో అమ్మని "ఈ వేళ కూరమ్మా?" అని రోజుకి రెండు సార్లు అడిగినా విన్న సమాధానమే వింటున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు.  అదే ఇప్పుడు భరత్ నన్ను "ఈ వేళ ఏం వండుతున్నావ్ ప్రియా?" అని అడిగితే ఏడుపొచ్చేస్తోంది! కాయగూరల కోసం మార్కెట్ కి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది! ఏమీ అర్ధం కావడంలేదా మీకు? హుం హుం హుం! ఊ ఊ ఊ...  రోజూ అవే కూరలండీ బాబు. విసుగొచ్చేస్తోంది. అందులోనూ ఈయన బంగాళదుంప, వంకాయ, బెండకాయ, అప్పుడపుడూ మునక్కాయా, పప్పూ తోటకూరా (ఏ ఆకు కూరైనా సరే పప్పులో వేస్తేనే తింటాడు తప్ప తాలింపు పెడితే గిట్టదు), పనీర్, మష్రూమ్.  అంతే. మరో కూరగాయ వైపు కన్నెత్తైనా చూడడు, చూడనివ్వడు. కారెట్, బీట్రూట్లను పచ్చిగానో, జ్యూస్ రూపంలోనో తీసుకుంటాడు కానీ వేపుడు చేస్తే తాకడు. మరి నేనేమో తినని కాయగూరంటూ లేదు. పొట్లకాయ, బీరకాయ, కంద, చేమ దుంప, అరటి, అరటి దూట, చౌ చౌ, చిక్కుడు కాయ, కాకరకాయ, దుంపలు, కాలిఫ్లవర్, క్యాబేజ్, ఇలా అది ఇదీ అని లేకుండా అన్నీ తింటాను. చక్కగా అంత పప్పూ, రెండు వేపుళ్ళూ, ఇంత ఆవకాయ వేసుకుని తినే ప్రాణం..  ఇప్పుడు ఈయనగారి పుణ్యమా అని ఆయనకు నచ్చిన ఆ నాలుగైదు కూరలనే (పైగా తనకు ఏవైనా రెండు కూరలను కలిపి తినడం నచ్చదు. రోజుకి ఒక్క కూరే. అంతెందుకు పప్పులోకి దుంప వేపుడు కూడా నచ్చదు) తినీ తినీ ప్రాణం బిక్క చచ్చిపోతోంది. తనేమో "ఏం కూరగాయలే బాబూ.. నాలుక చచ్చిపోతోంది. నిన్ను కట్టుకున్నాక మరీ మేక బ్రతుకయిపోయింది. అసలు మేక మాంసం తిని ఎన్ని రోజులయిపోతోందో.." అని ఏడుపు!! 

అవీ నా కూర కష్టాలు. సో.. అలా  రొటీన్గా ఏదో ఒక కూర చేసి బాక్స్ పెట్టి తనను ఆఫీసు కి పంపించేశాక, నేనూ ఏదో తిన్నాననిపించి ఇక పెయింట్లు, పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంటున్నాను. పగలు నిద్రపోయే అలవాటు లేదు కనుక బోర్ కొడితే కాసేపు గీతక్కతో కబుర్లు, కాసేపు టీవీ కాలక్షేపం. మధ్య మధ్యలో అంట్లూ, బట్టలూ, ఊడ్చడాలూ, తుడవడాలూ యధామామూలు :)

ఈ వంటలు, మంటల మాటలు పక్కన పెడితే.. మా కాపురం చాలా బావుంది. పూర్తిగా తియ్యగా ఉందని చెప్పను. ఉగాది పచ్చడిలా వివిధ రకాల రుచులతో ఎంతో బావుంది. మా సాంప్రదాయాలు, వ్యక్తిత్వాలూ, అలవాట్లు, అభిరుచులూ, మేము పెరిగిన వాతావరణాలు, అన్నీ వేరు. కానీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమను బట్టి కొన్నిసార్లు తను నాకోసం, మరికొన్నిసార్లు నేను తన కోసం అడ్జస్ట్ అవుతూ ఇద్దరం ఒక్కరవుతున్నాం. 
పెళ్ళికి ముందు "ఆ ఏముందిలే పెళ్ళిలో.. కలిసి ఉండడం అంతే కదా" అనిపించేది. కానీ కాదు. పెళ్ళిలో ఏదో మేజిక్ ఉంది. నిన్న మొన్నటి వరకూ నాన్న, అక్కా, అమ్మా వీళ్ళే నా ప్రపంచం. వాళ్ళ తరువాతే భరత్ అయినా. కాని ఇప్పుడు? వాళ్ళ ముగ్గుర్ని పక్కకు నెట్టి మొదటి స్థానం భరత్ తీసేసుకున్నాడు! చాలా విచిత్రంగా ఉంది. ఈ మేజిక్ పెళ్ళైతేనే అర్ధమవుతుందనుకుంటాను. కదూ??